ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి""జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Aug 11, 2025 - 17:25
Aug 11, 2025 - 19:09
 0  7
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి""జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.... 

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆగస్టు 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు.                     *:జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,* ఖమ్మం జిల్లాకు సంబంధించి 292 సి.ఎం. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటితో పాటు జిల్లా ప్రజావాణిలో పెండింగ్ ఉన్న వాటిని కూడా త్వరితగతిన డిస్పోజ్ చేయాలని అన్నారు. ప్రజా ప్రతినిదులు వివిధ అంశాలపై అందించిన 46 దరఖాస్తులు పరిశీలించి 3 రోజులలో క్లియర్ చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధుల దరఖాస్తు పరిష్కారం మనం చేయలేని పక్షంలో దానికి గల కారణాలు తెలుపుతూ లేఖ రాయాలని కలెక్టర్ తెలిపారు.

వార్తా పత్రికలో ప్రచురితమైనట్టి 75 ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు ఫాలో అప్ చేస్తూ రిపోర్ట్ వారం రోజులలో అందించాలని అన్నారు. ఆగస్టు 14 నుంచి 17 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలను జారీ చేసినందున అధికారులు అప్రమత్తంగా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని అన్నారు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆగస్టు 12 సాయంత్రం లోపు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితా పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించి అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. 

వైరా మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకు చెందిన డి.రాంబాబు ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఇంటి నెంబర్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వైరా మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మధిర లేడిస్ హస్టల్ నందు నివాసం ఉంటున్న డి. వెంకటమ్మ తన భర్త కలెక్టర్ కార్యాలయంలో స్వీపర్ గా పని చేసేవారని, 2023 సంవత్సరంలో మరణించారని, తన భర్త రికార్డులు పరిశీలించి స్వీపర్ గా పని చేసినట్లు ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ ఏఓ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామంలోని హైస్కూల్ నందు స్వీపర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు తనను ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని తనకు మళ్ళీ స్వీపర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా విద్యాశాఖ అధికారికు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

సింగరేణి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ మాంగ్య తమ సర్వే నెంబర్ 189/2/1 లో ఉన్న వ్యవసాయ భూమి తన పేరు మీద పట్టా చేయలేదని, తన పేరు మీద పట్టా జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన విజయలక్ష్మి తనకు చిన్న వయస్సులో పోలియో రావడం వలన వంద శాతం శారీరక వైకల్యం ఉందని, తనకు సొంత ఇళ్ళు లేదని, 70 గజాల భూమి ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, చింతకాని ఎంపిడిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

రఘునాధపాలెం మండలం పువ్వాడనగర్ కు చెందిన షేక్ బీబమ్మ, కట్ట మోహన్ దుర్గా, నల్ల నీలవేణి తమ గ్రామంలో 129 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, 126 మంజూరు పత్రాలు పంపిణీ చేశారని, తమ 3 పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మంజూరు పత్రాలు అందించలేదని, తమకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించాలని కోరగా ఎంపిడిఓ కు రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, డిఆర్డిఓ ఎన్. సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------------

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State