ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన వారికి బిల్లు మంజూరు చేయాలి.KVPS
జోగులాంబ గద్వాల 24 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన వారికి బిల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ .వెంకటస్వామి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ. పరంజ్యోతి డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింగ రావు కి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐజ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన KM ఆనందం అనే దళితునికి వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టుగా స్థానిక అధికారులు చెప్పారన్నారు.అందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా అందజేశారని అన్నారు . అధికార యంత్రాంగం చెప్పిన మాట ప్రకారం బేస్మెంట్ వరకు అప్పు చేసి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు.తీర బిల్లు గురించి అడిగితే స్థానిక అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇంటికి మీరు అనర్హులని చెబుతున్నారని,ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మీ పేరు లేదని తిరస్కరించారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, లబ్ధిదారునికి ప్రొసీడింగ్స్ సైతం అందజేసి మళ్లీ రద్దు చేయడం దేనికని ప్రశ్నించారు.స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితో కేటాయించిన ఇళ్లను రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు. భార్యాభర్తలు ఇద్దరు పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని సంతోషిస్తూ అప్పు తెచ్చుకొని మరి బేస్మెంట్ వరకు నిర్మించుకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఇప్పటికే జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించబడిన వారు కూడా ఇల్లు నిర్మించుకోకుండా వాయిదా వేశారని, అటువంటిది నిర్మాణానికి సిద్ధమవుతున్న వారిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు.కాబట్టి తక్షణమే ఆనందం అనే దళితునికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణనికి సంబంధించిన పూర్తి బిల్లును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, కొత్త పల్లి గ్రామ నాయకులు సాగర్, బిల్ గ్రామ్, అమృత్ రాజు, కే.ఆంజనేయులు, పి.చంద్రశేఖర్, ఉపేంద్ర, రాజు, సంజీవ్ కుమార్, సైమన్ తదితరులు పాల్గొన్నారు.