ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాస్వామి కవాదుల రక్తం చిందించిన సందర్భాలు అనేకం

హక్కులు, చట్టాల రూపకల్పన,
సామాజిక న్యాయం సాధించడం కోసం
జరిగిన పోరాటాలు తక్కువేమీ కాదు.
ఆ మాత్రం ప్రతిఘటనే మనుషులుగా బ్రతకడానికి దోహదపడుతున్నది.
--- వడ్డేపల్లి మల్లేశం.
హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు, పాలకులు, రాజులు, రాజ్యాలను ఎదిరించడం ఈ దేశ ప్రజలకు కొత్తేమీ కాదు. ఆంగ్ల వలస పాలకుల కాలంలో దాస్య విముక్తి కోసం స్వ పరిపాలన కోసం సంస్థానాల పరిరక్షణ కోసం పోరాడి అమరులైన త్యాగధనులెందరో .దేశమాత దాస్య శృంఖలాలు ఛేదించి స్వదేశం సాధించడానికి తమ ప్రాణాలను బలిపెట్టిన పోరాట వీరులు అగ్రభాగాన నిలుస్తారు. భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను ఒకేరోజు ఉరికంభమెక్కించగా ఆజాద్ గా పేరుగాంచిన చంద్రశేఖర్ శత్రు బలగాలకు చిక్కిన ఇతరుల చేతిలో చావకూడదని తనకు తానే కాల్చుకొని చనిపోయిన ధన్యజీవి. జలియన్వాలాబాగ్ మారణకాండకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉద్ధం సింగ్ బాధ్యుడైన డయ్యర్ను ఇంగ్లాండుకు వెళ్లి కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకొని దేశమాత సేవలో ప్రాణాలర్పించిన మరో వీర కుసుమం . ఇలాంటి త్యాగదనులు పోరాట వీరులు అతివాద మితవాద పద్ధతుల్లో దేశానికి స్వాతంత్రం సాధించిన సమరయోధులు... వారందరికీ జోహార్లు . ఒకరిని మించి ఒకరు చేసిన త్యాగాలు పోరాటాలు చరిత్రాత్మకం.
565 సంస్థానాలను బ్రిటిష్ రాజ్యములో కలుపుకోవడానికి ఓడించి చంపి సామ్రాజ్య విస్తరణ చేసినప్పటికీ దేశమాత ఒడిలో రక్త తర్పణం చేసిన రాజులు కూడా ఎందరో కారణం దేశం కోసం వెల్లువెత్తిన తపన ఆరాటం దేశభక్తి . దేశంలో వివిధ సందర్భాల్లో జరిగినటువంటి జాతి పోరాటాలలో వివక్షతలలో ప్రాణాలు అర్పించిన వారే గాక హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజరిక పరిపాలన కాలంలో భూస్వాములు దేశముకుల ఆగడాల ఆ గడీలలో అవమానాలు అకృత్యాలు అత్యాచారాలకు హత్యలకు ఆత్మహత్యలకు బలైన వాళ్ళు ఎందరో అమరవీరులు... వీరంతా రాచరికపోకడ ,భూస్వామ్య పాలన , భూమి బుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటాలలో నేలకొరిగినవారు వేల సంఖ్యలో ఉన్నారు వారందరికీ వినమ్ర జోహార్లు .
ప్రజాస్వామ్యంలో ప్రజాహింస సంగతేమిటి?
**************
పై బలిదానాలు రక్తతర్పణాలు అన్ని
ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా జరగలేదు .రాజరికం, నియంతృత్వం, నిరంకుశత్వం రాజ్యమేలి న కాలం కనుక ఆ రాజ్య హింసకు కొంత అర్థం ఉంటే ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య యుగంలో ప్రజలు ఎన్నుకున్న పాలకులే కాల్చి చంపిన ఘటనలు, చూపిన వివక్షత, ప్రభుత్వ హత్యలను ఏమందాం ?
--- 1975 నుంచి 77 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు పత్రికా స్వేచ్ఛతో పాటు కోర్టులకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కొల్లగొట్టిన సందర్భం. కాల్పులు హత్యలకు సిగరెట్ వాతలకు చిత్రహింసలకు గురైన వారు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు . వేల సంఖ్యలో నిర్బంధించబడిన ప్రజాస్వామిక వాదులు మేధావుల నిర్బంధం వేధనాభరితం.
-- 2021-22 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేకులను బిగించి శరీరాలకు రక్తాలు కారుతుంటే యుద్ధ భూమిని తలపించే విధంగా కాల్పులు జరిపి 750 పైచిలుకు మందిని పొట్టన పెట్టుకున్న విషయం ప్రజాస్వామ్యబద్ధమేనా .
-- సంపాదకులు,కవులు,రచయితలు,మేధావులు ప్రజలపక్షాన పనిచేస్తే ప్రత్యక్షంగా,పరోక్షంగా పాలకులు పొట్టనపెట్టుకున్నది నిజంకాదా?
