పవర్ ఆఫ్ అటార్నీ
ఎవరికయినా ఒక్కొక్కప్పుడు తన ఆస్తిని నిర్వహించు విషయములలో వారికి వివిధ ప్రదేశములలో ఆస్తులు ఉండవచ్చును. లేదా వారు ఇతర వృత్తి వ్యాపకములలో దీనికి సమయం కేటాయించలేని పరిస్థితులలో ఉండి ఉండవచ్చును. అటువంటి సమయములలో తమ ఆస్తిని నమ్మకముగా సంరక్షించుటకు, దానికి సంబంధించిన ఇతర విషయములు, దాని మెయింటెనెన్సును సరిగా చేయుటకు సదరు ఆస్తి యజమాని తరఫున వారి ప్రతినిధి అవసరమయి వుంటుంది. ఆ ప్రతినిధిని ఏజెంటు అంటారు.
తన ఆస్తి వ్యవహారములను తన తరఫున నిర్వహించేందుకు అవసరమైన ఏజెంటును ఏర్పాటు చేసుకునే హక్కు సదరు ఆస్తి యజమానికి ఉంటుంది. కాంట్రాక్టు చట్టములోని సెక్షను 182 ప్రకారం ఏజెంటు యొక్క నిర్వచనం ఈ క్రింది విధముగా చెప్పబడినది.
"ఏజెంటు అంటే తన తరఫున మూడవ వ్యక్తితో ఇరువురికి సంబంధించిన వ్యవహారములు నడుపు వ్యక్తి అని అర్థం. ఆ వ్యవహారము ఎవరి తరఫున చేయబడినదో లేదా ఎవరి కొరకు అట్లు ప్రాతినిధ్యమివ్వబడినదో అతడే ప్రధాన వ్యక్తి”
పవర్ ఆఫ్ ఏజన్సీ అనేది ఏజన్సీ కాంట్రాక్టులో ప్రవేశించుతూ చేయబడిన కాంట్రాక్టు యొక్క రూపమే. అయినా, ఈ కాంట్రాక్టు అక్షరబద్ధమైనపుడు మాత్రమే ఆ పత్రాన్ని "పవర్ ఆఫ్ అటార్నీ" అంటారు.
పవర్సు ఆఫ్ అటార్నీలను చట్టము, 1882లో "పవర్ ఆఫ్ అటార్నీ” అనే మాటలో, "దానిని వ్రాసి ఇచ్చే వ్యక్తి పేరు మీద మరియు అతని తరఫున వ్యవహరించటానికి, ఒకానొక నిర్దిష్ట వ్యక్తికి అధికారమిచ్చేటటువంటి ఏ పత్రము అయినా చేరుతుంది" అని ఉన్నది.అందుచేత పవర్ ఆఫ్ అటార్నీ అనే విషయము కాంట్రాక్టు చట్టము, 1872లోని ఏజన్సీకి సంబంధించిన పదవ అధ్యాయమునకూ, పవర్సు ఆఫ్ అటార్నీ చట్టము, 1882నకూ వర్తింపబడి వుంటుంది.
భారత కాంట్రాక్టు చట్టములోని 183వ సెక్షను క్రింద మేజరయిన యే వ్యక్తి అయినా, ఆరోగ్యకరమైన మనస్థితి కలిగియున్నట్లయితే, ఆయన తన తరఫున ఏజెంటును నియామకము చేయవచ్చును. ఆ ఏజెంటు కూడా మేజరూ, ఆరోగ్యకరమైన మనస్థితి కలిగి ఉండాలి. ఈ పవర్ ఆఫ్ అటార్నీ రెండు రకములుగా ఉంటుంది. 1. ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీ. 2. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ.
ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీ అనేది కేవలం ఒక్క వ్యవహారమునకు సంబంధించి మాత్రమే ఇవ్వబడుతుంది. ఆ వ్యవహారము పూర్తికాగానే ఈ ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీని వహించే వ్యక్తి అధికారము అంతమవుతుంది.
