విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలి:జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 8 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- గద్వాల పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. బుధవారం వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పదవ తరగతి యాక్షన్ ప్లాన్ పై అలంపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మండలాలవారీగా విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం చేపడుతున్న యాక్షన్ ప్లాన్,తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అక్షరాస్యతలో పురోగతి సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలలో జిల్లా 32వ స్థానంలో ఉన్నామని,ఈ సంవత్సరం కనీసం 8 స్థానాలు మెరుగుపరచి ఉత్తమ స్థాయిలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.పదవ తరగతి 100% ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేయించాలన్నారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని,రెండు నెలల కఠిన సాధనతోనే విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని అన్నారు.ప్రతీ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి,10/10 CGPA సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని,అలాగే ఫెయిల్ అయ్యే విద్యార్థులను ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఉపాధ్యాయుల కొరతను డి.ఎస్సీ,విద్యా వాలంటీర్ల ద్వారా నియమించడం జరిగిందన్నారు.పాఠశాల స్థాయిలో విద్యా నాణ్యత,భోజనాల నిర్వహణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, డి.ఈ.ఓ అబ్దుల్ గని, అన్ని మండలాల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు,తదితరులు పాల్గొన్నారు