ఇటిక్యాల నుండి తరలించిన సిఓఈ కళాశాలను వెనక్కి తీసుకురావాలి

Jul 7, 2026 - 17:34
Jul 7, 2026 - 17:57
 0  1

పేద విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి.

జోగులాంబ గద్వాల 7జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా నుండి తరలించిన ప్రతిష్టాత్మక సిఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ప్రభుత్వ కళాశాలను వెంటనే యథాస్థానానికి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్. రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ విద్యాసంస్థలు నడుస్తుంటే, గతంలో అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం కొత్తదేవరపల్లి గ్రామ సమీపంలో ఉన్న సిఓఈ కళాశాలను వేరే ప్రాంతానికి తరలించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇందుకు గత పాలకుల నిర్లక్ష్యమా లేక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతా కారణమా అని ఆయన ప్రశ్నించారు. ఈ కళాశాల అందుబాటులో ఉండటం వల్ల జిల్లాలోని పేద, రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ మరియు పైచదువులకు ఉత్తమ విద్యావకాశాలు లభించేవని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ సంస్థను మూసివేయడం వల్ల వెనుకబడిన ఈ ప్రాంత విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేక నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కళాశాలను ఇటిక్యాల ప్రాంతంలోనే తిరిగి ప్రారంభించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నరసింహ, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, నాయకులు భీమన్న, శ్రీకాంత్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State