కొత్త సంవత్సరానికి స్వాగతం సరే !
ఆడంబర ఖర్చులు మనిషిని అగాధానికి నెట్టివేస్తాయి.
అంతరార్థాన్ని శోధిస్తే, జీవితాన్ని పునర్నిర్వచిస్తే నిరాశలోంచి లక్ష్య సాధన వైపుగా పయనించవచ్చు.
కోటి కాంతుల చైతన్యాన్ని పునికి పుచ్చుకోవచ్చు.* ఆరంభ వేడుకలు ఆ స్ఫూర్తిని రగిల్చి నాయా? నిన్ను నువ్వే ప్రశ్నించుకో !
---వడ్డేపల్లి మల్లేశం
ప్రతిఏటా ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆడంబరాలు నిర్వహించుకోవడం, కేకులు కట్ చేయడం, క్లబ్బులు పబ్బులు ఈవెంట్లో పరవళ్ళు తొక్కడంతో పాటు మద్యం మత్తులో అసాంఘిక చర్యలకు కూడా పాల్పడే ప్రమాదం లేకపోలేదు . 31 డిసెంబర్ నాడు రాత్రి జరిగే ఈ తతంగం పైన తెల్లవారి పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు " గత సంవత్సరాన్ని మించి భారీగా మద్యం అమ్మకాలు", "నూతన సంవత్సర ఆనంద డోలికల్లో యువత" అంటూ ఏదో సాధించినట్లు , ఎవరినో ఉద్ధరించినట్లు, ఈ వ్యవస్థకు మనం ఎంతో మేలు చేసినట్లు వచ్చే కథనాలన్నీ కూడా వ్యక్తి తాత్కాలిక ప్రలోభాన్ని, క్షణిక ఆవేశాన్ని , ఆనందం ముసుగులో వే సే తప్పటడుగును గుర్తుకు చేస్తాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణం అరుదుగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా పేద, దారిద్రరేఖ దిగువనగల వాళ్లతో సహా మధ్యతరగతి సంపన్నవర్గాలతోపాటు కోటీశ్వరుల వరకు కూడా చేసే ఆడంబర ఖర్చులు వ్యక్తి నిష్క్రియాత్మకతను , బాధ్యతారాహిత్యాన్ని , తాత్కాలిక ఆలోచనలను మాత్రమే ప్రజబింబిస్తున్నాయి . ఆ ముసుగులో జరిగే ఘోరాలు, నేరాలు, సామాజిక ద్రోహాలు, ఆసాంఘిక శక్తుల ఇష్టపన్నాగాలకు అంతే లేకుండా ఆపోతున్నది. అలవిగాని ఆనందములో కూడా హత్యలు ఆత్మహత్యలు జరిగే ప్రమాదం లేకపోలేదు అలాంటివి గతంలో ఎన్నో జరిగినవి మనందరికీ తెలిసిందే.
స్నేహితులు అభిమానులు వివిధ సంఘాల మధ్యల ప్రేమాన్వి తంగా జరగవలసిన ఈ కార్యక్రమాలు పక్కదారి పట్టడం ఆందోళనకరమైన విషయం. దానిని ప్రజలు ప్రజా సంఘాలు, మేధావులు కూడా ఖండించకపోవడం, ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించడం, న్యాయవ్యవస్థ ఉక్కు పాదం మోపకపోవడం, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం కనుసైగ చేయడం
ఈ వేడుకల దుష్ప్రభావానికి కారణం అవుతున్నది . ఏడాది పొడవునా అధికారికంగా కొనసాగే ఈ కార్యక్రమాలను ప్రభుత్వాలు కట్టడి చేయకపోగా కొన్ని శక్తుల ఒత్తిడికి తలవంచి మద్దతు ఇవ్వడం చూసి చూడనట్టు ఊరుకోవడం నిరంతరం కొనసాగితే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉగ్రరూపం తారాస్థాయికి చేరుకోవడంతో ఇది చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని, తమ జన్మ హక్కు అని, ఇదే జీవితమని, ఇంతకు మించిన లక్ష్యాలు ఆదర్శాలు ఆచరణ లేనే లేదని యువత మిగతా ప్రజానీకం నిర్ధారణకు వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ భావన జాతి జీవనం, సామాజిక బాధ్యత, లక్ష్య సాధన పైన పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది .
అంతరార్తాన్ని సమీక్షించుకోవడం అవసరం":
**""*******
ఆయా జాతుల భాషలపరంగా నూతన సంవత్సరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అంతకుమించిన ప్రాధాన్యత ఆంగ్ల సంవత్సరానికి ఇవ్వడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉన్న కారణంగా ఇది సాధారణీకరించబడుతున్నది. అయినప్పటికీ లక్ష్యాన్ని ఆదర్శాన్ని ఆచరణను సరిచేసుకొని, వక్రమార్గం పట్టిన జీవన గమనాన్ని నిర్దేశించుకుని , ఉత్తేజపూరితమైన వాతావరణంలో స్నేహితులు తను నమ్మిన వ్యక్తుల మధ్యలో జరుపుకో వలసినది పోయి పరాచకాలు ఆడడానికి పరిమితం అయితే ఎలా? ఇప్పటికీ చాలా ప్రాంతాలలో కొన్ని సంస్థల పక్షాన అభిమానులను ఆహ్వానించి స్థానిక అంశాలతో పాటు కొత్త సంవత్సర వేడుకల లక్ష్యాన్ని కొంతవరకైనా ప్రస్తావించుకునే సందర్భాలు కూడా లేకపోలేదు . ఇలాంటి కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలి. ప్రతి చోట జీవితం ఆచరణ లక్ష్యం భవిష్యత్తు అంశాల పైన చర్చ జరగాలి. గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు మధ్యనున్న ఘర్షణను పోల్చుకోవడం ద్వారా ఉన్నత ఆశయాన్ని చేరుకోవడానికి, ఆటంకాలను సవాలుగా స్వీకరించడానికి ఈ వేడుకలు వేదిక కావాలి . పరస్పరం కలుసుకో ని వాళ్ళు పలకరించుకొని వాళ్ళు సుమారు ఈ నెలాఖరు వరకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మొక్కుబడి పలకరింపు కాకుండా గతానికి మరింత భిన్నంగా, ఉన్నతమైన ఆలోచనలతో, వ్యక్తిగత జీవితాన్ని సామూహిక జీవితాన్ని జాతీయ జీవన గమనాన్ని ప్రభావితం చేసే విధంగా నడవడికను తీర్చిది ద్దుకోవడం ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అది పరోక్షంగా సామాజిక బాధ్యతకు దారితీస్తుంది కూడా. నిరాశ నుండి ఆశావాదానికి, చీకటి నుండి వెలుగులోనికి , అచేతనత్వం నుండి చైతన్య జీవన స్రవంతిలోనికి , అశాస్త్రీయమైన ఆలోచనల నుండి శాస్త్రీయ మార్గానికి బాటలు వేయడానికి ఈ వేడుకలు వేదిక కావాలి. వేడుకల అంతరార్థాన్ని చర్చించుకుని పునర్నిర్వచి0 చుకుని మరింత ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఆకాంక్షించుకోవడానికి మాత్రమే ఈ వేడుకలు వేదిక కావాలి కానీ అపసవ్య విధానాల ద్వారా అనాలోచిత చర్యలకు దారి తీస్తే దానిని ప్రభుత్వము పెట్టుబడిదారులు చట్టబద్ధమైన కార్యక్రమాలు గా చూస్తే చేజేతులా యువతను నిర్వీర్యం చేసినట్లే అవుతుంది . ఇప్పటికే మద్యం క్లబ్బులు పబ్బులు ధాబాలు మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అంశాలలో మునిగి అస్తి త్వాన్ని కోల్పోతున్న యువత మధ్య వయస్కులను ప్రమాదం నుండి గట్టెక్కించవలసిన బాధ్యత బుద్ధి జీవులు బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి పైన ఉన్నది .విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఇంటిలోనూ, సంఘాలు సంస్థలు ప్రతి చోట కూడా నూతన ఆశయంతో కొత్త సంవత్సర వేడుకలు నిరాడంబరంగా కొనసాగాలి. లక్ష్యాన్ని నిర్వచించుకోవాలి, బాధ్యతలను గుర్తించాలి, ఈ వ్యవస్థ మరింత మెరుగైన స్థితిలోనికి రావాలని ఆకాంక్షించాలి. మన శక్తిని అంచనా వేసుకోవడానికి , మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి , సమానత్వం సాధించడానికి, అసమానతలు అంతరాలను ఒక్కసారి మననం చేసుకోవడానికి , విశ్వ మానవ కళ్యాణ
ఆలోచనకు జీవం పోయడానికి ఈ వేడుకలు వేదిక అయితే బాగుండు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం, పెట్టుబడిదారులు, నిర్వహణ సంస్థలు ఏ కోశాన కూడా ఈ లక్ష్యాన్ని కలిగి ఉండవు. లాభాపేక్షతో వాణిజ్య ధోరణితో వ్యక్తి బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఎదురుచూస్తాయి . అలాంటి చోటనే మనిషి ఆత్మ నిబ్బరంతో భూమ్యాకాశ శక్తినీఅధిగమించి విమానాలు పైకి ఎగిరినట్లు ఆడంబర జాఢ్యాల జోలికి వెళ్లకుండా ప్రజలు విముక్తి కావాలి ప్రతిఘటించాలి. మూస విధానాలకు స్వస్తి పలకడంతో పాటు వ్యక్తి బలహీనతలు బలాలు, ఆడంబరత్వం నిరాడంబరత్వం, అలవాట్లు దురలవాట్లు, ప్రతిఘటించే తత్వం మానవత్వం బానిసత్వం వంటి అంశాల పైన ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, ఉమ్మడిగా చర్చించుకోవాలి. సవాలుగా స్వీకరించి పిడికిలి బిగించి సత్తాను చాటాలి., ఇతరులను ఆలోచింప చేసే విధంగా ప్రేరణ అందించాలి . అదే కదా నూతన సంవత్సర సందర్భంగా జరగాల్సింది కానీ జరుగుతున్నది జరిగింది ఏమిటో ఒక్కసారి ఆకళింపు చేసుకొని భవిష్యత్తులో ఇదొక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని, తప్పుడు విధానాలపై సమర శంఖం పూరిస్తుందని, సమాజ సంస్కరణకు పెద్దపీట వేయాలని ఆశిద్దాం! ఆ వైపుగా అడుగులు వేద్దాం!.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)