అంబేద్కర్ వక్కానిoచి నట్లు జాగరూకులైన ప్రజావళి ఎందుకు అవసరం?

Aug 8, 2026 - 16:36
Aug 8, 2026 - 16:42
 0  0

అంబేద్కర్ వక్కానిoచి నట్లు జాగరూకులైన ప్రజావళి ఎందుకు అవసరం? అంటే  ప్రశ్నించి ప్రతిఘటించే ప్రజలున్న చోట  అధికారం ప్రజల చేతిలో ఉంటుంది.

అచేతనంగా భయపడే వాళ్ళుంటే  రాజ్యం జనంపై స్వారీ చేస్తుంది కనుక 

--వడ్డేపల్లి మల్లేశం

"అడిగేవారికి చెప్పేవారు ఎప్పుడూ లోకువే" అనే  ఒక సామెత ఉంది. అంటే ప్రశ్నను ఎన్ని రకాలైన ప్రశ్నిస్తారని,  తికమక పెడతారని,  నేరాన్ని ఎదుటి వారి పైన మోపుతారని,  బదునాం చేయడానికి సిద్ధంగా ఉంటారని అర్థం .కానీ నేటి కాలంలో  ముఖ్యంగా ప్రజాస్వామిక దేశమైన భారత్లో  చట్టసభలలో ప్రశ్నించే ప్రతిపక్ష సభ్యులు  వేసే ప్రశ్నలకు  అధికారపక్షం నుంచి సరైన సమాధానాలు కాదు కదా  ప్రభుత్వానికి నచ్చకపోతే బలవంతంగా మార్షల్స్ ను పిలిపించి బయటికి నెట్టివేస్తారు .అంటే" ఇక్కడ అడిగేవాళ్లు  చెప్పే వాళ్లకు లోకువ అయినారు". అనేక ప్రజా ఉద్యమాలపై అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే  ప్రభుత్వ సంస్థల పనితీరుతో పాటు  పాలకుల శ్రద్ధ,  నిబద్ధత  ఎంత ముఖ్యమో  అంతే స్థాయిలో దేశంలోని ప్రజలు  ప్రజాస్వామ్య భావనను అర్థం చేసుకొని  తమ హక్కులను సాధించుకోవడానికి ప్రశ్నించే  ధోరణితో  చైతన్యవంతులై న ప్పుడు మాత్రమే  ప్రజాస్వామ్య ఫలాలు  జనానికి చేరువవుతాయని అర్థం.  ప్రపంచంలోనే  అతిపెద్ద రాజ్యాంగము కలిగి  ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచమంతా  గొంతెత్తి నినదీస్తున్నప్పటికీ  ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోగా రోజురోజుకు అధికమవుతూ  ఆశించిన సమానత్వం ఎండమావిగా మిగిలిపోతూ  అసమానతలు భారీగా పెరగడాన్ని  ప్రశ్నించకుండా ఉండలేము కదా?  ప్రజాప్రతినిధులు చట్టసభల్లో  ప్రశ్నిస్తున్న క్రమములో  ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వాళ్లు కొందరైతే  కీలకమైన అంశాలను పక్కనపెట్టి  తమ పార్టీ ప్రచారం, మెప్పుకోసం, పత్రికల్లో  కనబడాలనే ఉద్దేశంతో  మొక్కుబడి ప్రశ్నించే పార్టీలు మరికొన్ని ఉంటాయి. తాము అధికారంలో ఉన్న నాడు  ప్రజలను పట్టించుకోని ఒక రాజకీయ పార్టీ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం  ఇచ్చిన హామీల అమలు కోసం   రాద్ధాంతం చేసే  ప్రజాకర్షణ పథకాలను మాత్రమే డిమాండ్ చేసి అమలు చేయించుకోవడం కోసం  చట్ట సభలోను బయట చేస్తున్న గలభా గందరగోళం మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో  గత ప్రభుత్వ హయాములో వేల కోట్ల రూపాయలను  రైతుబంధు పేరుతో  రోడ్లకు,అడవులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు,  అపరిమితమైన భూమికి  ప్రజా నిధులను కట్టబెట్టి దుర్వినియోగం చేసిన సంగతి తెలుసు. కానీ ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  ఆ ప్రస్తావన చేయకుండా  ఇచ్చిన హామీలు ఏమైనాయని  తెరమీద కనబడుతూ  కీలకమైన అంశాలను ప్రశ్నించకపోవడంలోనే  రాజకీయ పార్టీల డొల్లతనం దాగి ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా  అధికారంలో కొనసాగిన నాడు  అంబేద్కర్ ఆశించిన విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని  ఆ కీలక రంగాలు రెండింటిని  విస్మరించకూడదని చేసిన హెచ్చరికను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. చైతన్యవంతమైన ప్రతిపక్షం అయితే  ప్రభుత్వాన్ని విద్య వైద్యం గూర్చి ప్రశ్నించాలి కానీ
అనవసరమైన  హామీలు వాగ్దానాలు ప్రచార కార్యక్రమాలను  ప్రస్తావించడంతోనే సరిపోతుంది. అంతెందుకు వీళ్ళ ఉద్యమాలకు ప్రజల ను  విశ్వాసంలోకి తీసుకోకపోవడం  పైగా ప్రజలను  హామీలు వాగ్దానాలకు అలవాటు చేయడంతో ప్రజల్లో చైతన్యం కూడా నీ రు గారి పోతున్నది. తమ మౌలికమైనటువంటి విద్యా వైద్యానికి దూరమై  కోట్లాది కుటుంబాలు తమ ఆదాయాన్ని   ఖర్చు చేయడం వల్ల దేశంలో పేదరికం మరీ పెరిగి  ఆత్మహత్యల పాలవుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు ఏ వైపు ప్రయాణం చేస్తున్నాయో  అవగతం అవుతుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా కీలకమైన విషయాలను తప్పించి  హామీలు వాగ్దానాలతో కాలం  గడిపి  ఉనికిని చాటుకొని  ప్రజాధనాన్ని దూర్వినియోగం చేస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నదే తప్ప  ప్రజాసేవలో  కాదు.  పైగా గత Brs సీఎం గారు గాని ప్రస్తుత కాంగ్రెస్ సీఎం గారు కానీ""  మేము ప్రజలకు సేవకులం,  ప్రజా సంపదకు కాపలాదారులం  మాత్రమే కానీ  పాలకులం కాదు"" అని అనేక సందర్భాల్లో  ప్రస్తావించిన విషయం  ఏ మేరకు అమలవుతుందో ప్రజలు ఆలోచించాలి. " సంపద సృష్టిస్తాం సంపదను ప్రజలకు పంచుతాం"  అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   నినదిస్తుంటే  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  " మా పోటీ ఏ రాష్ట్రంతో కాదని ప్రపంచంతోనే పోటీ అని " ప్రకటించడం బాగానే ఉంది కానీ  పంచడానికి సంపద లేనప్పుడు  ప్రజలను ఎలా పరిపాలిస్తారు అనేదే చిక్కుముడి.  ఈ కోణంలోనే పాత బకాయిల కోసం విద్యార్థులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు,  సర్పంచులు,  కార్మికులు, విభిన్న రంగాల వారు తమ తమ హక్కుల కోసం చేస్తున్న ఉద్యమాలు  పోలీసుల అరెస్టులు  మనందరికీ తెలుసు.
       అంబేద్కర్ మా టలోని అర్థమేంటి ?
**********
అవును ప్రజలు చైతన్యవంతులై  పో రుబాటకు సిద్ధపడి  తమ హక్కుల కోసం ప్రతిఘటించి ప్రశ్నించే సందర్భంలో  పాలకులు కచ్చితంగా ఆలోచిస్తారు  అయితే అరెస్టు చేసి  ఇబ్బందులకు గురిచేస్తారు కావచ్చు కానీ  అంతిమ విజయం ప్రజలది అని అంగీకరించి తీరాలి. అంటే ఆ చైతన్యo ఉన్న ప్రజలే  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని అర్థం. విద్యా  ఉద్యోగం, హోదా, ఆస్తిపాస్తులు  ఉంటేనేమి చైతన్యం లేని  ఈ వర్గాలతో సమాజానికి ఒరిగేది ఏమీ లేదు తమ స్వార్థం తప్ప.  అదే కార్మికులు  రైతులు చేతివృత్తుల వాళ్ళు చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు  అసంఘటిత రంగంలోని కార్మికులు ఉద్యోగులు  కొంత ప్రజాహితాన్ని ఆలోచించి తమ హక్కులను సాధించుకునే క్రమంలో ఏకమై  ప్రభుత్వాలను వణికిస్తున్న తీరు,  చర్చలకు దిగి వచ్చేలా ఒప్పించడం,  హామీలు పొందడం, కొన్ని అమలు చేయించుకోవడం మనకు తెలిసిందే.  ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరున విద్యార్థులు, యువత  ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన పోరాటం  ప్రదర్శన  దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను  ప్రశ్నిస్తూనే అందుకు బాధ్యుడైన కేంద్ర విద్యా మంత్రిని  తొలగించాలని చేసిన డిమాండ్  అనేక రాజకీయ పార్టీల మద్దతు వలన  ఆ ఉద్యమం విజయవంతమై  కేంద్రం దిగివచ్చి  మంత్రిని రాజీనామా చేయించక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో  పాలకులు  తమ స్థాయిని విడిచి  రాజీ పడతారు, డిమాండ్ లను అంగీకరిస్తారు,   ప్రశ్నించే తత్వాన్ని  చైతన్య స్థాయిని  పాలకులు కూడా అంగీకరిస్తారని  విశ్వసించాలి. అదే కొన్ని సందర్భాలలో విద్యావంతులు మేధావులు బుద్ధి జీవులు  మానవ పౌర హక్కుల నాయకులను సైతం  వారి చైతన్యాన్ని మేధస్సును కూడా మరిచి  నిర్బంధాలకు గురి చేస్తూహింసను  ప్రోత్సహిస్తారు.  చైతన్యం నిరంతరం విజయవంతం కాకపోయినా  మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని,  భరోసాను నింపుతుంది ఆ పునాది మీద జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
        ఇదే సందర్భంలో అంబేద్కర్  "పాలకులు అంత సులభంగా  విద్యా వైద్యం  నాణ్యంగా ఉచితంగా ప్రజలకు అందించరు  ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి  విద్యతో చైతన్యవంతులైతే  ప్రజలను ప్రశ్నిస్తారు" అని  పాలకవర్గ స్వభావాన్ని ఆనాడే బట్ట బయలు చేయడం జరిగింది.  విద్యావంతులు  అంతా చైతన్యవంతులు కారు-  నిరక్షరాస్యులు,  పేదవాళ్లు, అమాయకులు అంతా చేతనులు కారు. వాళ్ల వాళ్ల సామాజిక స్థాయి, బాధ్యత, హోదా,  సామాజిక చింతనను బట్టి  ప్రజల్లో చైతన్యం ఆధారపడి ఉంటుంది. .చైతన్యము నీరుగారిపోయి  అమాయకత్వం  ముసుగులో  పేదరికం వెక్కిరింతలో  తమ మను గడ ప్రశ్నార్ధకమైనప్పుడు  ప్రభుత్వాలను ప్రశ్నించే  ఆలోచన మరిచి తమ జీవితాలు ఇంతే  అని సర్దుకు పోతారు  కుళ్ళి కుళ్ళి ఏడ్చి కుంచిoచుకు పోతారు.  ఈ పరిస్థితి ప్రజాస్వామ్య విజయానికి పెను ప్రమాదం  పాలకుల మనుగడకు ఎంతో ఉపయోగం. అందుకే అక్షరాస్యత  సామాజిక చైతన్యం  సామాజిక బాధ్యతల పునాదిగా ప్రజలందరినీ  చదువుకు అతీతంగా చైతన్యవంతులను చేయడం ఒక్కటే  ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అసమానతలు, అంతరాలు, పేదరికము నిరుద్యోగము,ఆకలి చావులు ఆత్మహత్యలు,  వివక్షత అకృత్యాలు, అత్యాచారాలు,  సామాజిక దురాచారాలు, అవినీతి,బంధుప్రీతి  భూకబ్జాలు,  అక్రమ ధనదాహం వంటి  సామాజిక రుగ్మతలను  తరిమి కొట్టడానికి   నిర్లక్ష్యం చేస్తున్న పాలకులను  బాధ్యుల చేసే క్రమంలో  ప్రజా చైతన్యం ఎంతో ఉపయోగపడుతుంది.  ప్రజలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు  కార్మిక ఉద్యోగ సంఘాలు  కూడా తమ సామాజిక బాధ్యతగా ప్రజల సమస్యలను  ప్రస్తావించకుండా  ఏ ప్రజా పోరాటం విజయవంతం కాదు  ప్రజలు  అచేతను లేనప్పుడు  నిరంకుశత్వం నియంతృత్వం  పాలనలో ప్రస్ఫుటంగా కనబడుతుంది  ఆ క్రమంలోనే  ప్రభుత్వాలు ప్రజల పైన స్వా రీ చేస్తాయి.  ఆ సందర్భంలో ""మేము ప్రజలకు సేవకులం"" అనే మాట మరిచిపోతారు కూడా.  పాలకులకు ఎల్లప్పుడూ  జ్ఞాపకం ఉండాలంటే   ప్రజా ఉద్యమాలు  పోరాటాలె శరణ్యం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333