పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు అందించాలి
ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
బీసీ జేఏసీ కన్వీనర్ బద్రబోయిన సైదులు
సూర్యాపేట 09 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పీడిత, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన తెలంగాణ బంధువు పండుగ సాయన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బీసీ జేఏసీ కన్వీనర్ బద్రబోయిన సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పండుగ సాయన్న జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించి అణగారిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పండుగ సాయన్న జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.ఆనాడే పెత్తందారులను ఎదిరించి పేద, బడుగు బలహీన వర్గాలకు విముక్తి కల్పించేందుకు పండుగ సాయన్న పోరాటం చేశారని తెలిపారు. ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పించి, సామాజికంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన మహనీయుల చరిత్రను ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పండుగ సాయన్న వంటి మహనీయుల జీవిత చరిత్రలను అధికారికంగా నమోదు చేసి భావితరాలకు అందించాలని కోరారు.తక్షణమే ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల్లో పండుగ సాయన్న జీవిత చరిత్రను చేర్చి, ఆయన పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు, భావితరాలకు పరిచయం చేయాలని కోరారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆశయాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను రేపటి తరానికి అందించేందుకు బీసీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.