ఉపాధ్యాయురాలుగా మారిన గ్రామ సర్పంచ్
నాడు బడి బాట..నేడు ఉపాధ్యాయులుగా మారిన గ్రామ సర్పంచ్ రోజా లక్ష్మణ్ నాయక్
మర్రికుంట తండా పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు
తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని మర్రికుంట తండా గ్రామపంచాయతీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడకూడదనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్ నాయక్ తానే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు.
వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కేవలం ఒకటి లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటంతో, విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో పాఠశాలను రద్దు (క్లోజ్) చేస్తామని మండల విద్యాశాఖ అధికారి సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. అయితే విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని, తండాలోని పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయనివ్వనని సర్పంచ్ బానోతు రోజా లక్ష్మణ్ నాయక్ ఎంఈఓకు విజ్ఞప్తి చేశారు. బడిబాట కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె గ్రామస్తులతో ప్రత్యేకంగా మాట్లాడి, గ్రామసభను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరిస్తూ స్వయంగా తన కుమారుడితో పాటు గ్రామానికి చెందిన 20 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించి బడిని పునరుద్ధరించారు.
కానీ, ప్రస్తుతం ఈ పాఠశాలలో కేవలం ఒక్కరే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు కూడా తరచూ సెలవులు పెట్టడం, మీటింగ్‌ల పేరుతో పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధ్యాయుడు లేక పిల్లలు ఖాళీగా కూర్చోవడం గమనించిన సర్పంచ్ రోజా లక్ష్మణ్ నాయక్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల పిల్లల చదువు పాడవకూడదని భావించిన ఆమె, ఈరోజు తానే స్వయంగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు నేర్పించారు. పిల్లలతో కలిసిపోయి వారికి నచ్చిన రీతిలో విద్యాబోధన చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పిల్లలను బడిలో చేర్పిస్తే, ఉపాధ్యాయుల కొరత మరియు ఉన్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యావ్యవస్థ దెబ్బతింటోందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మర్రికుంట తండా పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని, పిల్లలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సర్పంచ్ తీసుకున్న ఈ చొరవను, పిల్లల పట్ల ఆమె చూపిన బాధ్యతను తండా ప్రజలతో పాటు మండల వాసులు కూడా అభినందిస్తు.. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు, జిల్లా విద్య శాఖ అధికారులకు మా గ్రామపంచాయతీలో పాఠశాలలో ఉన్న పిల్లలకు, మాకు న్యాయం చేయాలని కోరారు.