పంట పొలాల నుండి జనం శరీరాల్లోకి  కృత్రిమ రసాయ నాల వరద  కొనసాగాల్సిందేనా.?

Aug 23, 2025 - 12:26
 0  4

  సేంద్రీయ వ్యవసాయం ద్వారా  భూ సారాన్ని తిరిగి పునరుద్ధరించలేమా.?  భయంకరమైన రోగాల బారి నుండి  జాతిని రక్షించుకోవడం  అందరి బాధ్యత*
*************
---  వడ్డేపల్లి మల్లేశం 9014206412 
---03....04....2025********
భూమిలో సహజంగా ఉండే  పోషకాలతో పాటు సేంద్రీయ ఎరువుల ద్వారా  గతంలో భూసారం తగ్గకుండా సూక్ష్మ స్థూల పోషకాలు ఘననియంగా  అందేవి.  హరిత విప్లవం కారణంగా 1965 -70 ప్రాంతం నుండి  కృత్రిమ ఎరువుల పైన ఆధారపడిన  కారణంగా దిగుబడి ఎక్కువగా కావాలనే  నెపంతో ఎరువులు  పురుగు మందుల వాడకం  పెరిగి  అదుపు చేయలేని దుస్థితికి చేరుకోవడం వల్ల నేడు పంట పొలాల్లో  విచ్చల  విడిగా చల్లుతున్నటువంటి రసాయనిక పదార్థాలు  జనం శరీరాల్లోకి చేరి  గుల్లబారుస్తున్న విషయాన్ని మనం ఆలస్యంగానైనా గమనించి  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువులు పురుగు మందుల వాడకాన్ని విచ్చలవిడిగా వాడుతున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి కావడం  ఆందోళనకరమైతే  2023- 24 సంవత్సరంలో భారత దేశవ్యాప్తంగా 64.84 మిలియన్ మెట్రిక్ టన్నుల  రసాయన ఎరువులను  పంట పొలాలలో కుమ్మరించినట్లు   తెలుస్తుంది.  జాతీయ సగటుకు రెట్టింపు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర  రాష్ట్రాలలో  ఎరువు లను   కుమ్మరించడం మించిపోయిన కారణంగా  ఆరోగ్య రక్షణ,ఆహార భద్రత, ప్రజాసంక్షేమం,  సంక్షోభంలో పడే ప్రమాదం లేకపోలేదు.
అధిక వినియోగానికి దారి తీసిన పరిస్థితులు :-
***----***---**
అధిక ఫలాన్ని  ఆశించి  పొలాలలో ఎరువులను  విపరీతంగా చల్లడంతో  పంట  చేలకు చీడపీడల  బెడద ఎక్కువై   క్రిమిసంహారక మందులు చల్లవలసి రావడంతో పెట్టుబడి తడిసి మోపెడుతున్నది. .రసాయన అవశేషాలు  ఆహారం ద్వారా శరీరంలోకి  పోయి క్యాన్సర్లు ఇతర భయంకరమైన అనారోగ్య సమస్యలకు ప్రజలు  బలి అవుతుంటే  ఆయా కుటుంబాల  ఖర్చు కూడా గణనీయంగా పెరిగిపోయింది. నత్రజని ఫాస్పరస్ పొటాషియం  ఎన్పీకే నిష్పత్తి 4:2:1కి  నించకూడదని నిబంధన ఉంటే   గత సంవత్సరం  10:3:7 గా నమోదు అయినట్లు  తెలుస్తున్నది. ఒక దశలో భారత దేశంలో పంజాబ్  తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో  రసాయ న ఎరువుల వాడకం ఎక్కువగా ఉందని దాన్ని తగ్గించాలని కేంద్రం సూచన చేసినప్పటికీ  పరిస్థితుల్లో మార్పు రాకపోవడం,  భూసార పరీక్షలను పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించడం  వల్ల నేలలు సారాన్ని కోల్పోయి  దిగుబడి తగ్గి  అన్ని రకాల నష్టానికి కారణం అవుతున్న  రసాయన ఎరువులు పురుగు మందుల వాడకాన్ని  నిర్బంధంగా తగ్గించి తీరాల్సిన అవసరం ఉంది.
