విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందజేయాలి
జోగులాంబ గద్వాల 5 డిసెంబరు 25 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల వసతి గృహ విద్యార్థులకు శుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందజేయాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వసతి గృహాన్ని చక్కగా నిర్వహిస్తుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులో రాణించి 100% ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల కొన్ని వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అలాంటివి పునరావృతం కాకుండా తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ, తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.