ఆసుపత్రి ముందు రోడ్డుపై ఉన్న దుకాణాలను వెంటనే తొలగించాలి... సామాజిక కార్యకర్త గంధం సైదులు
మునగాల 22 ఫిబ్రవరి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కొంతమంది అక్రమంగా హోటల్స్, హెయిర్ సెలూన్, కూల్ డ్రింక్ షాపులు అలాంటి వర్తక వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రహదారిపై ప్రయాణికులకు పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండల సామాజిక కార్యకర్త గంధం సైదులు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం దారి లేకుండా వాహనాలను నిలుపు చేస్తూ వ్యాపారాలను జరుపుకుంటున్నారని, హాస్పటల్ సిబ్బందిపై, వివిధ ప్రాంతాల నుంచి బస్సు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులతో తరచూ గొడవలకు దిగుతూ ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు రోడ్డుమీద నిలబడాల్సి ఉండడంతో ఆయా సందర్భాలలో ప్రమాదాలకు గురవుతున్నారని ఈ విషయం ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన డాక్టర్లు పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గాని వర్తక వ్యాపార కేంద్రాలకు సంబంధించిన వ్యక్తులు కనీసం పట్టించుకోకుండా వారి స్వార్థాలను వారు చూసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బస్సు షెల్టర్ ఉండడంవల్ల ప్రయాణికుల సౌకర్యార్థం దాతలు కొంతమంది వారు కూర్చునేందుకు సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారని వాటిని కూడా అక్కడ ఉన్న వర్తక వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసిన వారే వాడుకుంటున్నారని అన్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థులు మహిళా ప్రయాణికులు బస్సుల కోసం అక్కడ నిలుచుంటే కొంతమంది పోకిరీలు సిగరెట్లు తాగుతూ వారిపై విసిరేయటం టీ గ్లాసులు తాగి విసిరివేయడం ఉమ్మి వేయడం లేనిపోని మాటలు అనడంతో మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రాలు ఆయా దాతలు ఏర్పాటు చేస్తారని, అట్టి స్థలాలు కూడా లేకుండా ఆక్రమించుకున్నారని, రాత్రి వేళల్లో ఆ వర్తక వ్యాపార కేంద్రాలు మధ్యానికి అడ్డాలుగా మారాయని గుర్తు తెలియని దొంగలు రాత్రి వేళల్లో పార్టీ షాపుల్లో తల దూర్చుకొని వెళ్తుంటారని అన్నారు. ఈ విషయమై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి పోకిరిల నుండి మహిళలకు విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న ఆక్రమిత దుకాణ సముదాయాన్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కోదాడ డిఎస్పి, మండల తహసిల్దార్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ కు వినతి పత్రం ద్వారా కోరారు.