సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టడం దారుణం కేటీఆర్
సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని..దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ ధ్వజమెత్తారు.మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని కేటీఆర్ పేర్కొన్నారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోంది.సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే కదా అని కేటీఆర్ పేర్కొన్నారు.