మన నడవడికనే  మరణానంతరం  భవిష్యత్తుకు నడక నేర్పుతుంది

Mar 2, 2024 - 20:58
 0  3

 సమాజాన్ని ధిక్కరించి తప్పులు చేసి  నిందల పాలు అవుదామా ?

సామాజిక బాధ్యతతో  సంఘ కట్టుబాట్లను  గౌరవించి  తోటి మనిషిని సాటి మనిషిగా ప్రేమిద్దామా ?

రేపటి అపకీర్తికి  నేడే పునాది. సంఘాజీవిగా ఆలోచిద్దాం!

--- వడ్డేపల్లి మల్లేశం 

బాధ్యతలకు నిలబడితేనే  హక్కులకై కలబడే  అర్హత అధికారం ఎవరికైనా ఉంటుంది.  ఈ నినాదo ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు  తమ నిబద్ధతను పెంచుకోవడానికి,  బాధ్యతను గుర్తింప చేయడానికి,  కర్తవ్యాలను విస్మరించకుండా ఉండడానికి చాలా తోడ్పడుతూ ఉంటుంది.  వ్యవస్థలో ఏ  స్థాయిలో పనిచేసినా  వ్యక్తిగత జీవితంతో పాటు సామూహిక జీవిత  లక్ష్యాలలో  కూడా  ప్రతి మనిషి  కొన్ని విలువలకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది . మంచి చెడుల విచక్షణ  ప్రధానంగా ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ చర్చకు వస్తుంది . అది తర్వాత కాలంలో  వ్యక్తి గురించి అంచనా వేయడానికి,  వ్యక్తి స్థానాన్ని నిర్ధారించడానికి,  వ్యక్తిత్వాన్ని కొలవడానికి,  తోటి మనిషిని సాటి మనిషిగా చూసే క్రమంలో  ఒక కొ లమానంగా పనిచేస్తుంది . కుటుంబంలోనూ,  సంబంధిత కమ్యూనిటీలోనూ, బంధుత్వంలోనూ,  ప్రజా జీవితంలోనూ  సజీవ మానవ సంబంధాలు కలిగి ఉండడం అనేది  ఆదర్శ జీవితానికి తార్కానం. కానీ దానికి భిన్నంగా అనేకమంది సంకుచిత ప్రయోజనాలతో,  స్వార్థపు ఆలోచనలతో,  అసూయా ద్వేషాలు, కుట్ర కుతంత్రాలతో తమ పరిధిని గిరిగీ సుకొని  ఇతరులకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తారు.  చెడుకు బాసటగా నిలబడి  సామాజికంగా గుర్తింపు కోల్పోయినా సరే కానీ  తన స్వార్థం నెరవేరినందుకు  ఆనంద పడుతూ జీవిస్తారు. మనిషి జీవిత కాలంలో  వ్యవహరించే విధానం, నడవడిక,  సంస్కృతి, ఆచార వ్యవహారాలు,  బాధ్యతల నిర్వహణ,  మానవ సంబంధాలలో చూపే చొరవ విధానాలను బట్టి  ప్రధానంగా వ్యక్తిని అంచనా వేస్తారు.  బ్రతికున్న కాలంలోనూ  అదే లక్షణాలను ఆధారంగా చనిపోయిన తర్వాత కూడా  వ్యక్తి గురించిన ప్రస్తావన చర్చ సందర్భంలో  నిక్కచ్చిగా  విమర్శల పాలు కాక తప్పదు.  భౌతికంగా లేకపోయినప్పటికీ  మానవ  మంచి చెడులను  ప్రస్తావించడం, వేరు చేయడం,  మానవుడు సంఘజీవి గనుక  ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి మాట్లాడడం  అనివార్యమైన సందర్భంలో  మంచి ఎంత గౌరవించబడుతుందో అంతకు మించిన స్థాయిలో చెడు కూడా  పదిమంది నోళ్ళలో నిరంతరం విమర్శించబడుతూనే ఉంటుంది.  