ఆశల పల్లకిలో పల్లె పోరు
గత ఆరు నెలలుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) బుధవారం షెడ్యూలు విడుదల చేయడంతో గ్రామాల్లో సమీకరణాలు మొదలయ్యాయి.
ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారులకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు వచ్చే నెల 6 నుంచి సవరణ ప్రక్రియ ప్రారంభించి 21న పంచాయతీల్లో వార్డుల వారీగా తుది జాబితా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఈ జాబితా ఏ విధంగా రూపకల్పన చేయాలనే దానిపై ఈ నెల 12న జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ అందించిన విషయం తెలిసిందే.
'అసెంబ్లీ' జాబితా ఆధారంగానే..
శాసనసభ ఓటర్ల జాబితా అనుసరించి 2024 ఫిబ్రవరి 20న ప్రచురితమైన జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా కొత్త జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. ఓటర్ల ఫొటోలతో కూడిన తుది జాబితా ప్రచురణ అనంతరం వాటిలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తం ప్రక్రియను ఎంపీడీవోలు, ఎంపీవోలు తమ పరిధిలోని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పర్యవేక్షించనున్నారు. కాగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్..
వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా సిద్ధం చేసి జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శన.
వచ్చే నెల 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు, సలహాల స్వీకరణతో పాటు ప్రకటించిన ఓటరు జాబితాల అందజేత.
వార్డులు, గ్రామాల వారీగా సిద్ధం చేసిన జాబితాలపై సెప్టెంబరు 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ. వచ్చిన అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారి 19వ తేదీన పరిష్కరించాలి.
జిల్లాలోని అన్ని వార్డులు, గ్రామ పంచాయతీల్లో సిద్ధమైన ఓటర్ల తుది జాబితాలను వచ్చే నెల 21న ప్రకటించాలి.