రోడ్లపైకి వరద నీరు ....విద్యార్థుల ఇబ్బందులు
తిరుమలగిరి 25 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
చర్యలు తీసుకునేది ఎప్పుడో...?
విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా...?
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు అనంతారం గ్రామం వద్ద రోడ్డుపై వరద నీటితో కష్టసాధ్యంగా మారాయి. ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) సమీపంలో చెలకల్లో నుండి వరద నీరు జాతీయ రహదారి మీదకు పారుతూ ప్రమాదకర స్థితి నెలకొంది.ప్రజా సౌకర్యార్థం జాతీయ రహదారి వెంట డ్రైనేజీ కాలువ నిర్మించినా, ఆ వరద నీటిని సరైన మోరి కాలువలోకి మళ్లించకపోవడంతో వర్షం కురిసిన ప్రతీసారి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే నీరు రోడ్డుపైకి దూసుకొచ్చి,రాకపోకలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.ప్రతి రోజూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు తడిసిన రహదారిపై జారి పడే ప్రమాదంలో ఉన్నారు. పాదచారులు కూడా రోడ్డుపై నడవడం కష్టమైపోయింది. తల్లిదండ్రులు, స్థానికులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులు, జాతీయ రహదారి శాఖ బాధ్యులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.“మోరి కాలువను కలపకపోవడం వల్లే నీరు రోడ్డుపైకి వస్తోంది. పాఠశాల పిల్లలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది,” అని స్థానికులు హెచ్చరించారు.వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో వరదనీటి సమస్యను పట్టించుకోకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆవేదనను గమనించి సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...