విమర్శించబడినా, గౌరవించబడినా  నిరంతరము గమనిస్తూ ఉన్నటువంటి తోటి వాళ్ళు బంధువులు ప్రజలు స్నేహితులు మిత్రులు  తమదైన సహజ శైలిలో  నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్లే ఎక్కువగా ఉంటారు . మొహమాటంతో స్వార్థ ప్రయోజనంతో కొంతమంది  మెప్పు కోసం మాట్లాడే వాళ్లు తప్పును కప్పిపుచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు .కానీ  నిజం "నిప్పులాంటిది" అనే నానుడి ఏదైతే ఉన్నదో  అది ఖచ్చితంగా  నిలబడుతుంది,  నేరస్తులను నిందలపాలు చేస్తుంది అనేది నగ్నసత్యం.  నిజం చెప్పాలంటే కచ్చితంగా  బ్రతికున్నన్నాళ్లు బంధువులను కుటుంబ సభ్యులను  స్నేహితులను  చుట్టూరా ఉన్న సమాజాన్ని  బాధలకు గురిచేసి, ఇబ్బందులు పెట్టి, నిందలపాలు చేసి,  నేర స్వభావాన్ని సొంతం చేసుకొని , స్వార్థ ప్రయోజనాలకు పాకులాడినటువంటి వాళ్లను  కచ్చితంగా  మరణానంతరం  పదిమంది  పది రకాల ఆడిపోసుకుంటే అప్పుడు  తప్పుడు విధానాలకు పాల్పడిన వాళ్లు బ్రతికి ఉండకపోవచ్చు కానీ  ఈ చర్చ  భవిష్యత్తులో  ఇతరుల కైనా  గుణపాఠంగా పనిచేస్తుందనేది ఆశావాదుల నమ్మకం.  అదే సందర్భంలో  వివిధ సమయాలలో  సామాజిక కట్టుబాట్లకు భిన్నంగా వ్యవహరించే వాళ్లను బ్రతికున్ననాడే  కొంతమంది పెద్దలు, బుద్ధి జీవులు, ఆలోచన గల వాళ్లు,  నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటున్న వాళ్లు అయినా  తప్పును తప్పని  మందలించి,  బెదిరించి,  ప్రవర్తన మార్చుకోమని చెప్పడం కూడా చాలా అవసరం. ఈ విషయంలో కొంత వెనుకబడిపోయిన మాట వాస్తవం.  ఎందుకులే వాళ్లతో ఘర్షణ,  స్నేహం చెడిపోతుంది,  ఎందుకు మనం శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకు దూరం కావాలి అని అనుకునే వాళ్ళం చాలామంది ఉన్నాము. ఇది నిజం కాదా?  ఇక్కడే మనిషి తప్పటడుగు వేయకుండా నిబద్ధతగా  నైతిక విలువలకు కట్టుబడి  ఉత్తమ సమాజాన్ని నిర్మించే క్రమంలోపల "కొందరైనా"  వాస్తవాలనే మాట్లాడాలి,  పెద్ద మనిషిగా ఎన్నుకుంటే పంచాయతీలో నిజాయితీకే పట్టం కట్టాలి,  సలహా ఇవ్వమన్నప్పుడు  మానవత్వానికి మద్దతుగా సలహా ఇవ్వాలి,  ప్రేమానురాగాలతో మనిషిని మనిషిగా చూసే విధంగా కచ్చితంగా వ్యవహరించాలి, అవసరమైతే మందలించాలి బెదిరించాలి , చివరికి హెచ్చరించాలి కూడా .అప్పుడు మాత్రమే  తప్పులు చేయకుండా బాధ్యతలు మర్చిపోకుండా  పొరపాటు జరగకుండా  వ్యవహరించడానికి చాలా అవకాశం ఉంటుంది.

