పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే... 25 కిలోల అదనపు బియ్యం, రైస్ కుక్కర్, 5వ తరగతి పూర్తైతే సైకిల్!
ఇంటి పన్ను చెల్లించే బాధ్యత గ్రామపంచాయతీ ఇదే!
నాగులపహాడ్ 10 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ మండలం: ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో నాగులపహాడ్ గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి ముందుకొచ్చారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్‌కు అదనంగా నెలకు 25 కిలోల బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగ్‌లు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రి అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా, అదే పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసే ప్రతి విద్యార్థికి నూతన సైకిల్ బహుమతిగా అందిస్తామని ప్రకటించారు.
ఇటీవల అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాఠశాల మూసివేత ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో, ప్రభుత్వ బడిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను ఈ విద్యాసంవత్సరంలో తప్పకుండా చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ రాయి రమేష్, వార్డు సభ్యులు కొండ గోవర్ధన్, మామిడి జానమ్మ, కందుకూరి నరేష్, గోలి చిన లింగయ్య, మీసాల జ్యోతి, ఒగ్గు రేణుక, కందుకూరి బక్కమ్మతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొని ఈ వినూత్న కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు.