ఉత్పత్తికి, ప్రశ్నించి హక్కులను సాధించుకోవడానికి ప్రజల భాగస్వామ్యం పెరగాల్సి ఉంది
హక్కులు బాధ్యతల స్పృహ పెరిగితేనే రాజ్యాంగస్ఫూర్తితో
ప్రజాస్వామ్యం విజయవంతమైతది.
**************
--వడ్డేపల్లి మల్లేషo 9014206412
---27....05....2025********
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా " అంటూ పాలకుల పైన అన్నిటికీ ఆధారపడే ప్రజల మనస్తత్వానికి చెక్ పెట్టే పాటను ప్రముఖ విప్లవ కవి శ్రీ శ్రీ రాయగ పాలకులు ప్రజలకు చేసే దానికంటే అందులో మోసాలే ఎక్కువగా ఉంటాయని కూడా ఇక్కడ అర్థమవుతున్నది. అందుకే ప్రతి పనికి ప్రభుత్వాల మీద న్యాయస్థానాల మీద ఆధారపడితే సరిపోదని ప్రశ్నించడం పరిశీలించడం పాలకులను డిమాండ్ చేయడం ఆలోచింపజేయడంతోపాటు రాజ్యాంగ స్ఫూర్తిని పొందడంలో ప్రజల భాగస్వామ్యం మెరుగుపడాలని తద్వారా వాళ్ల హక్కులు బాధ్యతలు ఏమిటో ప్రజలు తెలుసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం మరింతగా విజయవంతమవుతుందనేది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రస్తావించిన విషయం మనకు తెలుసు. అదే విషయాన్ని భారత ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ కూడా తన సూక్తిలో ప్రస్తావించి ప్రజా చైతన్యం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడాన్ని మనం కేంద్రంగా తీసుకొని చర్చించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. ప్రభుత్వాలు అవసరమే ఒంటరిగా ప్రజలు చేయలేని అనేక పనులు ప్రభుత్వాలు చేస్తాయి అందుకోసమే ప్రభుత్వాలను ప్రజలు తమ ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల నాటి మర్యాద మన్నన ప్రజలతో సత్సంబంధాలు ఆ తర్వాత తెగిపోయే ప్రమాదం ఉంటుందని ఆ సంబంధాలను నిరంతరం కొనసాగించడానికి ప్రజల చైతన్యమే గీటురాయి అని ఇక్కడ మనంఈ సూక్తి ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలను ప్రస్తావించిన సందర్భంలో కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంశాలు అమలు కావాలన్నా ప్రజలు తమ హక్కులను చట్టబద్ధంగా పొందాలన్నా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న కచ్చితంగా జాగరూకులైన ప్రజలు చాలా అవసరము. అంతే మాత్రం కాదు ప్రతి కార్యక్రమములో ప్రజల భాగస్వామ్యం పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే అనుకున్న ఆశయాలను ఆకాంక్షలను లక్ష్యాలను చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఈ సూక్తి ద్వారా మనం తెలుసుకోవలసిన వాస్తవం.
హక్కులకై కల బడినంత తీవ్రతగా బాధ్యతలకు నిలబడడానికి పౌర సమాజం సిద్ధంగా లేని విషయాలు మనకు అనేక ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధానంగా నిబద్ధతకు మారుపేరుగా కొనసాగుతున్న కొన్ని సంఘాలు "హక్కులకై కలబడు బాధ్యతలకు నిలబడు" "వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యత" అని భిన్న రకాలుగా తమ ఎజెండాను ప్రకటించడం జరుగుతున్నది ఉద్యోగులు కార్మికులు వ్యాపారులు విద్యావంతులు నిరుద్యోగులు యువత ఇతర కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు తప్పనిసరిగా ఆలోచించవలసిన అంశం ప్రతి విషయంలో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడం, ఉమ్మడిగా అభిప్రాయాలు భావాలు భావజాల వ్యాప్తిని పంచుకోవడం చాలా అవసరం. ఏ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా రంగాలలో తమ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్య విలువల పరిపుష్టి కోసం ఆరాట పడినప్పుడు మాత్రమే
