మహిళా దారుణ హత్య! పొలంలో లభ్యమైన మృతదేహం
మహిళ దారుణ హత్య: పొలంలో లభ్యమైన మృతదేహం
07-01-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెక్కెం గ్రామంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ శవమై కనిపించిన ఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కెం గ్రామానికి చెందిన గుంటి రాధ (45) ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుమార్తె మేఘన ఫిర్యాదు మేరకు చిన్నంబావి ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలి కాల్ డేటా ఆధారంగా అమ్మాయిపల్లికి చెందిన కురువ మౌలాలి అనే వ్యక్తిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కొప్పునూర్ గ్రామ శివారులో వ్యవసాయ పొలం కౌలుకు తీసుకున్న కంది చేనులో రాధ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.