బీపీ, ఒత్తిడి, ఊబకాయం.. గుండెకు ముప్పు
సూర్యాపేట టౌన్ మేజర్ న్యూస్ : సూర్యాపేట: గుండెపోటు అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య కాదని, ప్రస్తుతం యువతలో కూడా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పోలమూరి తెలిపారు. అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం వంటి సంప్రదాయ ప్రమాద కారకాలతో పాటు మానసిక ఒత్తిడి, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి కారణాలు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఛాతినొప్పి గుండెపోటు కాకపోయినా, అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలను నివారించాలంటే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.ముఖ్యంగా అధిక రక్తపోటును "సైలెంట్ కిల్లర్"గా అభివర్ణిస్తూ, చాలా మందికి బీపీ ఉన్న విషయం తెలియకపోవడం లేదా చికిత్సను సక్రమంగా కొనసాగించకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు.ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చని డాక్టర్ ప్రణీత్ పోలమూరి సూచించారు.