రాజకీయాలలో శ్రమ సంస్కృతి, ఉత్పత్తి సంస్కృతి, సహన సంస్కృతిని పెంపొందించాలి.
సుపరిపాలనలో ప్రజలు గుర్తించబడాలంటే వ్యక్తి ఆరాధనకు మూలమైన
సన్మానాలు బొకేలు శాలువాల సంస్కృతిని నిర్మూలించాలి .ప్రజాదృక్పదానికి పెద్దపీట వేయాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన కూటమి సమాలోచనల నుండి ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరి శాఖల పంపిణీ జరిగి పరిపాలనలో మునిగిపోయినప్పటికీ కలిసిన ప్రతిసారి సన్మానాలు బొకేలతో ప్రజల సహనాన్ని పరీక్షించడం వ్యక్తి వాదానికి గుర్తింపు కాగా ప్రజా దృక్పథానికి ఆ పద్ధతి ఎంత మాత్రం కూడా తగదు. చంద్రబాబును పవన్ ,పవన్ ను చంద్రబాబు, పవన్ ను పార్టీ శ్రేణులు, చంద్రబాబును పార్టీ శ్రేణులు,కూటమిలోని పార్టీలు సుమారు గత రెండు మాసాలుగా నిరంతరం సన్మానిస్తూ బొకేలు అందిస్తూ శాలువాలతో రక్తి కట్టించే ప్రయత్నం నిజమైన పరిపాలనకు దర్పణం కాదు. రాజకీయాలలో వ్యక్తి ఆరాధన సరైనది కాదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరికను కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అక్కడక్కడ కొద్ది శాతం పాటించినప్పటికీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎంతో కొంత తేడాతో ఈ సంస్కృతి కొనసాగడం రాజకీయాలు యొక్క ఆధిపత్యాన్ని ప్రజా సంస్కృతిని తుంగలో తొక్కినట్లుగా భావించవలసి ఉంటుంది. అసలు పరిపాలనలో ప్రజలే ప్రభువులు . ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల ప్రతినిధులు సేవకులుగా పనిచేయాలి. ఇటీవల తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికైన ప్రభుత్వాలు "ప్రజలకు మేము సేవకులం పాలకులం కాదు" అని వేదికల పైన చెప్పినప్పటికీ ఆ సంస్కృతిని ఆచరణలో చూపవలసిన అవసరం ఎంతగానో ఉన్నది .
పరిపాలనకు కేంద్రం ప్రజలు, ప్రజల అవసరాలను తీర్చడానికి, ఆకాంక్షలను అమలు చేయడానికి, ప్రయోజనాలను కాపాడడానికి, రాజ్యాంగ హక్కులను సంక్రమింప చేయడానికి, ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగము కలిగినప్పుడు బాసటగా నిలవడానికి ప్రభుత్వాలు పని చేయవలసి ఉంటుంది. ఆ క్రమంలోనే ప్రజల నాడీ తెలిసిన పాలకులు సేవకుల0 మాత్రమే అని చెప్పి తమ యొక్క విధేయతను చాటుకుంటున్నారు. విద్యావ్యవస్థ విద్యార్థులు కేంద్రంగా పనిచేసినట్లే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజలే కేంద్రంగా పరిణతి చెందవలసిన అవసరం ఉన్నది .కానీ అందుకు భిన్నంగా పాలకులు, రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలు కేంద్రంగా ఈరోజు దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగినప్పుడు అది నిజమైన సుపరిపాలన ఎలా అవుతుంది ?చట్టసభల్లో అవినీతిపరులు నేరస్తులు ఉన్నప్పుడు, పాలకులు పెట్టుబడిదారుల కోసమే పనిచేసి ప్రజాధనాన్ని దోచిపెట్టినప్పుడు, రాజకీయాల్లోకి నేరస్తులు రాకుండా అడ్డుకోవలసిన ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నప్పుడు, అక్కడక్కడ ప్రశ్నించే ప్రతిపక్షాలు మేధావులను పాలక పక్షాలు నిర్బంధం అలచివేతతో అడ్డుకున్నప్పుడు ఇది ప్రజా కేంద్రంగా సాగుతున్న పాలన ఎలా అవుతుంది? కనుకనే ఇది పెట్టుబడి దారి, భూస్వామ్య, వ్యక్తి ఆరాధన తో కూడిన సన్మాన సంస్కృతి .
