జిల్లాలో పకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్

Jul 1, 2025 - 19:25
 0  16
జిల్లాలో పకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్
జిల్లాలో పకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్

జోగులాంబ గద్వాల 1 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, అన్ని శాఖలు సమన్వయంతో ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్ పై సంబంధిత అధికారులతో సమన్వయ  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన తరువాత స్పందించేది కాకుండా, ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.గద్వాల్ జిల్లా రెండు నదులైన కృష్ణా,తుంగభద్ర నదులకు మధ్యలో ఉండటంతో  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పది సంవత్సరాలలో ఎలాంటి విపత్తులు సంభవించినప్పటికీని, 2009 లో వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగింది తప్ప ఇతర సమస్యలు తలెత్తలేదని గుర్తు చేశారు. ఈసారి జిల్లాలో ముందస్తుగా జూన్ మాసం నుండి వర్షాలు కురుస్తున్నందున అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  విపత్తులు రాకముందే ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా స్థాయి మాదిరిగా అన్ని మండలు, గ్రామ స్థాయిలో కమిటీలను తహసిల్దార్  అధ్యక్షతన ఏర్పాట్లు చేసుకొని సమావేశాలను నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు.  అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)ను విపత్తుల జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్టు తెలిపారు. తహసీల్దార్లు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి, సమర్థవంతమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల, విద్య, వైద్య, రోడ్లు భవనాలు, పశుసంవర్ధకం, మత్స్యశాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై అవగాహన కల్పించారు.  వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండి ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు.  నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను, పాఠశాలలను ముందస్తుగానే గుర్తించాలని సూచించారు.  అవసరమైతే వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.  చెరువులు, కుంటల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు వారి పరిధిలోని రోడ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మరమత్తు పనులను చేపట్టాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాలలో గర్భిణీ స్త్రీల కోసం అత్యవసర సేవల కోసం వాహనాలను ఏర్పాటు చేసి తరలించే విధంగా చూడాలని, అదేవిధంగా గ్రామాలలో ఫీవర్ సర్వే నిర్వహిస్తూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఆశాలు,ఏఎన్ఎంలు  చురుకుగా సేవలందించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతూ రోడ్లపై మురికి నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడటం, నీటిలో మునిగిన విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. వరదల వల్ల ఎలాంటి నష్టం సంభవించకుండా మత్స్యకారులతో సమావేశాలు నిర్వహించి పడవలను, గజ ఈతగాళ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల చట్టం ప్రకారం  అన్ని శాఖల అధికారులు బాధ్యతతో పని చేయాలని, ప్రతి  శాఖ అధికారులు వచ్చే రెండు నెలలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలతో విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు.

       జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో భూగోళికంగా ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు లేవని, మారుతున్న వాతావరణానికి అనుకూలంగా వర్షాల వల్ల విపత్తులు సంభవించే అవకాశం ఉందఅన్నారు. భారీ వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న గృహాలు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని, ఇందుకు గాను జిల్లా మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫైర్, ఎలక్ట్రిసిటీ అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల వల్ల నేటి ప్రవాహం పెరిగినప్పుడు ప్రమాదాల నివారణకు మత్స్యకారులు (గజ ఈతగాళ్ళు)  అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఉత్తమ నైపుణ్యాలు కలిగిన యువ పోలీసు అధికారుల బృందాన్ని నియమించి పోలీసు శాఖ అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. 

     ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు, ఆర్డీఓ అలివేలు, సంబంధిత శాఖల అధికారులు,
తహసిల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333