          ప్రత్యామ్నాయ సేంద్రియ సాగు అనివార్యం:-
************
  సుమారు 50  సంవత్సరాలపైగా  దేశంలో  ఎరువుల వాడకంలో వచ్చిన మార్పుల కారణంగా  పండించిన పంటలు వరి గోధుమల్లో ఐరన్ జింక్ వంటి పోషక విలువలు  తగ్గి నామ మాత్రంగా మిగిలిపోయినాయి.  వరిలో ప్రమాదకరమైన ఆర్సినిక్  పెద్ద  మొత్తం లో పేరుకుపోవడం అనారోగ్యకరం.  వీటికి తోడు జీవనశైలి  తగినట్లు లేకపోవడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడక తప్పడం లేదు.  భూములు నిస్సారమై  పోషకాహారం అందక  జన భారతం  గగ్గోలు పెడుతున్నది. ఈ దుర్భర పరిస్థితుల నుండి భారతదేశాన్ని గట్టెక్కించాలంటే సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ వైపుగా కేంద్రం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించి  రాబోయే రెండు సంవత్సరాల లో  2,481 కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.  రైతులను అందుకు సమాయత్తం చేయడం, జనంలో చైతన్యం తీసుకురావడం,  విచ్చలవిడి ఎరువుల వాడకాన్ని చాలా అదుపు చేయడం  అవసరమైతే ఎరువుల వాడకం పైన వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల  సమాజం కూడా తన వంతు బాధ్యత పోషించాల్సిన అవసరం ఉంది. 7.5 లక్షల హెక్టార్లలో  సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని   చేపట్టి  కోటి మంది రైతులకు  కొత్త ఒరవడి చూపించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఈ నిర్ణయం అమలు కావాలంటే, ఆరోగ్యకరమైనటువంటి  పోషకాహారం ప్రజలకు అందించాలంటే,  అనేక రోగాల బారి నుండి ప్రజలను కాపాడాలంటే,  నూతన పరిస్థితులకు అనుగుణంగా  వ్యవసాయ విధానాలను మార్చవలసిన అవసరం చాలా ఉన్నది. కేవలం కేంద్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంటే సరిపోదు రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు  రైతుల సమాయత్తం చేసే కృషి  కీలకం.అదే దశలో  ఎరువులు పురుగుమందుల యొక్క తయారీ ఉత్పత్తుల కంపెనీలను  సగానికి సగం తగ్గించడం  తో పాటు భూసార పరీక్షలను ప్రతి ఏటా నిర్వహించడం ద్వారా  ప్రభుత్వాలే రైతులకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఉన్నది.  భూసార పరీక్షల  ఫలితాలను బట్టి  అవసరమైనటువంటి పోషకాలను ఆ భూమికి అందించడానికి కృషి జరగాలి ఆ వైపుగా పరిశోధనలు మరింత ముమ్మరం చేయాలి. విచ్చలవిడిగా తయారవుతున్నటువంటి చెత్త నుండి ఎరువులను తయారు చేయడం  వళ్ళ చెత్తకు ఒకరకంగా పరిష్కారాన్ని చూపడంతో పాటు  సేంద్రీయ ఎరువును అవసరమైన మేరకు ఉత్పత్తి చేసుకోవడానికి  అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో  సేంద్రియ ఎరువు సమీకరణ   వలన  రైతు పైన కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఇదంతా జరగాలంటే రైతులలో  ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, నమ్మకాన్ని కలిగించాలి, పంటల దిగుబడి కి  ఎలాంటి నష్టం లేదని భరోసాను ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు ఇవ్వగలగాలి,అవసరమైతే నష్టం జరిగిన సందర్భంలో తొలిదశలో నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం  బాధ్యతగా తీసుకోవాలి, క్రమంగా సేంద్రీయ ఎరుల వాడకం వైపు ఈ దేశంలో వ్యవసాయం మార్పు చెందితే  అనారోగ్య సమస్యలు క్రమంగా    వాటంతట అవే తగ్గుతాయి.
(  ఈ వ్యాసకర్త  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333