సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగింది
సూర్యాపేట. 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈ రోజుల్లో పాఠశాలల్లో విద్యార్ధులను వేదించడం, మాట వినకపోతే చిన్న పిల్లలు అని చూడకుండా దారుణంగా కొట్టడం లాంటివి చేసే టీచర్లనే ఎక్కువగా చూస్తున్నాం, కానీ విద్యార్ధులను తమ పిల్లల్లా భావించి అక్కున చేర్చుకొని విద్యాబుద్దులు నేర్పే ఉపాద్యాయులు కొందరే ఉంటారు.అలాంటి టీచర్లను వదులుకోవడానికి విద్యార్ధులు అసలే ఇష్టపడరు.
ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో సైదులు అనే తెలుగు ఉపాద్యాయుడు గత 14 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు.
ఇటీవలే ఆ టీచర్ ను వేరే దగ్గరకు బదిలీ చేయడంతో చివరి రోజు విద్యార్ధులను కలిసేందుకు పాఠశాలకు వచ్చారు. దీంతో ఇన్ని రోజులు తమతో పాటు ఉన్న టీచర్ బదిలీ పై వెళుతుండటంతో విద్యార్ధులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీచర్ ను చుట్టుముట్టి వెళ్లొద్దు సార్ ప్లీజ్ అంటూ బోరున విలపించారు. విద్యార్ధులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆ టీచర్ కళ్లలో సైతం నీళ్లు తిరిగాయి. అనంతరం ఆ టీచర్ బైక్ తీసి వెళుతున్న సమయంలో పాఠశాల గేటు వద్ద మరోసారి వెల్లొద్దు సార్ అని అడ్డుపడ్డారు. చివరికి వెళ్లక తప్పదని నత్సజెప్పడంతో విద్యార్ధులు తమ టీచర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు.