33 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన గురు శిష్యులు.
ధరూర్ జడ్.పి.హెచ్.ఎస్ లో భావోద్వేగాలతో 1993-94 బ్యాచ్ గెట్ టుగెదర్.
జోగులాంబ గద్వాల 10 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన గురు శిష్యులు పాఠశాల అంటే కేవలం చదువు నేర్చుకునే ప్రదేశం మాత్రమే కాదు.జీవితానికి పునాది వేసే గుడి. ఆ మాటను మరోసారి నిజం చేస్తూ ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల*లో 1993-94 బ్యాచ్ విద్యార్థులు ఈరోజు గెట్ టుగెదర్ నిర్వహించారు. 33 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తమ గురువులను, సహవిద్యార్థులను చూడగానే పూర్వ విద్యార్థుల కళ్లల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. స్కూల్ బెల్, ప్రార్థన, క్లాస్ రూం, ఆటల మైదానం.. ప్రతి మూలలో తమ చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఉద్వేగానికి గురయ్యారు.
ఘనంగా స్వాగతం
ఉదయం నుండే పూర్వ విద్యార్థులు స్కూల్ కు చేరుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులకు పూలమాలలతో, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది.గురువులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు,విజయ్ బాబు, వెంకటరమణ, శ్రీనివాసరావు, లక్ష్మిరెడ్డి, గురురాజారావు పాల్గొన్నారు. వారు తమ బంగారు రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. మీరు ఎక్కడ ఉన్నా మంచి పేరు తెచ్చుకోవాలి. మీ విజయాలే మాకు గర్వకారణం అని గురువులు చెప్పిన మాటలకు విద్యార్థులు కరతాళ ధ్వనులతో స్పందించారు.ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు నరేష్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర కీలకమని, వారు సహకరించాలని కోరారు.
పాత జ్ఞాపకాల నెమరువేత
కార్యక్రమంలో విద్యార్థులు తమ స్కూల్ రోజుల్లో జరిగిన సరదాలు, పరీక్షల టెన్షన్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల చివాట్లు అన్నీ పంచుకున్నారు. గత 33 సంవత్సరాలలో తాము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ విజయానికి కారణం ఈ పాఠశాల, గురువులేనని కృతజ్ఞతలు తెలిపారు.
తీర్మానాలు
చివరగా పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తామని, ప్రతి ఏడాది ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటామని తీర్మానించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, లైబ్రరీకి పుస్తకాలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.కార్యక్రమం చివర్లో అందరూ కలిసి సామూహిక ఫోటో దిగారు. మధ్యాహ్న భోజనాలతో కార్యక్రమం సంతోషంగా ముగిసింది.గురువు లేకుండా విద్య లేదు 33 ఏళ్ల తర్వాత తమ గురువుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న క్షణాలు ప్రతి విద్యార్థికి మరిచిపోలేని అనుభూతిని మిగిల్చాయి.