ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనాధికారులు విఆర్‌వో, విఎవోలకు మరో అవకాశం

రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి భేటీ
హైదరాబాద్: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి ( జీపీవో) ను నియమిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇందుకోసం గతంలో విఆర్‌వో ,విఎవో గా పనిచేసినవారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో 3,454 మంది అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు విఆర్‌వో, విఎవో లకు మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
సోమవారం నాడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డి ఎస్ లోకేష్ కుమార్‌తో కలిసి రెవెన్యూ సంఘాలతో సమావేశమై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిందని విఆర్‌వో విఎవో వ్యవస్ధను రద్దు చేసి సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని గ్రామ పాలనా అధికారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.
మీ అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులు విజయవంతమయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భూ భారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్ధాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలు విధాన పరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలన్నారు.
సమావేశంలో తెలంగాణ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కె. గౌతమ్ కుమార్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. రామ్‌రెడ్డి,వి. భిక్షం, ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు పి.రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు నిరంజన్, రాష్ట్ర నాయకులు రమణరెడ్డి , రామకృష్ణా రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సిసిఎల్ఎ యూనిట్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఆర్. రాంబాబు, క్రిష్ణచైతన్య, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి. ఉపేందర్ రావు. లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.