ఇకనైనా టీవీ ప్రసారాలు, సీరియల్స్ తీరు మారదా?

Mar 9, 2025 - 23:28
 0  1

ఇకనైనా టీవీ ప్రసారాలు, సీరియల్స్ తీరు మారదా?* ప్రసారాలు అందిస్తున్న జన సందేశం ఏమిటి?* కల్పితాలు, కుట్రలు, కుతంత్రాలు, జీవన విధ్వంసం, సామాజిక రుగ్మతలను పెంచి పోషించడం తప్ప!!!

************************************

--- వడ్డేపల్లి మల్లేశం 90142206412 

----01...12...2024*********-**********

పుట్టుకనుండి చావు మధ్యన గల జీవితాలకు సార్థకతను చేకూర్చడంలో వ్యక్తులు కుటుంబాలు సమాజము అందుకు తోడుగా ప్రభుత్వాలు కూడా కీలకపాత్ర వహించవలసిన తరుణంలో ఎక్కడికక్కడే సామాజిక విధ్వంసం కొనసాగుతూ ఉంటే దానికి టీవీ ప్రసారాలు సినిమాలు సెల్ఫోన్ వ్యవస్థ బరితెగించినటువంటి సామాజిక అంశాలు కూడా కీలక పాత్ర వహిస్తున్న నేపథ్యంలో వ్యక్తుల ప్రవర్తనను గట్టిగా మందలించవలసిన తరుణం ఆసన్నమైనది. నిజ జీవితానికి భిన్నంగా కల్పితాలు, కల్లోలాలు, కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసాలు, అసూయ ద్వేషాలు, అనాగరిక చర్యలు ఊహించని పరిణామాలు, ఉద్వేగ ఆలోచనలు మనిషి జీవితాన్ని కల్లోలం చేస్తుంటే ఎటువైపు పయనించాలో తెలియని దయనీయ పరిస్థితుల్లో నేటి మానవుడు ఆందోళన చెందుతున్న విషయం కాదన లేని సత్యం. అందుకే అందెశ్రీ గారు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ రాసిన గేయం మానవీయ విలువలు ఏ రకంగా అడుగంటిపోతున్నాయో అర్థం చేసుకోవ దానికి తోడ్పడుతుంది. మంచి చెడు అమానవీయ సంస్కృతి అరాచకాలు అకృత్యాలు దోపిడీలు దహనకాండ ఇతర కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురాలోచన నిజజీవితంతో పాటు సినిమా టీవీ ప్రసారాలు సీరియల్లో నిత్యం దర్శనమివ్వడం ఆందోళన కలిగించే అంశం. అయినా వీటన్నింటికీ నాయకత్వం వహించి ప్రజల కష్టసుఖాలకు సామాజిక ఔన్నత్యానికి బాధ్యత వహించవలసినటువంటి పాలకవర్గాలు మౌనంగా ఉండడం అంటే నిజంగా సిగ్గుచేటు. తమ బాధ్యత రాహిత్యాన్ని ప్రభుత్వాలు అంగీకరించి చేరాలి.

