సమాజం పట్ల సానుకూల ఆలోచనలు, ఆదర్శాలు, పురోగామి దృక్పథం
సమాజం పట్ల సానుకూల ఆలోచనలు, ఆదర్శాలు, పురోగామి దృక్పథం కలిగి ఉండడం నేరం కాదు అన్న న్యాయవ్యవస్థ నేపథ్యంలో అభ్యుదయ భావజాలాన్ని పెంచుకోవడం ఎలా ? సామాజిక మార్పుకు అంతరాలు లేని వ్యవస్థతో పాటు సమ సమాజ స్థాపనకు కోసం...
వడ్డేపల్లి మల్లేశం
భారతదేశంలోని కారాగారాలలో 4 లక్షల 36వేల మంది ఖైదీలకు మాత్రమే సరిపోయే వసతులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా విచారణ ఖైదీలుగా కొనసాగించడం వ్యవస్థాపరంగా ఉన్నటువంటి అనేక అంతరాయాలు, అవరోధాలు, లోపాల కారణంగా నేరస్తులని తీర్పు వెలబడకుండానే శిక్ష అనుభవిస్తున్నటువంటి దృష్టాంతాలు అనేకం. మార్చి 5, 2024 రోజున మహారాష్ట్రలోని నాగపూర్ జైలు నుండి నిర్దోషిగా విడుదలైనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా 3558 రోజులపాటు విచారణ ఖైదీగా ఉన్న కారణంగా అత్యంత క్రూరమైన జైలు శిక్ష అనుభవించిన విషయం భారత దేశ న్యాయ వ్యవస్థలో ఒక మాయని మచ్చ . వందమంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని భారత దేశ
న్యాయ సూత్రం ఖండాంతరాలకు పాకినప్పటికీ బడా నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేసే, అహోరాత్రులు శ్రమించి, చేయని నేరానికి అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ చివరికి నిర్దోషులుగా తేలినప్పటికీ శిక్షకు గురవుతున్నారు అంటే భారత దేశ న్యాయ వ్యవస్థలోని లోపాన్ని, డొల్లతనాన్ని, సంఘర్షణను, సంక్షోభాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది .
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అరకొ ర వసతులు ఉన్న జైళ్లలోనే పరిమితికి మించి 5 లక్షల 73 వేల మందిని అత్యంత దుస్థితిలో అనాగరిక స్థితిలో నెట్టి వేస్తున్న తీరు హృదయ విధారకం కాగా ఇందులో 70 శాతానికి పైగా సరైన కారణాలు లేకుండా తాము ఎందుకు అరెస్టు చేయబడినమో తెలియకుండా విచారణ ఖైదీలుగా దశాబ్దాల పాటు ఉన్న వాళ్లేనని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే భారత న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లె ప్రమాధమున్నట్లె కదా!
ఇలాంటి బలహీనమైన న్యాయవ్యవస్థ కొనసాగుతున్న దేశంలో సర్వోన్నత న్యాయస్థానంతో పాటు న్యాయవ్యవస్థ, పలు హైకోర్టులు కొన్ని సందర్భాలలో ఇచ్చిన రూలింగ్ లు, తీర్పులను పరిశీలిస్తే "ప్రజలు సానుకూలమైన ఆలోచనలు, ఆదర్శాలు, పురోగమి దృక్పథం, అభ్యుదయ భావజాలం, మార్పు కోరే ధోరణులు కలిగి ఉండడం నేరం కాదు" అని చేసిన వ్యాఖ్యలు పరిశీలించదగినవి. మరొకవైపు భారత దేశంలో దేశ భవిష్యత్తు కోసం, మరింత మెరుగైన సమాజం కోసం, దోపిడీ వర్గాల పీడన అణచివేత నిర్బంధాలను వ్యతిరేకించడం ద్వారా తమను తాము రక్షించుకోవడంతోపాటు ఈ వ్యవస్థను మార్చడం కోసం ప్రజలు ప్రజాస్వామ్య శక్తులు బుద్ధి జీవులు ప్రజా సంఘాలు మానవ హక్కుల కార్యకర్తలు చొరవ చూపక తప్పని పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయి. భిన్న వర్గాలు ప్రజా పోరాటాలను నిర్మిస్తున్న క్రమంలో రాజ్య హింస మితిమీరిన పక్షంలో వాళ్లకు అండగా బుద్ధి జీవులు మేధావులు ప్రజా సంఘాలు ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రతిఘటించక తప్పడం లేదు. ఈ క్రమంలో నిర్బంధముతో పాటు సాచివేత వైఖరిని అవలంబిస్తున్న ప్రభుత్వాలు విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తున్న ఈ శక్తులను అంతం చేయడానికి కూడా వెనకాడడం లేదు.
