పోరాటమే జీవితంగా బ్రతికిన నల్ల నరసింహులు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రజా వైతాళికుడు టైగర్ కడివెండి...
వడ్డేపల్లి మల్లేశము
99వజయంతి ప్రత్యేక వ్యాసం
నిజాం రాజు పాలకుడిగా తన ఆధ్వర్యంలో రజాకార్లు ,సర్దేశాయి లు జమీందార్లు ,జాగీర్దార్లు,మక్తేదార్లు, దేశ్
ముఖ్లు,సర్దేశముఖ్లు అంతా కలసి లక్షలాది తెలంగాణ ప్రజలపై దశాబ్దాలుగా కొనసాగించిన రాక్షస, పైశాచిక ,దాడికి వ్యతిరేకంగా అణచివేత, హత్యాకాండ, అత్యాచారాలకు ప్రతిఘటన గా అప్పటిదాకా బాంచన్ నీ కాల్మొక్తా అని బ్రతిమిలాడిన పేద రైతాంగ జనం ఎదురుతిరిగింది. కారం పొడిని,గుత్పలను, చివరికి బందూకులను
పట్టి జరిపిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో వీరులు నేలకొరిగారు .మరెందరో పోరాడినారు. అందులో సింహ గర్జన చేసిన పోరు బిడ్డ .పేద పద్మశాలి యువకిశోరం కడివెండి గడ్డ నల్ల నరసింహులు.
నాటి పరిస్థితులు కొన్ని:-
నాటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని 7430 గ్రామాలలో ఆయన సొంత ఖర్చులకోసం సర్ఫ్ ఎ ఖాస్ అని పిలువబడే భూమి ప్రభుత్వ దళారులై
న పైన చెప్పబడిన వారి చేతుల్లో ఉండేది.
పన్నులు వసూలు చేసే అధికారాన్ని పొందిన కొందరు భూస్వాములు వేల లక్షల ఎకరాల భూములను వారి అజమాయిషీలో పెట్టుకునేది. ప్రజలందరూ, కౌలుదార్లు, కూలీలు దొరల గడీలలో వెట్టి బానిసలుగా బ్రతికే నిస్సహాయ స్థితిలో ఉండేవారు.
ఉదాహరణకు మానుకోట కు చెందిన జన్నపు రెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం లక్షా 50 వేల ఎకరాల భూమిని, విసునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి కి 60 గ్రామాలకు సంబంధించి 40 వేల ఎకరాల భూమి సూర్యాపేట దేశముఖ్ 20 వేల ఎకరాల భూమిని కలిగి ఉండేవారు. దిక్కు మొక్కు లేని లక్షలాది పేద జనం భూముల్లోఆరుకాలం కష్టపడి పంట పండిo చేది. ఆ ఫలాన్ని అనుభవిస్తూ సర్వాధికారాలు కలిగి తరతరాలుగా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తున్న పదుల సంఖ్యలో భూస్వాములు ఒక అసమ సమాజాన్ని నిర్మించి అనివార్యంగా ప్రజా పోరాటం రూపుదిద్దుకోవడానికి కారణమయ్యారు.
ప్రజలకు భూములు లేవు. అన్ని దొరల భూములే. ఒకరిద్దరికి ఉన్న ఆ భూమిని జప్తు చేసుకునేవారు. ఆగడాలను ఎదిరించిన వారిని పోలీసుల సహకారంతో ,రజాకార్ గుండాలతో ,తామే స్వయంగా పోషించే రౌడీ మనుషులతో దాడి చేయించి చంపేవారు.
తెలంగాణ ప్రాంతం అంతటా వందలకొద్దీ గడీల కింద ప్రజలు నలిగిపోతూ కాలగర్భంలో కలిసిపోతున్న దుర్భర పరిస్థితులుండేవి. మరొకవైపు విద్యాగంధం లేక తెలుగు పాఠశాలలు కాన రాకపోవడంతో సంస్కృతి సాంప్రదాయాలు, భాషను రక్షించుకోవడం కోసం ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల ప్రవేశం వారి ఆగడాలకు కళ్లెం వేసే కొత్త రూపాన్ని సంతరించుకున్నది. కమ్యూనిస్టు పార్టీని నిషేధించడం వల్లనే ఆంధ్ర మహాసభ రూపంలో ఉద్యమాన్ని ఉధృతం చేయవలసి వచ్చింది. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ,దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి మానవీయ కోణంలో ఆలోచించే భూస్వామ్య కుటుంబాలకు చెందిన వారు అయినప్పటికీ తమ యావదాస్తిని ప్రజలపరం చేసి, భార్యా పిల్లలతో ఉద్యమంలో దూకడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే నికృష్ట జీవితం గడుపుతున్న అతి పేద కుటుంబాలకు చెందిన వారు కూడా నిరక్షరాస్యులైనా ఉద్యమస్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో తెలంగాణ పోరు లో నిలిచిన
ధీరులు ఎందరో. నల్ల నరసింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ బండి యాదగిరి వంటి పేదలు ఎందఱో ఎందరెందరో.
నల్ల నరసింహులు ప్రస్థానం:-
**********
19 40 నుండి 45 వరకు మధ్య జరిగిన దోపిడి 45 ప్రాంతంలో మరింత ఎక్కువ కావడంతో ఉద్యమం అనివార్యమైనది.
భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ పదకొండవ సభలో చేసిన తీర్మానాల మేరకు సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కార్యాచరణ ప్రకటించారు. ఆ పిలుపు అందుకున్న కడివెండి గ్రామానికి చెందిన పేద పద్మశాలి బిడ్డ నల్ల నరసింహులు తెలంగాణ సాయుధ విముక్తి ఉద్యమ పోరాట కెరటాలలో ఒకడిగా నిలిచాడు. చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఆంధ్రమహాసభలో అత్యంత కీలక పాత్ర వహించిన నల్ల నరసింహులు వేలాది మంది యోధులతో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ జనగామ ప్రాంతాల నాయకుడిగా వీరోచిత విముక్తి పోరాటంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశాడు. ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి చిత్రహింసలకు గురై కోర్టు కేసులు ఎదుర్కొని మూడు సార్లు ఉరిశిక్ష విధించబడినాడు. ఆయినప్పటికి న్యాయస్థానములో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాలు, పోలీసుల చేతనే "తెలంగాణ టైగర్" అని కీర్తించబడ్డ సామాన్య పేద బిడ్డ అసామాన్య వీర కిశోరం గా మారి నాడు.
నా సందర్శనలో కడివెండి గ్రామాన్ని కడివెండి గ్రామ ప్రారంభంలోనే ఉండే స్మారక స్థూపం, గ్రామం నడిబొడ్డున గల తొలి amarudaina దొడ్డి కొమురయ్య స్మారకస్థూపం మొదలైనవి చూసి భావో ద్వేగానికి గురైన అనుభూతి నాస్వీయ
అనుభవం. నరసింహులు స్వగ్రామం కడవెండి .అది ప్రస్తుతం జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలానికి పది కిలోమీటర్ల దూరంలో గల చిన్న గ్రామం. చేనేత పని చేసి నాటి ఉర్దూ మీడియం లో ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నరసింహులు తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా పక్కనపెట్టి నాటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఏళ్లతరబడి అజ్ఞాతంలో ఉండి పోరాడిన ధీరుడు. వీరుడు. కనీసం ఆ గ్రామంలో వారు నివసించిన ఇంటి స్థలాన్ని కూడా చూడలేకపోయినాము అంటే ఎలాంటి దాఖలాలు లేకుండా ఆ కుటుంబమే కనుమరుగైనది. నిర్మాణ రంగంలోకి దూకిన నల్ల నరసింహులు జనగామ తాలూకా లోని ఎన్నో గ్రామాలలో సంఘం దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించి అగ్ర నాయకత్వానికి కింది దళాలకు సమన్వయ పరిచిన మేధావి కొదమ సింహం నరసింహులు. ప్రజలను కార్యకర్తలను సంఘటిత పరచడంతో దొరలకు రజాకార్లకు నిద్ర లేకుండా చేశాడు. ఆనాడు విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ కడివెండి గ్రామం లో దొర గా పిలువబడుతూ దోపిడీ చేసేది. నల్లా నర్సింహులు మొట్టమొదటి తిరుగుబాటును తన సొంత ఊరు కడివెండి లోని జానమ్మ పైననే మొదలుపెట్టి న సందర్భములో 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలను తరిమికొట్టేందుకు ఆంధ్ర మహాసభ నిజమైన సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది
భూస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయిన నల్గొండ ,కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని లక్షలాదిమంది నిరక్షరాస్య ప్రజా సైన్యం ఎక్కడికక్కడ దొరల గడిల పై రజాకార్లపై పోలీస్ క్యాంపు లపై ప్రతీకారం తీర్చుకున్నారు. వెట్టి పేరుతో తరతరాలుగా బందీ అయిన ప్రజల అప్పు పత్రాలను కాల పెడుతూ గడిల ను ధ్వంసం చేస్తూ దొరలను ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షిస్తూ వేల కొలది ఎకరాలభూములను విముక్తి చేసి దున్నే వాడికి పంచిపెడుతూ ఈ విముక్తి ఉద్యమం 1951 అక్టోబర్ వరకు కొనసాగింది ఈ ఉద్యమంలో వేలాది మంది నేలకొరిగారు.
పరకాల లో జెండా పండుగ నాడు భయంకర సామూహిక హత్య తర్వాత బైరాన్పల్లిలో 118 మందిని కాల్చి చంపి కమ్యూనిస్టుల పై ప్రతీకారం తీర్చుకున్నారు.
అజ్ఞాత దళాలు అటు రజాకార్లు పోలీసుల అమానుష చర్యలతో తెలంగాణ అంతా అగ్నిగుండమై ప్రజ్వరిల్లుతున్న వేళ 122 దళాలను, ఆత్మార్పణ గెరిల్లా సమూహాలను నిర్మించి నాయకత్వం వహించిన నరసింహులు కదనరంగంలో ముందుండి నడిపించి అనేకసార్లు హింసను అనుభవించాడు.
నరసింహులు పైన నేరాలు- త్యాగాలు:-
***(*********
నిజాం రాజు దిగిపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. కొత్త సమస్య ప్రారంభమై యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టుల పైన దాడులకు తెగబడ్డారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టగా తిరిగి భూస్వాములకు అప్పగించే విధంగా ఆ సైన్యాలు ఒత్తిడి చేసి కమ్యూనిస్టులను తరిమికొట్టిన వి. వందలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలను నాయకులను అడవుల్లోకి తరుముతూ హత్య చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ జైలు 12 మందిలో ఒకడిగా ఉండి రేపు ఉరితీయబడ తాడు అనగా అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు, భారత ట్రేడ్ యూనియన్ లో ఆందోళన ఫలితంగా ఉరితీత కు 12 గంటల ముందు నరసింహులు ఉరితీత నిలిపివేయబడింది.
సంకెళ్ళతో బంధించబడ్డ నరసింహు
లును చూడడానికి వచ్చిన సైనిక జనరల్ జె.ఎన్.చౌదరికి జిల్లా ఎస్పీ ధనరాజు నాయుడు సంకెళ్ళతో ఉన్న నరసింహులును" టైగర్ ఆఫ్ తెలంగాణ" అని పరిచయం చేసాడట. నిరంతరం గర్జించి ఉరిమే పులి అని నరసింహులును అనేవారని ఆ గ్రామ ప్రజలు మా సందర్శనలో నాతో చెప్పినారు. నిజామును కూలదోసిన కమ్యూనిస్టులు నెహ్రూ ప్రభుత్వానికి కూడా ప్రమాదమే అనే తప్పుడు సంకేతం తో కమ్యూనిస్టు పార్టీ నిషేధించబడడంతో పాటు హెలికాప్టర్ల ద్వారా కరపత్రాలు పంచి అజ్ఞాత నాయకులను క్యాడర్ను లీడర్ను లొంగిపోవాలని హెచ్చరించిన నేపథ్యంలో నరసింహులు తో పాటు అనేక మంది యోధులు నల్లమల్ల, రాచకొండ అడవుల్లోకి పారిపోయి పోరాట విరమణ తర్వాత తిరిగి జనం లోకి వచ్చారు.
అప్పటికీ నరసింహులు పై ఉన్నటువంటి కోర్టు కేసుల వల్ల నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో చివరి ఉరి శిక్ష నుండి బయటపడి 1959 జనవరి 26న స్వేచ్ఛా ప్రపంచంలోకి కాలు పెట్టాడు.
తరువాత వీరోచిత పోరాటం చేసిన వ్యక్తిగా ఆదరణ లభించినప్పటికీ బొంబాయి, సోలాపూర్, భీమండి తదితర ప్రాంతాలలో ఆదరించ బడిన తాను తన ధర్మపత్ని వజ్రమ్మ తెలంగాణ సాయుధ పోరాట మృతులు నాలుగువేల మంది, పంపిణీ చేసిన 10 లక్షల ఎకరాల భూమి, చారిత్రక విజయాలను స్మరించుకుంటూ జీవితమే నిరంతర పోరాటం అనే సిద్ధాంత అవగాహనతో తన శేష జీవితాన్ని గడిపాడు.అక్టోబర్ 2, 1926లో జన్మించిన నల్ల నర్సింలు జీవితానికి సార్థకతను ప్రజాపోరాటం ద్వారా సంతరించుకుని19 93 నవంబర్ 5న కన్నుమూసినా కడివెండి గ్రామ ప్రజలకు, జనగామ ప్రాంతంలో, రాష్ట్ర స్థాయిలోనూ ఒక పోరాట వారసత్వం గా నిలిచిన నరసింహులు ప్రజా ఉద్యమాలకు మద్దతుగా అండగ ప్రజా పోరాటాల లోనే లీనమయ్యాడు. త్యాగాల పోరుబిడ్డ నరసింహులు చరిత్రను నేటితరం యావత్తు అధ్యయనం చేయకపోతే చరిత్రను విస్మరించినట్లే. ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నరసింహులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను నిక్షిప్తం చేయడం మరో విజయంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేటి తరం నాటి సామాజిక రాజకీయ సాంస్కృతిక వాతావరణాన్ని, ఉద్యమాలను, ప్రతిఘటనను ,దోపిడిని అంచనా వేయవచ్చు .నేటి పాలనను సవరించుకోవడానికి నాటి ఉద్యమం నుండి స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు అమర్ రహే.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)
(నల్లనర్సింలు 96వ జయంతి ప్రత్యేక వ్యాసం).