        టీవీ ప్రసారాలలో కొనసాగుతున్నటువంటి యాంత్రిక జీవితం, అసూయా ద్వేషంతో కూడుకున్నటువంటి ఎత్తుగడలు, అమానవీయ సంఘటనలు, మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలు, ధూమపానాన్ని ఆకాశానికి ఎత్తే దృశ్యాలు కల్లారా చూస్తూ ఉంటే... M ఇంటి కోడలు ఆడబిడ్డలు అత్తమామలు కొడుకు కోడలు తోటి కోడలు అన్నదమ్ముల అనుబంధం నిత్యం కల్మషమై కొనసాగుతూ ఉంటే దానికి ప్రతిరూపంగా టీవీ ప్రసారాలలో సన్నివేశాలను చూపించడం తద్వారా ప్రభావితమైనటువంటి అనేక కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం కావడం పరస్పర పూరకాలు పరస్పర ప్రభావితాలు పరస్పర ప్రతీకలుగా నిలబడుతున్న విషయం ఇప్పటికీ అంగీకరించకపోతే ఎలా? ఎవరికి వారిమే మౌనంగా చూస్తూ జరుగుతున్న నేరాలు ఘోరాలను కల్లారా చవిచూచి అనుభవించి మాట్లాడకుండా మనకేమీ పట్టనట్లు చూస్తూ ఉంటే ఎలా మిత్రమా! చిన్న గడ్డి పరకకు అగ్గి అంటుకుంటే గడ్డివాముతో పాటు ఊరంతా మాడి మసి అయిపోయి నామరూపాలు లేకుండా పోయినట్లు ఒక్కచోట ప్రారంభమైనటువంటి అసత్యాలు అవినీతి ఆకృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు తప్పుడు భావనలు కల్లారా టీవీ ప్రసారాలలో ప్రజలకు చూపిస్తూ ఉంటే వాళ్ల మనసుల్లో నాటుకున్న తర్వాత ఆపరిణామం సంగతేమిటి? దానివల్ల మంచివైపు ఆలోచించరు అనే సోయి లేనటువంటి టీవీ ప్రసారాల నిర్మాతలు, రచయితలు, నిర్వాహకులు, దానికి బాధ్యత వహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు సామాజిక చింతన లేకుంటే పరిణామం ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గడ్డివాము కాలిపోయినట్లుగా సమాజం బ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉన్నది అని పాలకులు తెలుసుకోకుంటే అది ప్రభుత్వాలకే ఏకు పోయిమేకు కా వచ్చు జాగ్రత్త! తెలంగాణ ఉద్యమ కాలంలో గొప్పగా చెప్పుకున్న ఉద్యమ నాయకత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏదో సంస్కృతి నాశనం అయిపోయినట్లు అధికారానికి వస్తే రాష్ట్రాలు విడివిడిగా ఏర్పాటయితే తమ సంస్కృతిని కాపాడుకోవడానికి విస్తృతంగా పని చేస్తామని మాట ఇచ్చినటువంటి ఉద్యమ కూటమి చెప్పుకున్న రాజకీయ పార్టీలు ఆ తర్వాత ఆ వైపుగా కన్నెత్తి చూడలేదు అంతకుమించి గోరాతి ఘోరంగా సీరియల్ ప్రసారాలు దృశ్యాలు అసాంఘిక కార్యక్రమాలు నగ్న సన్నివేశాలు సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నాయి దీనికంతటికి వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి వర్గాలతో పాటు కేంద్ర బిందువైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

  ప్రసారాలు అందిస్తున్న సందేశం ఏమిటి ?

*********************************

   కథలు కల్పనలు సన్నివేశాలు సీరియల్ జోకులు ఇతరత్రా కొనసాగుతున్న అన్ని కార్యక్రమాలలోనూ స్త్రీని కేంద్ర బిందువుగా చూపించడంతోపాటు మరిన్ని సామాజిక రుగ్మతలను పెంచి పోషించడానికి ఈ ప్రసారాలు కారణము కావడం ఆందోళన కలిగించే విషయం. అకృత్యాలు అత్యాచారాలు హత్యలు దోపిడీలు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు నిరంతరము ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంటే అందులో భారత దేశంలో క్షణక్షణానికి ఆందోళన కలిగించే సన్నివేశాలు నిజజీవితంలో దర్శనమిస్తుంటే బాధ్యత వహించవలసినటువంటి ప్రభుత్వాలు చేతులు ముడుచుకొని జరుగుతున్న కార్యకలాపాలు ప్రసారాలు సన్నివేశాలు టీవీ ప్రసారాలు సెల్ఫోన్ వ్యవస్థ క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యం మందులు ఇతర మత్తు పదార్థాలు యధావిధిగా కొనసాగుతూ ఉంటే మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ధూమపానముతో మద్యపానంతో కోట్లాదిమంది ప్రజలు అనారోగ్యం బారిన పడి తమ కుటుంబాలకు దూరమైపోతున్నా సోయి లేని ప్రభుత్వాలను కదిలించేది ఎవరు? కవులు కళాకారులు మేధావులు అనేక ఉద్యమాలు ప్రదర్శనలు కళారూపాల ద్వారా రచనల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్నప్పటికీ ఆ క్రమము లోపల ఆలోచించనటువంటి సామాన్య ప్రజలు ప్రభుత్వాలకు చెవికి ఎక్కేది ఎన్నడు ? వ్యక్తుల మధ్యన ఘర్షణలు, కుటుంబ సభ్యుల మధ్యన విమర్శలు, సామాన్యుల జీవితానికి సంబంధం లేని కథలు, పెట్టుబడి దారి సంపన్న వర్గాల జీవితాలలోపల కొనసాగుతున్నటువంటి సంఘర్షణలు లేదా జీవన చిత్రాన్ని సామాన్య ప్రజానీకానికి చూపించవలసిన అవసరం ఉందా?అది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది నిర్వాహకులు నిర్మాతలు రచయితలు నటులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రచయితలు టీవీ ప్రసారాల నిర్మాతలు సామాన్య ప్రజానీకం గురించి ఆలోచించాలి సామాన్య ప్రజల జీవితానికి సంబంధం లేని రచనలను సన్నివేశాలను వెంటనే నిషేధించాలి ఆ వైపుగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.

