లబ్దిపైనే దృష్టి.  సేవ ముసుగులో  పదవులు.... అంతిమ లక్ష్యం  అక్రమ సంపాదన

Mar 2, 2024 - 17:50
Apr 15, 2024 - 18:28
 0  1
లబ్దిపైనే దృష్టి.  సేవ ముసుగులో  పదవులు.... అంతిమ లక్ష్యం  అక్రమ సంపాదన

రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలకు భిన్నంగా  సంపద కేంద్రీకరణ  పాలకుల నేరం కాదా ?

సామాన్యుల కోసం  అందరం ఆలోచిస్తే  మనది సంస్కారం.

లేకుంటే మనమంతా కూడా అక్రమార్కులమే.

మానవతా విలువల రీత్యా ఆలోచించినా,  ఆధ్యాత్మిక వాదంలో  ఈ దేశంలో కుక్క కూడా  ఆకలితో అల్లాడకూడదని వివేకానందుడు నొక్కి చెప్పినా,  తమ అవసరాలకు మించి సంపాదించడం అక్రమమేనని గాంధీ వక్కానించినా, అనే  సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరణ రాజ్యాంగ ద్రోహం అని భారత రాజ్యాంగంలోని పీఠిక ఆదేశిక సూత్రాలు  గంటా పతంగా చెబుతున్నా , అసమానతలు అంతరాలు దోపిడీ లేనటువంటి  సమ సమాజం  అంతిమ లక్ష్యం అని మార్క్సిజం  మన కర్తవ్యాన్ని ఉద్భోదించినా  ఆ వైపుగా కనీసమైన చర్యలు లేకపోవడం  ప్రజలు కూడా ఆలోచించకపోవడం  అనాదిగా జరుగుతున్న దురాచారం.  "భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు"  అన్న పద్య  పాదాన్ని రచయిత  ఏ సందర్భంగా వక్కాణించాడో కానీ  ఈ ప్రకృతి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి  అవకాశం లేదు అని  చెప్పే ప్రయత్నమే ఈ పద్య భాగంలోని సారాంశం.  ఒక భూభాగంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా బ్రతకవలసినది పోయి  ప్రతిభ పేరుతో, మోసకారితనం,   దగా కోరుతనం,  అవకాశం, విద్యపేరుతో,  వారసత్వం,  కలిసి వచ్చిన అవకాశం వంటి అనేక కారణాలను చూపి  ఈ వ్యవస్థలో అంతరాలను  పెంచే కుట్ర అనాదిగా కొనసాగుతున్నది. అదే క్రమంలో సంపన్న వర్గాలు  సంపాదన స్వార్థపూరితమని, అక్రమమని ,ఇతరులను దోపిడీ చేస్తే వచ్చిందని ఏ కోశానా కూడా అంగీకరించకపోగా  నిజాయితీగా సంపాదించినదని  కష్టపడి  పోగు చేసుకున్నామని  నమ్మబలికే ప్రయత్నం చేయడం  సమానత్వ సిద్ధాoతా నికి గండి కొట్టడమే . ఈ ప్రకృతి పైన  దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఇది సహజ న్యాయం.  దానికి భిన్నంగా  కలిసి వచ్చిన అనేక అవకాశాల రీత్యా  తరాల వరకు  సరిపోయే సంపదను కొన్ని వర్గాలు  కూడబెడితే  ఏ పూటకు ఆ పూట తినడానికి కూడా  ఇబ్బంది పడుతూ  యాచకులుగా  వలస కార్మికులుగా దారిద్రరేఖ దిగువన జీవిస్తున్న వారు  మరొక్క వైపు స్పష్టంగా కనబడుతుంటే ఏ క్షణాన కూడా   మనకు మనలను ప్రశ్నించుకోకపోవడం,  నా జీవన విధానం  నియమ బద్ధమా? అని  సమీక్షించుకోకపోవడం  ఆర్థిక అరాచకత్వమే అవుతుంది.

 ప్రధానంగా లబ్ధి పైననే దృష్టి :-

జీవితం ఒకటే అని తెలిసి  ఆ జీవన యానంలో  ప్రపంచం తోనే పోటీ పడాలనే  కాంక్షతో సంపాదించడానికి  దూసుకు వెళ్లే ప్రయత్నం చేయడం ఇవాళ రివాజుగా మారింది  .న్యాయబద్ధంగా వస్తున్న ఆదాయంతో  పొదుపు చర్యలు  కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆదాయం ద్వారా  సంపద పోగుపడితే కొంతవరకు  అంగీకరించవచ్చు .అయినప్పటికీ  స్వార్థ చింతనే తప్ప పక్క వాళ్ళ మేలు కోరే తత్వం లేకపోతే మాత్రం సహించే ప్రసక్తి లేదు.  అలాంటి కుటుంబాలు లేదా వర్గాలకు  కష్టాలు కన్నీళ్లు వచ్చిన సందర్భంలో సహకరించడానికి ఎవరు ముందుకు రారు అని తెలుసుకుంటే మంచిది. అంటే అంతిమంగా మనిషిని కాపాడుకోవడం, తోటి మనిషిని సాటిగా సాటి మనిషిగా చూడడం,  కష్టాలు కన్నీళ్లలో తోడుగా అండగా ఉండడం అనే మానవతా విలువలను పాటించని ఏ సందర్భం అయినా  సమాజానికి చేసే విద్రోహం గానే భావించవలసి ఉంటుంది . భారతదేశంలో 10% గా ఉన్న సంపన్న వర్గాల వద్ద 80 శాతం సంపద పోగుపడి  ఉంటే 80% గా ఉన్నటువంటి మెజార్టీ ప్రజల దగ్గర 20 శాతం మాత్రమే సంపద  అందుబాటులో ఉన్నదంటే ఏ రకంగా అంతరాలు అసమానతలు ఆర్థిక రంగంలో కొనసాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు . ఆర్థిక పరిభాషలో కఠినమైన విషయమే కావచ్చు కానీ  సామాన్య పద్ధతిలో ఆలోచించినప్పుడు  పక్కవాడికి మన వాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? లేనివాడు చేసిన ద్రోహం నేరం ఏమిటి? ఎందు కొరకు ఆకలితో అలమటించి పేదరికంలో మగ్గి శిక్ష అనుభవిస్తున్నారు? అని విజ్ఞులుగా ఎప్పుడైనా ఆలోచించినామా? ఆ రకమైన చర్చ ఎందుకు చేయకూడదు? ఎందుకు  మనకు మనమే చర్చించుకోకూడదు? అనేది ఇవాళ ప్రధానమైన విషయం.  భారత రాజ్యాంగంలోని పీఠికలో కానీ ఆదేశిక సూత్రాలలో కానీ సంపద కొద్ది మంది చేతుల్లో ఏ కోశాన కూడా పోగుపడి ఉండడానికి వీలులేదు అని స్పష్టంగా చెబుతుంటే  న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను సమానత్వం కోసం ఎన్ని అవకాశాలు ఉన్నా ఆ వైపుగా ప్రభుత్వ చర్యలు ఎందుకు లేవు? అని  బుద్ధి జీవులు మేధావులు విద్యావంతులు  త ర్కించుకోకపోతే  ఇక దేశంలో సామాన్యుల సంగతి ఏమిటి ? సమ సమాజ స్థాపన కోసం, ఆర్థిక అంతరాలను నిర్మూలించడం కోసం, సమానత్వాన్ని సాధించటం కోసం అనేక ప్రజా ఉద్యమాలు  సందర్భోచితంగా ప్రజలను చైతన్యవంతం చేసి పాలకుల కళ్ళు తె రిపించినప్పటికీ  తిరిగి సంపద ఉన్న చోటుకే చేరడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం.  ప్రతి విషయానికి " అయితే నాకేమిటి"? "వారితో సంబంధం ఏమిటి? ". "ఎవరెక్కడ పోతే ఏమిటి" అనే  దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్య భావన ప్రజల్లో  పేరుకు పోవడం కూడా  కొంతమంది అతి పేదవాళ్లుగా మారడానికి సంపద కొద్దిమందిలో  ఎక్కువ కనబడడానికి కారణం అవుతున్నది.  పక్క వాడితో నాకేమిటి అని అనుకుంటున్నాము కానీ ఈ సృష్టిలో  చెట్లు, గుట్టలు,  నదులు, సముద్రాలు,  ఆకాశము, నిప్పు,  జంతుజాలం ,క్రిమి కీటకాలు, పశుపక్షాదులు  మనలాగే అనుకుంటే మానవ మనుగడ సాధ్యమయ్యేదా?  ఏ ప్రయోజనాన్ని ఆశించి చెట్లు కాయలు, పండ్లు నీడనిస్తున్నాయి.  పశుపక్షాదులు  మానవ మనుగడకు ఎన్నో రకాలుగా తోడ్పడుతూ  మనిషి  మనుగడకు ఆధారభూతమవుతుంటే  ఈ విషయాలను మనిషి ఎందుకు ప్రస్తావించుకోవడం లేదు ? ఇదంతా స్వార్థంతో కూడుకున్న  నాటకం అంటే అతిశయోక్తి కాదు.  అహంకార0  దుఃఖానికి కారణమని  అక్రమ సంపాదన ద్వారా అంతిమంగా అశాంతియే మిగులుతుందని  అనేక అనుభవాలు  తెలియజేస్తుంటే  అక్రమ సంపాదన పరులు ఉద్యోగులు, వ్యాపారులు పెట్టుబడిదారులు  చట్టం నుండి తమ పలుకుబడిని ఉపయోగించి రక్షించుకోవచ్చు. కానీ  ప్రజా ఉద్యమాలు తీవ్రమైన రోజున , చట్టాన్ని నిజాయితీగా అమలు చేసే పాలకులు రంగ ప్రవేశం చేసిన రోజున, మరిన్ని కారణాల రీత్యా కచ్చితంగా అక్రమార్కులు కటకటాల్లోకి వెళ్ళక తప్పదు  .ఎంతోమంది అధికారులు అక్రమ సంపాదన లంచాల రూపంలో  పెంచుకుంటే  అవినీతి నిరోధక శాఖ అధికారుల వేటలో అనూహ్యమైన సందర్భాలను చూడవలసి వస్తున్నది.  ఇక రాజకీయ రంగంలోకి వచ్చిన వారంతా సేవ కోసమే వస్తున్నామని చెప్పినప్పటికీ  సామాన్య కార్యకర్త నుండి  జాతీయ స్థాయి నాయకుని వరకు  అధికారాన్ని  అధికార పార్టీని  అవకాశాన్ని అడ్డం పెట్టుకొని చేసే సంపాదనకు  అంతే లేకుండా పోతున్నది.  చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న కారణంగా ఎంతోమంది  శిక్ష నుండి త ప్పించుకుంటే అధికార పార్టీ  ప్రతిపక్ష సభ్యుల పైన దర్యాప్తు సంస్థలను  ఉసిగొలిపి ఏకపక్షంగా వ్యవహరించడాన్నీ కూడా మనం ఈ దేశంలో గమనించవచ్చు.     మనం అనుభవిస్తున్న అవకాశాలు  వనరులు సౌలభ్యాలు  అనేకమంది బుద్ధి జీవులు మేధావులు శాస్త్రవేత్తలు  వివిధ రంగాల నిపుణుల  కృషి ఫలితం అని ఎప్పుడైనా అంగీకరించినామా ? భయంకరమైన రోగాల బారిన పడుతూ  చివరి అంచుకుపోయిన వారిని సైతం తిరిగి బ్రతికించగలుగుతున్న అనేక మందులు చికిత్సలకు  ఎంతోమంది కృషి చరిత్రలో మిగిలి ఉన్నదని  గుర్తించడం లేదంటే మనం మనుషులం ఎలా అవుతాం ? ప్రతి సందర్భంలోనూ లాభమే,  ప్రతి విషయంలోనూ సంపాదన ధ్యేయంగా బ్రతుకుతున్న మనం  ఇప్పటికైనా  చట్టబద్ధంగా న్యాయబద్ధంగా  ఆలోచించి తప్పుడు విధానాలకు పాల్పడితే మనకు మనమే సంస్కరించుకోవాలి. మన తప్పులను నిజాయితీగా ప్రకటించి,  సంపద పోగు కాకుండా అసమానతలు అంతరాలు మరీ పెరగకుండా  వలస కార్మికులు చిరు వ్యాపారులు పేదలు  జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి మనం ఏ మేరకైనా    కృషి చేయగలమా? అని ఆలోచిస్తే మంచిది . భక్తి పేరుతో  అన్నదానాలు  చందాలు  కోట్ల రూపాయల సమీకరణ ఒకవైపు కొనసాగుతున్నది కానీ  వికలాంగులు  జుట్టు మాసి బట్టలు  శిథిలమై  జీవచ్ఛవాలుగా పడి ఉన్నటువంటి అభాగ్యుల ను  కనీసం  ఆదరించగలుగుతున్నామా ? ఒక్క రూపాయి అయినా దానం చేస్తున్నామా?  ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిది . పాలకులు పెట్టుబడిదారులకు నీతి నిజాయితీలు లేనే లేవు  వారికి కావలసింది సంపాదన  వారి తరాలదాకా  వారసులకు  కోటానుకోట్ల సంపదను కూడా పెట్టడమే. మరి సామాన్యులమైన మనకు  కొంచమైనా ఈ వ్యవస్థ పట్ల పేదరికం పట్ల  ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా ? పట్టుదలతో ఆలోచిద్దాం! పరిశీలిద్దాం!. వీలున్న మేరకు స్పందిద్దాం  !  పాలకులపై ఒత్తిడి తెచ్చి  ప్రజా సంపద అందరికీ సమానంగా   పంపిణీ చేసేలా  పోరుబాట పడదాం !. ఇప్పటికైనా మీ మనసు మారిందా? మీకు సమ్మతమేనా నా సందేహాలు?


---  వడ్డేపల్లి మల్లేశం
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచితుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333