యువకుడు గల్లంతు కొనసాగుతున్న గాలింపు చర్యలు

వలిగొండ 18 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.వివరాల్లోకి వెళ్తే, వెలువర్తి చెరువు అలుగు నుండి భారీగా వరద నీరు బయటకు వస్తోంది. ఈ నీరు వెలువర్తి, అరూరు రహదారి గుండా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన 10 మంది యువకులు చేపల వేటకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో వరద ఉధృతిని తట్టుకోలేక శివరాత్రి నవీన్ (25), తండ్రి వెంకన్న, కొట్టుకుపోయినట్లు తెలిసింది.సంఘటన జరిగిన వెంటనే వలిగొండ పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే సాయంత్రం కావడంతో చీకటి కమ్ముకోవడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యమయ్యాయి. వరదలో కొట్టుకుపోయిన నవీన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.ఈ సంఘటనతో పాలడుగు గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రామంలోని బంధువులు, స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ఆతృతగా వీక్షిస్తున్నారు. నవీన్ సురక్షితంగా బయటపడాలని గ్రామస్థులు, బంధువులు ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.