మానవీయ సమాజాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి తరుణంలో అమానవీయ సంఘటనలకు ఆస్కారం ఇస్తూ వ్యక్తుల మధ్యన కుట్ర లు కుతంత్రాలు ఘర్షణలు సంఘర్షణలు నిరంతరం కొనసాగేలా సన్నివేశాలను చూపిస్తూ సీరియళ్లు ప్రజల జీవితాలను భ్రష్టు పట్టిస్తున్న తరుణంలో ఆలోచించే వాళ్ళు లేకపోవడం, మాకేమిటి అని పట్టించుకోకపోవడం, కేవలం చూస్తూ కాలయాపన చేయడం, సాధారణ ప్రేక్షకులుగా పేద ప్రజలు కూడా మౌనంగా ఉండడం ఇవన్నీ కూడా అందరూ సామాజికంగా బాధ్యత వహించవలసిన కర్తవ్యాలే. ఇక బుద్ధి జీవులు మేధావులు వామపక్ష భావజాలం కలిగిన వాళ్లు ప్రగతి కారులు అని చెప్పుకునే వాళ్లు కూడా ఇలాంటి అంశాల పట్ల మౌనంగా ఉండడం..... ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటారు లేక కేసులు పెడతారు అని అనుమాన పడి భయపడినంత కాలం కలుషితమైన వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంటుంది..... ప్రశ్నించకుండా మౌనంగా నీవు ఉంటే నీ పునాదులు పేక మేడలా కూలిపోతాయి జాగ్రత్త!.

        ప్రతి విషయంలోనూ ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్న కారణంగానే సమాజము విచ్ఛిన్నమవుతున్నది అనే విషయాన్ని అంగీకరించి తీరాలి. ఆ వైపుగా సమీక్షించుకొని ప్రభుత్వాలు తమకు తాము ప్రక్షాళన చేసుకొని తమ బాధ్యతలను గుర్తించే ప్రయత్నం చేయనంత కాలం ఇలాగే వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుంది. ప్రశ్నించేవాళ్లు ప్రజలకు ప్రభుత్వాలకు కూడా ద్రోహులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆలోచన సరిగా లేనప్పుడు మన వాడే పరాయి వాడు, మిత్రుడే శత్రువుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త! అందుకే ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఆ సందర్భాన్ని సన్నివేశాన్ని గుర్తించడం కూడా అంతే! ఆ రకమైనటువంటి ఆలోచన టీవీ ప్రసారాలు సెల్ఫోన్ వ్యవస్థ సినిమా రంగం పట్ల సామాన్య ప్రజానీకానికి ఉండవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నదని గుర్తిస్తే మంచిది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడుహుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333