రైతు పండగ సదస్సుకు బయలుదేరిన రైతులు
జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పండగ, రైతు అవగాహన కార్యక్రమాలకు జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులు వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. శనివారం ఐ.డి.ఓ.సి ఆవరణలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం నిర్వహిస్తున్న రైతు పండుగకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి 100 ప్రత్యేక బస్సుల్లో 5,000 మంది రైతులు అందరినీ మహబూబ్ నగర్ కి తీసుకవెళ్లడం జరిగిందన్నారు. ప్రయాణ సమయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనం, త్రాగునీటి వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతీ బస్సుకు ఒక లైజన్ అధికారి, నోడల్ అధికారి, ఒక కానిస్టేబుల్‌ను నియమించడం జరిగిందని తెలిపారు. అన్ని బస్సులు కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, ఏపీఎం లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.