ప్రజా సంస్కృతిని పెంపొందించాలి:-
********
గౌరవప్రదంగా కవులు కళాకారులు మేధావులు ప్రతిభావంతులు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి పురస్కారాలు అందుకున్న సందర్భంలో సందర్భోచితంగా గుర్తించబడడం అంటే అర్థం ఉంది. కానీ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రధాని నుండి వార్డు సభ్యుని వరకు కలిసిన ప్రతిసారి సన్మానించే దుష్ట సంస్కృతిని అంతం చేయాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి చేరుకున్న ఈ సంస్కృతి బాధ్యతలు చేపట్టిన మంత్రులు ప్రకటిస్తున్నటువంటి పరిపాలన సామర్థ్యానికి అద్దం పట్టేదిగా లేదు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం అనేక రంగాలలో గత ఐదేళ్లుగా కునా రిల్లిపోయిన సందర్భంలో కక్షపూరితంగా కాకుండా నిర్మాణాత్మకమైన పద్ధతిలో సంపదను పెంచడం ద్వారా ప్రజా సంపద ఆదాయము అందనటువంటి అనేక వర్గాలకు అందించే కృషిని కొనసాగించడానికి ముందు ప్రణాళికలు రచించుకోవాలి. సన్మాన సంస్కృతిని పూర్తిగా పక్కకు పెట్టాలి ,వ్యక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిబద్ధత అంకితభావం సేవా దృక్పథం కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంటుంది .అది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు దేశవ్యాప్తంగా ఈ సంస్కృతిని నిర్మూలించగలగాలి ప్రజలు ఎక్కడికక్కడ వ్యతిరేకించి నిరసన తెలిపినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది .
శ్రమలో, ఉత్పత్తిలో, ఇతర వ్యక్తులు మతాలు, కులాలపట్ల సహన సంస్కృతిలో ప్రజలు ముందు వరుసలో ఉన్న విషయాన్ని మనం కచ్చితంగా గుర్తించాలి. కానీ పాలకులు శ్రమను గుర్తించలేదు, ఉత్పత్తిలో భాగస్వాములు కాలేదు , కులమత సహన సంస్కృతి అసలు లేదు, పైగా కుల మతాల పేరు చెప్పుకొని సందర్భానుసారంగా కులతత్వాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టి తమ కనుకూలమైన పరిస్థితులను కల్పించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల విశ్వాసాల పై ఆధారపడి ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఒక ధోరణి మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది . ప్రజలలో ఉన్నటువంటి శ్రామిక దృక్పథం సహనతత్వం ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నటువంటి ఆచరణ స్వభావం పాలకులు వారికి అనుంగు సహచరులైన పెట్టుబడిదారులు భూస్వాములు సంపన్న వర్గాలకు లేదు.పైగా ఉత్పత్తిలో ప్రత్యక్ష భాగస్వాములైనటువంటి కర్శ కులు కార్మికులు చేతివృత్తుల వాళ్ళు చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు వలస జీవులు తె o డికి లేక రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదల పట్ల అసహనం అవమానంతో వ్యవహరించడాన్ని మనం అనేక సందర్భాలలో పసిగట్టవచ్చు. పనిచేసే వాళ్లు ఉత్పత్తులు పెంచే వాళ్ళు చెమటవడిసి జీవితాలు గడిపే వాళ్ళు ప్రజల ఆకలి తీర్చే వాళ్ళు సాధారణ ప్రజలే అని తెలిసి కూడా ఈ సంస్కృతిని ప్రభుత్వాలు ఒంట పట్టించుకోకపోవడం, పెట్టుబడిదారులు సంపన్న వర్గాలు వీలైన ప్రతిచోట సామాన్య ప్రజలను