-- అనచివేత, వంచన, దోపిడీ, వివక్షతకు గురవుతున్న పేద వర్గాలు ఆదివాసి ప్రజల కోసం బాధ్యత మోస్తున్న ఉద్యమకారులను రాజ్యం ఎందరినో పొ ట్టన పెట్టుకుంటే వేలు లక్షల సంఖ్యలో ఆచూకీ లేకుండా తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన సందర్భం ఈ దేశంలో కొనసాగలేదా? కొనసాగుతూ ఉన్నది కదా.!
-- ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో బషీర్బాగులో పోలీసు కాల్పుల్లో అమరులు కాలేదా? 60 గజాల ఇంటి స్థలం కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోరాటంలో పోలీసు మారణకాండలో మృత్యువాత పడిన ఉద్యమకారులను అప్పుడే మరిచిపోయినారా ?
--- ఆంగ్లేయుల కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో అదే మాదిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గిరిజన మహిళలు, దళిత మహిళల పైన పోలీసులు మిల్ట్రీ సైన్యం జరిపిన అత్యాచారాలు దాడులు మనకు తెలియనివి కావు.
-- కొద్దిమంది మొగల్ చక్రవర్తులు రాచరిక పరిపాలనలో సైతం ప్రజలను కన్న బిడ్డల వలె పాలించిన సందర్భాలు ఉంటే స్వదేశంలో స్వరాష్ట్రాలలో ప్రశ్నించి, ప్రతిఘటించి, నిలదీసినందుకు, పాలకవర్గాల నియంతృత్వాన్ని బజారుకేడ్చినందుకు చెట్ల కు కట్టేసి కాల్చడం , చె రసాలలో బంధించడం , విచారణ ఖైదీలుగా సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తలు ఈ దేశంలో వేల సంఖ్యలో చిత్రహింసలకు గురవుతూనే ఉన్నారు. ఇటీవల సుమారు 10ఏళ్ల జైలు శిక్ష అనంతరం నిర్దోషిగా ప్రకటించబడిన అంగవైకల్యం కలిగిన ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా అనుభవించిన శిక్షకు ఎవరికి శిక్ష వేద్దాం? ఎవరిని దోషిగా పార్లమెంటు ముందు నిలబెడతాం? ఆలోచించాల్సిన అవసరం లేదా ?
10 సంవత్సరాలలో 70 సార్లు పేపర్ లీకేజీ జరిగినా పట్టించుకోని కేంద్రం , తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాల తరబడిగా లీకేజ్ తో చిధ్ర మైన యువత జీవితాలు, పేదలకు దక్కాల్సిన ప్రజాధనం భూస్వాములు సంపన్న వర్గాలకు రైతుబంధు పేరుతో 26 వేల కోట్లు అప్పనంగా కట్టబెట్టి భూమిలేని పేదల నోట్లో మట్టి కొట్టిన వైనం, కనీస అవసరాలు తీరక మానవాభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఉద్యోగాలు ఉపాధి లేక చితికి పోతున్నది ప్రభుత్వాల వివక్షత వల్లనే కదా ! దాడులేమో పేద వర్గాలు, ఆదిమ జాతులు, హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదుల మీద .... ఇక ప్రేమలు కురిపించేది మాత్రం పెట్టుబడిదారులు ,సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, మొండి బకాయి దారులు, భూస్వామ్య వర్గాలపైన. ఈ మాత్రమైనా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే అనాదిగా అట్టడుగు వర్గాలు ఆదిమ జాతులు దళిత జాతులు బి సీ వర్గాలు బహుజన ఉద్యమాల కృషి వల్లనే. కొన్ని చట్టాలైనా ఏర్పడినాయి అంటే, అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు పాలకులు తీసుకుంటున్నారంటే అదంతా ప్రజా ఉద్యమాల వల్లనే కానీ పేదల మీద ప్రేమతో ప్రభుత్వాలు
స్వచ్ఛందంగా చేసినది కాదు. " గెలిచే దాకా సేవకులమని గెలిచిన తర్వాత పాలకులమని మాట మార్చి నియంతృత్వం, అణచివేత , పోలీసు బలగాలు, అధికార
దుర్వినియోగంతో సర్వత్ర అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్నాయి కనుకనే ప్రజాస్వామిక ఉద్యమాలు అంతకు మించిన స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి " .ప్రజాస్వామిక పాలనలో కూడా ప్రజలకు సామాజిక న్యాయం అందకుండా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే దుర్మార్గ ధోరణిని ప్రభుత్వాలు విరమించుకుంటేనే పేదల ఆర్తనాదాలు సర్వోన్నత న్యాయస్థానం తలుపు తడతాయి.అప్పుడు రాజ్యం చేసే నేరాలు, గోరాలు, అవినీతి, వివక్షత బోనులో నిలబడతాయి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )