వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి:సీఐటీయూ
జోగులాంబ గద్వాల 11 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివోఏలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివోఏలకు మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ పద్ధతి ఉండటం వల్ల వివోఎలు అభద్రతా భావానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని పనులను సక్రమంగా నెరవేర్చినప్పటికీ, ఇంకా రెన్యూవల్ పద్ధతిని కొనసాగించడం ఎంతవరకు సమంజసకరమైనది అని ప్రశ్నించారు.వివోఎలకు అప్పగించిన బాధ్యతలు మాత్రమే కాక అనేక అదనపు పనులను చేయిస్తున్నారని కానీ ఉద్యోగ భద్రత మాత్రం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డ్యాం అంజి మాట్లాడుతూ వివోఏలకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం గ్రామ సంఘం నుండి రావాల్సిన 3000 అమలు కావడం లేదని అన్నారు. ప్రస్తుతం తాము సేర్ప్ నుండి 5000 రూపాయల వేతనం మాత్రమే తీసుకుంటున్నామని సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుండి 3000 తీసుకోవాలని నిర్ణయించారని కానీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవైపు ఉద్యోగ భద్రత లేక మరొకవైపు కనీస వేతనాలు లేక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చే వేతనాలు సైతం నెల నెల సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తున్నారని దీనివల్ల వివోఎల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారాని అన్నారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు నిరసన కార్యక్రమం జరిపామని రేపు రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలకు పిలుపునిచ్చిందని, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివోఏలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో: వివిధ మండలాల అధ్యక్షులు తిమ్మప్ప, తిరుమల్,శ్రీనివాస్,సురేష్ చంద్రములు, అపర్ణ, మహేందర్, భీమేష్, విజయలక్ష్మి,హైమావతి,పావని,రుతమ్మ, తదితరులు పాల్గొన్నారు.