సాహస సిద్ధ పద్ధతిలో కూరగాయల సాగులో అందరికీ ఆరోగ్యం
మునగాల 27 ఏప్రిల్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
సహజ సిద్ధ పద్ధతిలో కూరగాయల సాగుతో అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని సిరి ఫౌండేషన్ వ్వవస్థాపకులు మొలుగూరి గోపయ్య తెలిపారు. శనివారం మునగాల మండల కేంద్రంలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా రోజు రోజుకు కూరగాయల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరుగుతుందని, దీంతో రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయాన్నారు. ఆ కూరగాయలు ఆహారంగా తీసుకోవడం వలన జబ్బుల పాలవుతున్నామన్నారు. ముఖ్యంగా చాప క్రింద నీరులా క్యాన్సర్ సోకుతుందన్నారు. కాబట్టి ప్రతి రైతు ఎలాంటి రసాయనాలు వాడకుండా మనకు అందుబాటులో లభించే సహజ సిద్ధ పద్ధతులతో సాగు చేయవచన్నారు. నేల ఆరోగ్యంగా ఉండాలంటే పశువుల ఎరువు, జీవామృతం, ఘన జీవామృతం వాడాలని, కూరగాయలలో ఆశించే చీడ పీడల నివారణకు వేప గింజల ద్రావణం, నీమస్త్రం, దశ పత్ర కషాయం వాడి సమర్ధవంతంగా నివారించవచన్నారు. దీంతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని, మార్కెట్ లో అధిక ధర లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు పాపారావు, పుల్లయ్య పాల్గొన్నారు.