వ్యవసాయ మార్కెట్ గంజ్ స్థలం కబ్జాకు స్కెచ్..

Dec 14, 2024 - 19:50
 0  8
వ్యవసాయ మార్కెట్ గంజ్ స్థలం కబ్జాకు స్కెచ్..
వ్యవసాయ మార్కెట్ గంజ్ స్థలం కబ్జాకు స్కెచ్..

జోగులాంబ గద్వాల 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల:  జిల్లా కేంద్రంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని పట్టణ వాసులు పేర్కొటున్నారు. తాజాగా అక్రమార్కులు ఏకంగా వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.మార్కెట్ కమిషన్ మర్చంట్ నిర్వాహకులు రూ.కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు యథేచ్ఛగా ఆరు నెలల నుంచి వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే మార్కెట్ లో ఉన్న తమ స్థలానికి ఆనుకుని ఉన్న చింతలపేట నుంచి అయిజ, రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డుకు ఉన్న మార్కెట్ కాంపౌండ్ వాల్ ను తొలగించాలనే ప్లాన్ తో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి, దాని స్థానంలో పిల్ల కాలువను కడుతున్నారు. తద్వారా మార్కెట్ ప్రహరీ తొలగించి వాళ్ళ స్థలాల్లో షట్టర్లు నిర్మించి మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

వ్యవసాయ మార్కెట్ ఏర్పడింది ఇలా..1956లో ఏర్పడిన గద్వాల వ్యవసాయ మార్కెట్ కు ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. మొదటి చైర్మెన్ గా ఉన్న వకీలు నాగప్ప ఆ తర్వాత 1965 - 74 మధ్యలో చైర్మెన్ గా ఉన్న డీకే సత్యారెడ్డి ఆధ్వర్యంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ కు 62 - 26 ఎకరాల స్థలాన్ని అప్పట్లో 841/సి, 842/ఏ, 842/బి, 844, 846, 846, 848/ఏ, 849/బి, సర్వే నెంబర్లలో సేకరించారు. కొంత కాలానికి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడటంతో అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కొంతమంది మార్కెట్ కమిషన్ వ్యాపారులకు కొన్ని నిబంధనల ప్రకారం విక్రయించినట్టు తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం మార్కెట్ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు కోట్లకు పడగలెత్తి, వేరే వ్యాపారాలు చేస్తూ ఈ స్థలంలో కూడా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసేందుకు అందరూ కలిసి ప్లాన్ చేసుకుని వ్యవసాయ మార్కెట్ నిబంధనలు తుంగలో తొక్కి కబ్జాలకు పూనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకేనా..?

ఇక అధికారులు కొందరి పెద్ద మనుషుల అండ ఉందని చెప్పుకుంటున్న ఆ వ్యాపారులు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వ్యవసాయ మార్కెట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అవాక్కయ్యే విషయం ఏంటంటే మార్కెట్ స్థలాన్ని కొన్న వారిలో దాదాపు 26 మందిలో వ్యవసాయ మార్కెట్ లో మొదటి నుంచి వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య 10 మంది లోపే ఉంటారని, మిగతా వారంతా కొనుగోళ్లు చేసుకున్న వారే ఉన్నారని గద్వాల మార్కెట్ లో ప్రచారం జరుగుతోంది. వీళ్లంతా వేరే వ్యాపారాలు చేస్తూ రూ.లక్షలు గడిస్తున్న వారే ఉన్నారని మార్కెట్లో కొందరు వ్యాపారులు అంటున్నారు. 

62 ఎకరాలకు మిగిలింది 50 ఎకరాలే..

గద్వాల వ్యవసాయ మార్కెట్ ఏర్పడిన సంవత్సరం 1972లో మార్కెట్ కు ఉన్న స్థలంలో 20 ఏళ్ల క్రితం 5.30 ఎకరాల భూమిని సెంట్రల్ వేర్ హౌస్ గిడ్డంగుల నిర్మాణం కోసం, కొంత కాలానికి 1.10 ఎకరం విత్తన శుద్ధి కర్మాగారానికి కేటాయించారు. ఇదంతా వ్యవసాయ మార్కెట్ కి సంబంధించిన అంశాలే కాగా, తాజాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీ భవనానికి ఒక ఎకరం పోలీస్ స్టేషన్ కు 1.20 ఎకరం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి 20 గుంటల చొప్పున స్థలాన్ని తీసుకోగా, ప్రస్తుతం గద్వాల వ్యవసాయ మార్కెట్ స్థలం 50 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీనిలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పపడుతున్న వారితో గద్వాల వ్యవసాయ మార్కెట్ కాస్త కబ్జాలకు గురవుతుందని గద్వాల పట్టణవాసులు వాపోతున్నారు.. 

డ్రైనేజీ నిర్మిస్తున్నారో తెలియదు.. 

మరోవైపు వ్యవసాయ కమిషన్ వ్యవసాయ మార్కెట్ అసోసియేషన్ సభ్యులకు గానీ, ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకు గాని వ్యవసాయ మార్కెట్ దగ్గర పాతపెద్ద డ్రైనేజీని తొలగించి చిన్న కాల్వలాగా డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్న విషయం ఎవరికీ తెలియదంటూ, అటు మున్సిపల్ అధికారులు ఇటు వ్యవసాయ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొటున్నారు. ఇక ఈ విషయంపై అధికారులు ఇటు పట్టణ పుర ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333