మితిమీరిన రాజ్య హింస కొనసాగుతున్న తరుణంలో రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి న్యాయం, సౌబ్రాతృత్వం సామ్యవాదం వంటి అంశాలు ఆచరణకు నోచుకోని క్రమంలో ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేయక తప్పని పరిస్థితులలో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు ప్రాతిపదికగా ప్రజలు ప్రజాస్వామికవాదులు సామాజిక మార్పు దిశగా ఉద్యమాలు నిర్మించక తప్పడం లేదు. సిద్ధాంతానికి ఆచరణకు పొంతనలేని పాలన కొనసాగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం వ్యవస్థలో మార్పులు కొరవచ్చు అభ్యుదయ భావజాలాన్ని కలిగి ఉండవచ్చు ఇది నేరం కాదు అని చేసిన వ్యాఖ్య ఆచరణలో మాత్రం ప్రాణాంతకం అవుతున్నది. అయినప్పటికీ స్వాతంత్ర పోరాటంలోనూ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలోనూ భారతదేశ వ్యాప్తంగా గత 77 ఏళ్లలో అనేక ఉద్యమ శక్తులు అభ్యుదయ భావజాలంతో మార్పుకు ప్రతినిధులుగా వ్యవహరించిన తీరును ఆదర్శంగా తీసుకొని స్వతంత్ర భారతదేశంలో స్వావలంబన సాధించడానికి పాలకులు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క త ప్పిదాలను తిప్పి కొట్టడానికి ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోక తప్పడం లేదు. ఆ క్రమంలోనే అభ్యుదయ భావజాలం, సానుకూల దృక్పథం, శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధమైన వైఖరులు అనివార్యమవుతున్నాయి.
అభ్యుదయ భావజాలాన్ని పెంపొందించుకోవడమెలా?
సామాజిక వ్యవస్థలో మార్పు కోసం మరింత మెరుగైన ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రజాస్వామ్యకృష్ణ శక్తులకు ఆత్మ విశ్వాసం మరి ముఖ్యం. ఏర్పరచుకునే భావజాలంలో సత్తా ఉంటే , ప్రణాళికలు సజీవంగా ఉంటే, కార్యాచరణ సమయస్ఫూర్తిగా ఉంటే ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి గమ్యాన్ని చేరుకోవడానికి ఎదురయ్యే ఆటంకాలను సులువుగా జయించవచ్చు . వ్యతిరేక ఆలోచనలు , పిరికితనము ఆ శాస్త్రీయ అవగాహన,
మనిషిని ముందుకు పోకుండా మరింత కూలదోస్తాయి. అదే క్రమంలో శత్రువును మరింత బలవంతుడిని చేస్తాయి. విభిన్న రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయడం, నాటి నుండి నేటి వరకు సామాజిక పరిశీలనను విశ్లేషించడం, శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకోవడం, కార్యకారణ సంబంధం పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం,సాహిత్యం,పత్రికల అధ్యయనం చాలా కీలకమైన వి. ఉదా" రామాయణ ఇతిహాసాన్ని పరిశీలించినప్పుడు మంచికి ప్రతినిధిగా రాముని చెడుకు వారసునిగా రావణుడిని కీర్తించడం అలవాటైన సమాజం ఇది. అదే క్రమంలో అంతటితో ఆగకుండా శాస్త్రీయ మైనటువంటి ఆధారాలు కానీ చరిత్రకాని లేకుండానే రావణుడు రాక్షసుడు సీతను అపహరించినాడు కనుక దుర్మార్గుడు అనే ఆలోచనతో దసరా పండుగ రోజున రావణున్ని దహించే కార్యక్రమం రామలీల పేరుతో దేశవ్యాప్తంగా కొనసాగించడాన్నీ గమనించినప్పుడు రావణుడు రాక్షసుడు అవునో కాదొ, అతడు నేరస్థుడు అనేదానిలో విశ్వాసము ఎంత ఉన్నదో తెలియదు కానీ రావణుని పేరుతో దిష్టిబొమ్మను చేసి బాంబులతో ఇతరత్రా కాల్చి రాక్షసానందాన్ని పొందడం మాత్రం కొన్ని వర్గాల వంతైతే అది అశాస్త్రీయం మతోన్మాదం కాక మరి ఏమవుతుంది? ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే వ్యవస్థ మార్పుకు వీరు ఉపయోగపడతారా? ఇలాంటి వ్యతిరేక ఆలోచనలతో సమాజంలో కొన్ని వర్గాలు వ్యవస్థను ముందుకు పోకుండా ఆపే ప్రయత్నం చేస్తుంటాయి. అక్కడే ప్రజాసామిక లౌకిక శక్తులు వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో శాస్త్రీయ పద్ధతిలో సమాధానం చెప్పే స్థాయిలో ఎదగడంతో పాటు లక్ష్యాన్ని చేరుకోవడానికి చైతన్యాన్ని కలిగించడానికి తోడ్పడే కార్యాచరణను కల్పించుకోవడం ద్వారా ప్రతిభను అనుకూల మైన ఆలోచనలను పెంచుకోవాలి . ప్రశ్నించడం, విమర్శించడం, ప్రతిఘటించడం,
ఐక్య ఉద్యమాలను నిర్మించడం, సమర్థనీయ అంశాలను సేకరించి ఎదుటి పక్షాలను ఒప్పించడం, పిరికితనానికి స్వస్తి చెప్పి ఆత్మగౌరవంతో బానిస మనస్తత్వానికి దూరంగా నిలబడగలిగే వైఖరులను సమాజం నిండా పరివ్యాప్తం చేయవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. అందుకే ప్రజా సంఘాలు ప్రజాస్వామిక శక్తులు మేధావులు హక్కుల సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించిన సందర్భంలో అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత, విద్యావంతులు మద్యం మత్తు పదార్థాలు ధూమపానం వంటి రుగ్మతల బారిన పడి నిర్వీర్యం కాకుండా చూసుకోవడానికి శాస్త్రీయ వైఖరిలో అభ్యుదయ భావజాలం ఎంతగానో తోడ్పడుతుంది. మార్పును కోరుకోవడం అందుకు తగిన విధంగా వ్యవహరించడం, ప్రభుత్వాల లొసుగులను ఎత్తి చూపడం ద్వారా అంతరాలు అసమానతలు వివక్షత పీడన కులమత ఘర్షణలకు తావు లేనటువంటి మరో ప్రపంచాన్ని సా కారం చేసుకోవడానికి గల మెరుగైన అవకాశాలను అభ్యుదయ భావజాలం నిరంతరం కాపాడుతుంది . నిద్రావస్థలోకి జారకుంట జాగ్రత్త పడుతుంది దారి తప్పకుండా బానిస మనస్తత్వం జోలికి పోకుండా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి అభ్యుదయ భావజాలాన్ని కలిగి ఉండడమే నేరమని రాజ్యం అంటుంటే కలిగి ఉండవచ్చు అని న్యాయవ్యవస్థ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ నిజజీవితంలో మాత్రం పాలక వర్గాల దుష్ట పాలన కారణంగా ప్రజల స్వేచ్ఛ ఎండమావి గాని మిగిలిపోతున్నది . తద్వారా పార్లమెంటు, ప్రభుత్వము ఆదిపత్యాన్ని చలాయిస్తుంటే నిర్దోషిగా విడుదలైనా శిక్ష అనుభవించిన విచారణ ఖైదీలుగా దశాబ్దాలు కొనసాగుతున్న వారి ప్రశ్నలకు న్యాయవ్యవస్థ దగ్గర సమాధానం లేకపోవడం ఇటీవల కాలంలో మనం పరిశీలించవచ్చు. ఈ సంక్షోభాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించడానికి చొరవ చూపి ఈ అంతరాన్ని తొలగించడానికి కృషి చేయాలి. న్యాయవ్యవస్థ అందుకు ప్రభుత్వాల యొక్క తప్పిదాలను హెచ్చరించినా తప్పులేదు.న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోతే మాత్రం భారత ప్రజాస్వామ్యం ఎంతో సంక్షోభంలోకి నెట్టి వేయబడుతుంది.
( వ్యాస కర్త సామాజిక రాజకీయ విశేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)