జిఎంపిఎస్ స్ఫూర్తి యాత్ర నిర్వహించడం అభినందనీయం
ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట, 09 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- 30 ఏళ్ల గొర్రెల మేకల పెంపకం దారుల ఉద్యమ ప్రస్థానంలో అమర వీరులు చేసిన అసమాన త్యాగాలు గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి యాత్ర నిర్వహించడం అభినందనీయం అని ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. గురువారం జనగామ జిల్లా కడివెండి గ్రామంలో ని తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్మారక స్థూపం నుండి ప్రారంభమైనస్ఫూర్తి యాత్ర సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా సూర్యాపేట పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలోఆయన మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నాటి నుంచి నేటి వరకు ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కుటుంబాలను కలిసి ఆ పోరాట యోధులు చేసిన అసమాన త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా 40 కుటుంబాలను కలుసుకోవటం గొప్ప విషయం అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ మాట్లాడుతూ ఈ 30 ఏళ్ల ఉద్యమ నేపథ్యంలో అనేకమంది పోరాట యోధులు సంఘం కోసం, గొర్రెల మేకల పెంపకం దారుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారని అన్నారు.
సంఘం 30 ఏళ్ల పోరాట ఫలితంగా 559,1016 వంటి జీవోలను సాధించిన చరిత్ర జిఎంపిఎస్ కు తగ్గిందన్నారు. చనిపోయిన గొర్రెల కాపరులకు ఇన్సూరెన్స్, వ్యాక్సిన్, గొర్రెల పంపిణీ, వంటి అనేక చట్టాలను సంగం పోరాడి సాధించింది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న నేటికీ గొర్రెల కాపరులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. గొర్రెల మేకల పెంపకం దారులు నిత్యం దొంగల బారిన బడి ప్రాణాలు కోల్పోతూ ఆర్థికంగా నష్టపోతున్నారని కర్ణాటక తరహాలో గొర్రెల కాపర్ల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన గొర్రెల పెంపకం దారులకు 7వేల రూపాయలు పించను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెల కాపర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, రాష్ట్ర నాయకులు చల్ల మల్లయ్య, జిల్లెల్ల పెంటయ్య, జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, ఉప్పుల రమేష్, జి ఎం పి ఎస్ జిల్లా నాయకులు మట్టి పెళ్లి సైదులు, వజ్జా వినయ్ యాదవ్, కంచు గట్ల శ్రీనివాస్, కంబాలపల్లి శ్రీనివాస్, రాజుల నాగరాజు, భయ్యా మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.