కీర్తి అపకీర్తి  :-

విలువల కోసం,  నిబద్ధత , గుర్తింపు ,సంస్కారం, సామాజిక ప్రయోజనం  వంటి  ఆశయాల కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు . అయితే  తాత్కాలిక ప్రయోజనాల కోసం స్వార్థం కోసం  సంపద  కోసం మోసం  దోపిడి  పీడించడానికి కూడా వెనుకాడని వాళ్లు కూడా  అంతకుమించిన స్థాయిలో ఉన్నారు.  .మన కళ్ళ ముందు కొందరు మంచివాల్లుగా  గుర్తించబడితే మరి కొందరు  చెడ్డవాళ్ళుగా గుర్తించబడుతున్నారు.  కీర్తి అపకీర్తి నిరంతరం మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది.  కొంతమంది తమను  ఎవరేమనుకున్నా  తన స్వార్థం కోసమే బ్రతికే వాళ్ళు  ఈ అపకీర్తిని లెక్కించరు . ఇక చనిపోయిన తర్వాత  ఎవరి నోరు ఆపగలము ? మరికొందరు  ఎవరి ఒత్తిడి లేకుండా  తమ జీవన విధానంలో భాగంగా నైతిక విలువలకు కట్టుబడి  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కరణ లవర్చుకొని  జీవించినంత కాలం  ఆత్మీయులుగా గుర్తింపు పొంది  మరణానంతరం కూడా  కొందరిచే అయినా కొనియాడ బడే వాళ్లు  లేకపోలేదు . మానవుడు సంఘజీవి అనే  సిద్ధాంతాన్ని  విశ్వవ్యాప్తం చేయడం కోసం పెద్దగా అక్షరాస్యత  మేధస్సు  సిద్ధాంత పరిజ్ఞానం అవసరం లేదు.  పుట్టగానే  ప్రకృతితో సహజీవనం  కొనసాగిస్తున్న సందర్భంలో  ఇరుగుపొరుగు కుటుంబ సభ్యులతో  మమేకమై  గడుపుతున్న తీరు లోనే  మన కర్తవ్యాలు బాధ్యతలు గుర్తించబడతాయి . ప్రకృతికి, కుటుంబానికి, సమాజానికి  భిన్నంగా నడుచుకుంటున్నావంటే  నీవు ఎవరితో కూడా సర్దుబాటు కావు అని అర్థమవుతుంది.  ప్రకృతి పరిసరాలతో సర్దుబాటు అనేది గొప్ప వ్యక్తిత్వము అని పెద్దలు అంటే ....  సర్దుబాటు చేసుకోలేని వారు  నేరస్తులుగా, దొంగలుగా , అక్రమార్కులు, మోసగాళ్లు , స్వార్థపరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది . సమాజాన్ని ధిక్కరించి  ప్రకృతికి భిన్నంగా  స్వార్థపు ఉచ్చులో జీవించి  బ్రతికినంత కాలం ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా  నిందల పాలు కావడానికి  ఉత్సాహపడుతున్నావా?  లేక  సామాజిక బాధ్యతతో,  మానవతా విలువల పునాదిగా,  సజీవ మానవ సంబంధాలను కొనసాగించే క్రమంలో  మంచి వైపు కృషిచేసి,  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని నిలబెట్టి  సమాజం చే గుర్తించబడడానికి సిద్ధంగా ఉన్నావా ? తక్షణమే తేల్చుకోవాల్సిన సందర్భం ఇది.  వాయిదా వేయడానికి,  ఆలోచించుకోవడానికి,  అప్రతిష్టను ముల్లె కట్టుకోవడానికి  మనిషిగా మనకు అర్హత లేదు అని అందరం అంగీకరించి తీరాలి .! చేసిన నేరాలను,  తప్పుడు నడవడికను,  దోపిడీ పీడన వంచన, కు సంస్కారం  వంటి దుర్లక్షణాలను  సమాజం ముందు అంగీకరించి  కొత్త జీవితాన్ని ప్రారంభించడం  మెరుగైన సామాజిక వ్యవస్థ కోసం పనిచేయడమే  మన ముందున్న కర్తవ్యం అని గుర్తిస్తే చాలు.  ఆ నవోదయం కోసమే  తరతరాలుగా సమాజంలో సాగుతున్న పోరాటాలు , సంఘర్షణ,  వర్గ పోరాటం ....., అన్నింటి అంతిమ ప్రయోజనం  శాంతి,  సహనం , సమానత్వం,  అత్యున్నత దశ సమసమాజ స్థాపన.  అందరం ఆలోచిద్దాం !   ఆ లక్ష్య సాధన కోసం జీవిద్దాం! 
(వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత, హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333