గ్రూప్-2 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాల్లో హాజరు కానున్న 8722 మంది అభ్యర్థులు
పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ ( 144 సెక్షన్) అమలు
అభ్యర్థులు సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
జోగులాంబ గద్వాల 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఈ నెల 15 మరియు 16 (ఆదివారం ,సోమవారం) తారీఖులలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగునున్న గ్రూప్-2 కేంద్రాల వద్ద జిల్లా లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలియజేశారు.
గద్వాల్ జిల్లా కేంద్రంలోని 22 పరీక్ష కేంద్రాలు, ఎర్రవల్లి చౌరస్తా లో 3 పరీక్షా కేంద్రాలు మొత్తం 25 కేంద్రాల వద్ద సుమారుగా 150 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 8722 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అందుకు సంబంధించి 5 రూట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ ( 144 సెక్షన్) అమలు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరీక్షకు వచ్చే అభ్యర్థులకు, పరీక్షా కేంద్రాల వద్ద భద్రతకు సంబందించి పలు సూచనలు చేశారు.
1) పరీక్షా కేంద్రాల వెలుపల భాగంలో పోలీస్ యంత్రాంగం విధులను నిర్వర్తిస్తుందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు సూచించబడిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
2) అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే చేరుకునేలా ఉండాలని, పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్క వ్యక్తి కచ్చితంగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని లేని వారిని లోనికి అనుమతించడం జరగదని తెలిపారు.
3) పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలలో 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గూమికూడి ఉండకూడదని తెలిపారు.
4) పరీక్ష కేంద్రం 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండకుండా చూసుకోవాలని తెలిపారు.
5) పరీక్షా కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సెల్ ఫోన్ లను, చేతి గడియారాలను, క్యాలిక్యులేటర్లను అనుమతించడం జరగదని అభ్యర్థులు గమనించి ముందు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల నందు 8722 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యాలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన 5 రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటూ, ఎస్ఐ స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద డిఎఫ్ఎండి, హెచ్ హెచ్ ఎం డి లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. మహిళ అభ్యర్థులకు ప్రత్యేకంగా మహిళా సిబ్బంది ద్వారా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రం లో ఎలాంటి ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ద్వారా బందోబస్తు చర్యలను చేపడుతున్నట్లు తెలియజేశారు. ఎలాంటి అత్యవసరం సమయంలోనైనా అభ్యర్థులు డయల్ -100 ద్వారా పోలీసు యంత్రాంగం సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. పరీక్షా పత్రాల మరియు జవాబు పత్రాల తరలింపులో ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.