పీడించి దోపిడీ చేయడం ఈ దేశంలో అనాదిగా కొనసాగుతున్న ఆచారం కాదా! అది ఇవాళ పేద వర్గాల పైన పెట్టుబడిదారుల హక్కుగా మారిపోయిన సందర్భంలో ఈ దోపిడిని వంచనను పీడనను వ్యతిరేకించే సామాన్య ప్రజలతో పాటు ప్రజా సంఘాలు మేధావులు బుద్ధి జీవులు చేస్తున్న కృషిని ప్రతిఘటనను ప్రమాదంగా భావించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేసే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం కాక మరేమిటి ? తాము పెట్టరు మరొకరు పెడితే ఓర్చుకోరు అనే విధంగా ప్రజల పక్షాన పని చేసే బుద్ధి జీవులు మేధావులు ప్రజాసంఘాలను అడ్డుకుంటున్న తీరు, దశాబ్దాల నాటి సంఘటన సన్నివేశాన్ని ఆసరాగా చూపి ప్రముఖ విద్యావేత్త జర్నలిస్టు కవి రచయిత్రి అరుంధతి రాయి పైన ఇటీవల ఉపా చట్టాన్ని దానిని తోడు ఇతర చట్టాలను ఉపయోగించి నిర్బంధాన్ని అమలు చేయడం ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పరిస్థితులకు ఉదాహరణ కాదా?
సేవకులమని అధికారంలోకి వచ్చినవాళ్లు ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పరిపాలించాలి, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి, వారు కలిగి ఉన్న భావజాలాన్ని ఆశిస్తున్న మార్పు సామాజిక స్పృహను గుర్తించడం ద్వారా నిజమైన ప్రజా ప్రభుత్వాలుగా నిలబడాలి. ఆ వైపు దృష్టి సారించకుండా ఎంతసేపు తమ ఆధిపత్యాన్ని అధికారాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఆడంబరాలు ప్రజాధనంతో అధికార దుర్వినియోగం దాని కొనసాగింపుగా సన్మానాలు సామాన్య ప్రజలకు అవకాశం లేకుండా కొనసాగుతున్న ఏకపక్ష విధానాలకు కాలం చెల్లింది . ఆ స్పృహ లేకుండా సామాజిక మార్పును ఆశించకుండా తమ ధోరణిలో తాము వెళితే ప్రజలు తమ చైతన్యాన్ని మరింత నింపుకుంటారు. ఈ సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరిక సందర్బచితంగా ఉంటుంది. "పాలకులు రాజ్యాంగ బద్దంగా పరిపాలించే క్రమములో అనేక తప్పిదాలకు స్వ ప్రయోజనాలకు పాల్పడే ప్రమాదం ఉన్నది . రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారని నమ్మకం లేదు, ఈ సందర్భంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజలను వంచించే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు తమ ఆత్మ రక్షణ కోసం, ఉనికి కోసం, భవిష్యత్తు కోసం తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆ క్రమంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను చిదిమి వేసి కొత్త వ్యవస్థను నిర్మించుకుంటారు ఆ మార్పుకు పాలకులు తలవంచవలసిందే" అనే భావనలో చేసిన హెచ్చరిక ఇప్పటికైనా ప్రభుత్వాలకు వాళ్ల అధికారాన్ని కాపాడే వర్గాలకు గుణపాఠం అవుతుందని భావించుదాం .శ్రమ, సహనం, ఉత్పత్తి తమ జీవన విధానం గా కొనసాగుతున్న ప్రజా దృక్పథం ప్రజా కళలు వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత నేడు పాలకుల కంటే ప్రజలపైనే ఎక్కువగా ఉంది ఎందుకంటే నిరంతరం ప్రజాస్వామ్యాన్ని భంగపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కనుక .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)