ఇక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అయితే దానిని స్వీకరించిన వ్యక్తి తనకు ఇచ్చిన వ్యక్తి (ప్రధాన వ్యక్తి) తరఫున అన్ని రకముల వ్యవహారములు నడుపుటకైనా అత్యంత విస్తృతమైన అధికారాలు కలిగి ఉంటాడు. ఈ పవర్ ఆఫ్ అటార్నీలు వ్రాసేటపుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చు ఉద్దేశ్యమును బట్టి మాత్రమే అది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీయా లేక స్పెషల్ (ప్రత్యేక) పవర్ ఆఫ్ అటార్నీయా అనేది నిర్ణయింపబడుతుంది. అంతే కాని రెండిటిలో స్థూలంగా ఎటువంటి మార్పులు ఉండవు. ఈ పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తికి సదరు వ్యవహారములో తనకు యుక్తము, తన ప్రధాన వ్యక్తికి లాభనీయము అని తోచిన ఎటువంటి వ్యవహారములుగాని, పత్రములు కాని ఆయన తరఫున తానే సంతకము చేయవచ్చును. ఈ సంతకమునకు సదరు ప్రధానవ్యక్తి సంతకమునకు ఇవ్వబడే విలువ ఇవ్వబడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారములలో పవర్ ఆఫ్ అటార్నీ దాఖలు చేసే వ్యక్తి అత్యంత నమ్మకస్థుడై, వ్యవహార దక్షుడై ఉండడం మంచిది.
ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చునపుడు ఏజెంటుకు ప్రధాన వ్యక్తి కొన్ని హద్దులను లేదా పరిమితులను విధించవచ్చును. దీని ద్వారా ఏజంటును తనకు లభించిన విస్తృతమైన అధికారములను స్వలాభమునకు ఉపయోగించుకోకుండా, లేదా ప్రధానవ్యక్తి ప్రయోజనములకు భంగకరం కాకుండా చూచుకొనవచ్చును.
1. అమలు కావాల్సిన డాక్కుమెంటులోని భాగమును దానిలోని మాటల చేతనే నియంత్రణ చేయవలసి ఉంటుంది. అంటే ప్రత్యేకమైన మాటల ద్వారా అమలును నియంత్రించవచ్చును.
2. ప్రత్యేకమైన పనులు చేయడానికి ఇవ్వబడిన అధికారములో ఆ మాటలు వాడకుండా సాధారణ మాటలు వాడినట్లయితే, ఆ మాటలు ఆ ప్రత్యేకమైన పనులు నిర్వహించటానికి ఎంతవరకూ అనసరమైతే అంతవరకు మాత్రమే పరిమితమని స్పష్టంగా తెలియజేయాలి.
3. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా లభించిన అధికారము ద్వారా ఆ పనులను చేయుటకు అవసరమైన నిర్వాహక అధికారములన్నీ చేరి ఉంటాయి. AIR 1938 Cal. 423 ລ້ລ້ AIR 1951 Punj. 371.
పవర్ ఆఫ్ అటార్నీ ఒకొక్కప్పుడు రిజిస్టరు కాకపోయినా దానికి చట్టబద్ధత కల్పించబడింది. ఒక వ్యక్తి తాను ఇండియాలో ఉండని కాలములో తన తరఫున వ్యవహరించుటకుగాను మరియొక వ్యక్తిపేర పవర్ ఆఫ్ అటార్నీ వ్రాసి ఇచ్చినాడు. అయినప్పటికిన్నీ అది రిజస్టరుకాని కారణమున కలకత్తా హైకోర్టు దాని యథార్థతను శంకించవలసిన అవసరములేదని అభిప్రాయపడింది. (AIR 1916 Cal. 979). దీనివల్ల పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టరు కాకపోయినప్పటికీ చెల్లుబాటవుతుంది అని తెలుసుకోవచ్చు. కానీ దాని యథార్థతను ఎవరైనా ప్రశ్నించబడిన సందర్భాలలో సదరు ఏజెంటు లేక ప్రధాన వ్యక్తి దానిని రుజువు చేయవలసి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు రిజిస్టరయినట్లయితే, అది దానికి చట్టబద్ధత నిర్ద్వందంగా కల్పించబడి, చాలా సందర్భాలలో మరల రుజువు చేసుకోవలసిన అవసరం కలగదు. కనుక పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టరు చేయుట ఉత్తమం. ఏదైనా ఆస్తులయొక్క అమ్మకం, కొనుగోలు వంటి సందర్భాలలో కొనుగోలుదారుడు ఏజెంటు యొక్క అధికారమును సదరు వ్యవహారములలో పరిశీలించటానికి పనికివస్తుంది.
10