ముగ్గురు కొడుకులున్నా బుక్కెడు బువ్వకు నోచుకుని ఓ బక్కచిక్కిన తల్లి.
ముగ్గురు కొడుకులున్నా బుక్కెడు బువ్వకు నోచుకుని ఓ బక్కచిక్కిన తల్లి.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న శతాధిక. వృద్దురాలు.
నామవరం/ మోతే 03 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కడుపునిండా అన్నం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకుంటే కన్న కొడుకులే కాటికి చేరేలా చేస్తున్నారని బుక్కెడు బువ్వకోసం ఎదురుచూస్తున్న శతాధిక వృద్ధురాలి ఆకలి కేకలు మోతే మండలం నామవరం గ్రామంలో మారుమోగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) భర్త మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వెంకమ్మ కు ముగ్గురు కుమారులు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య లు ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది ఇగ ఇక్కడే మొదలైంది అసలు కథ.. తండ్రి మరణించాక తల్లిని మంచిగా చూసుకుంటామని నమ్మ పలికిన ఆ ముగ్గురు కొడుకులు తల్లిపేరుమీద ఉన్న మూడెకరాల తొమ్మిది గుంటల స్థలాన్ని తలా ఒక ఎకరం మూడు గంటల చొప్పున తల్లితో సంతకాలు పెట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకేముంది వాళ్ళ పని అయిపోయిందని.. తల్లితో మాకేం పని ఉందని కన్నతల్లిని ఒంటరిని చేసి ఊర్లో వదిలేసి వెళ్లారు. కొడుకులు చేసిన పనికి అవాక్కైన ఆ బక్కచిక్కిన తల్లి నా కొడులకు బుద్దిచెప్పి నాకు బుక్కెడు అన్నం పెట్టించండి మహాప్రభో అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ అధికారిని స్థానికుల సహాయంతో సంప్రదించింది. స్పందించిన ఆర్డీఓ వెంటనే ఆ ముగ్గురు కొడుకులను పిలిపించి ఒక్కక్కరూ నెలకు 15 వందల రూపాయల చొప్పున ఆ తల్లికి ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. అయినా ఆర్డీఓ ఆదేశాలు సైతం లెక్కచేయకుండా తల్లిని అక్కడే వదిలేసి వెళ్లారు ఆ ముగ్గురు కొడుకులు. దిక్కుతోచని స్థితిలో బిడ్డను ఆశ్రయించింది ఆ తల్లి. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి నడుములు విరిగిన ఆ కన్నతల్లిని పోషించలేక కూతురు సైతం ఇబ్బంది పెడుతుంది. ఆస్తి పొంది అందలం ఎక్కిన ముగ్గురు కొడుకులకు బుద్ధి చెప్పి తనకు బుక్కెడు అన్నం పెట్టాలని నిస్సహాయస్థితిలో ఉన్న ఆతల్లి వెంకమ్మ, స్థానికులు జిల్లా కలెక్టర్, అధికారులను వేడుకుంటున్నారు.