ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే మెరుగైన విద్యా బోధన
జోగులంబ గద్వాల 11 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నిష్ణాతులైన అధ్యాపకులు మెరుగైన విద్యా బోధన చేస్తారని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
గద్వాలలోని ప్రభుత్వ ఎంఏఎల్ డీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో కళాశాల అధ్యాపకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో అనేక కోర్సులు ఉన్నాయని, ఇక్కడ విద్యను అభ్యసించిన వేలాదిమంది మంచి స్థాయిలో స్థిరపడడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్ వెబ్ ఆప్షన్ లలో ఈ కళాశాలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు షేక్ కలందర్ భాష, అధ్యాపకులు చంద్రమోహన్, సంపత్ కుమార్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.