సరైన సమయంలో ప్రశ్నించడానికి డిమాండ్ చేయడానికి హక్కులను సాధించుకోవడానికి ఇతరులకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి చైతన్యం సామూహిక ప్రేరణకు అంకురార్పణ కాగా ఉమ్మడి పోరాటాలు ఐక్య సంఘటనలు ప్రజా ఉద్యమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సందర్భాలను మనం గ్రహించవచ్చు .అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడి ఊరకే రాలేదు. గుడ్డిగా ప్రభుత్వాల మీద ఆధారపడితే ఆధునిక కాలంలో రాజకీయ పార్టీలు పూర్వకాలం మాదిరిగా నిబద్ధతగా పనిచేయడం లేదు. ప్రభుత్వాలు ఏర్పడే వరకు ప్రజల దగ్గరికి వచ్చి చేతులు జోడించి కాళ్లు మొక్కి ఓట్లు ఆశిస్తున్నారు ఆ తర్వాత ఐదేళ్ల వరకు ఓటరు దిక్కు చూడడం లేదు కనుకనే ప్రభుత్వాలు నిబద్ధతగా పనిచేయడం లేదు అని నిర్ణయానికి రావాల్సి వస్తున్నది. కనుక ప్రభుత్వాలతో పని చేయించాలన్న ప్రజల సమస్యల పరిష్కారంలో పాలకులు శ్రద్ధ చూపాలన్న ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం పనిచేయాలన్న పాలకుల పైన ఒత్తిడి చాలా అవసరం అది చట్టసభల్లోనూ చట్టసభల బయట ఇప్పటికీ అనేక రూపాలలో ఒత్తిడి కొనసాగుతూనే ఉన్నది. అయినా అది సరిపోవడం లేదు కనుకనే ప్రజా ఉద్యమాల పేరుతో ఉద్యమకారులు ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులుగా వ్యవహరించి నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వాల మీద ఆధారపడితే సరిపోదు అనే మాటలో అర్థం గుడ్డిగా పాలకులను నమ్మకూడదని ప్రజల కష్టసుఖాలను ఆలోచించరని పోరాటాలు డిమాండ్ల ద్వారా ఒత్తిడి చేస్తే తప్ప గుర్తించే పరిస్థితులు లేవని దాని అర్థం. అందుకే అంతిమంగా ప్రజలు విజ్ఞులు చైతన్యులు జ బాధ్యతాయుతమైన పౌరులుగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాలలో ముఖ్యంగా ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడపలేము అనేది నిర్వివాదం. ప్రజలను అన్ని రంగాలలో భాగస్వాములను చేసుకునే బాధ్యత ఒకవైపు ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ ప్రభుత్వాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా అన్ని అంశాలలో భాగస్వాములు కావడం ద్వారా ప్రభుత్వాలనే ప్రభావితం చేయాలి అనే మాట పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ సూక్తి ద్వారా మనకు అర్థమవుతున్నది.
న్యాయస్థానాలు కూడా అంతేనట:-
***********
న్యాయస్థానాలలో పనిచేసే న్యాయవాదులు న్యాయమూర్తుల యొక్క సామాజిక చింతన సమాజ అవగాహన ప్రజా దృక్పథాలను పట్టి ప్రజలకు న్యాయం చేకూరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రజలకు అన్యాయం జరిగిన నేరం చేయకుండానే శిక్షలు విధించిన విచారణ ఖైదీగా ఏండ్ల తరబడి జైల్లో మగ్గుతున్న పట్టించుకోనటువంటి న్యాయవ్యవస్థ ఉన్న సందర్భంలో న్యాయస్థానాలను నమ్ముకుంటే కూడా ప్రయోజనం ఏమున్నది అనే మాట ఈ మధ్యన వింటున్నాము ప్రతి నోటా. మహారాష్ట్రలోని అండా సెల్లో విప్లవ రచయిత మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేవలం విచారణ ఖైదీగా 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి చివరికి నిర్దోషి అని తేలి బయటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా అనుభవించినటువంటి కరడుగట్టిన శిక్ష కారణంగా ఆయన శరీరము శుస్కించి అనారోగ్యం పాలైన కారణంగా నెల రోజులకే మృత్యువాత పడడాన్ని గమనిస్తే ఈ దేశంలో న్యాయస్థానాలు నిజంగా న్యాయాన్ని అందిస్తాయని నమ్మడానికి ఆస్కారం ఉందంటారా? క్రింది కోర్టు తప్పు అని నిర్ధారణ చేసినటువంటి విషయాన్ని పైకోర్టు కొట్టివేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి క్రింది కోర్టు ప్రజలకు ద్రోహం తలపెట్టే విధంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని పైకోర్టు సవరిస్తూ క్రింది కోర్టు పైన అక్షింతలు వేసిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు కనుక న్యాయవ్యవస్థను కూడా నమ్మడానికి ఆస్కారం లేదని న్యాయ వ్యవస్థ మీద గుడ్డిగా ఆధారపడితే సరిపోదు గనుక హక్కులు బాధ్యతలు సామాజిక స్పృహ రాజ్యాంగంలోని అధికరణాలు రాజ్యాంగ పీఠిక వివిధ చట్టాల అవగాహన కూడా ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉంది అని దీని అర్థం అప్పుడే కదా ప్రశ్నించడానికి అవకాశం ఉండేది రక్షణ పొందడానికి స్వేచ్ఛను అనుభవించడానికి అవగాహన తోడైతేనే కదా ! "ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి" అని ప్రముఖ విప్లవకవి శ్రీశ్రీ అన్నట్లు ప్రభుత్వాలను న్యాయ వ్యవస్థను కూడా సక్రమ మార్గంలో పని చేయించేది ప్రజల ఉమ్మడి భాగస్వామ్యమే. అందుకే ప్రజలే ప్రజాస్వామ్యానికి గేటు రాయి అని దీని అర్థం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )