పెంచిన ఆటో చార్జీలకు ప్రజలంతా సహకరించాలి
ఈ నెల 26 నుండి లోకల్ ఆటో చార్జీలు 30 రూపాయలు
పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆటో చార్జీలు పెంచడం జరుగుతుందని ప్రజలంతా సహకరించాలని సూర్యాపేట పట్టణ ఆటో జేఏసీ బి ఆర్ టి యు, ఐ ఎన్ టి సి నాయకులు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో లోకల్ ఆటోలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ 2019 నుండి 20 రూపాయలు చార్జి తీసుకోవటం జరిగిందని, అప్పటినుండి ఇప్పటివరకు పెట్రోల్ డీజిల్ ధరలతోపాటు ఆటో స్పేర్ పార్ట్స్, ఇంజన్ ఆయిల్, మెకానికల్ చార్జీలు, టైర్ పంచర్ రేట్లు పెరగడంతో ఆర్థిక భారం అవుతున్నందున తప్పనిసరి పరిస్థితిలో గతంలో ఉన్న 20 రూపాయలకు కేవలం పది రూపాయలు మాత్రమే పెంచి 30 రూపాయలు చేయడం జరిగిందని తెలిపారు.ఈనెల 26 శుక్రవారం నుండి ఆటో చార్జీలు అమలులోకు వస్తున్నందున ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొన్నారు.