డిల్లీ సీఎంపై దాడి.. హైటెన్షన్!

న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎం రేఖాగుప్తాపై ఒక వ్యక్తి దాడికి దిగాడు.బుధవారం సీఎం రేఖాగుప్తా జన్ సున్‌వాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అతడి పేరు రాజేష్ సకారియగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ అతడ స్వస్థలమని పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనతో సీఎం రేఖా గుప్తా తీవ్ర షాక్‌కు గురయ్యారని సమాచారం. మరోవైపు ఈ దాడి ఘటన జరిగిన వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆమె నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. ఇక ఈ దాడిని బీజపీ సీనియర్ నేత హరీష్ ఖురానీ తీవ్రంగా ఖండించారు. సీఎం రేఖా గుప్తాకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జన్ సున్‌వాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా వద్దకు కాగితాలు పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడని చెప్పారు. తన సమస్యను ఆమె వివరిస్తూ.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడన్నారు. ఇంతలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారని తెలిపారు. దీంతో ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు.
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ.. ఈ తరహా దాడులో ముఖ్యమంత్రి విధులను అడ్డుకోలేరన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. ఈ దాడి వెనుక ఎవరున్నారో తెల్చాలంటూ ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి స్పందించారు. ఈ దాడిని ఆమె ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొన్నారు..