సాయిబాబా  జైల్లో బాధలు అనుభవించినా  అది శిక్ష కాదు పోరాటమే

Sep 13, 2024 - 08:55
 0  1

Prof జి.ఎన్. సాయిబాబా  జైల్లో బాధలు అనుభవించినా  అది శిక్ష కాదు

పోరాటమే  నేరం రుజువు కాకుండానే   విచారణ ఖైదీగా  9 ఏళ్లు గడిపిన  నికృష్ట జీవితం.

నిర్దోషి అని   సర్వోన్నత న్యాయస్థానం  తీర్పు ఇస్తే  జైలు ఊచలు లెక్కబెట్టిన కాలానికి  ఎవరికి శిక్ష వేయాలి ?

 చైతన్యం చేయడమే సాయిబాబా గారి నేరమా?

--  వడ్డేపల్లి మల్లేశం

అనివార్య పరిస్థితులలో చట్టం నుండి  నేరస్తులు తప్పించుకున్నా  ఒక్క నిరప రాధికీ  కూడా శిక్ష  పడకూడదు అనేది భారతీయ న్యాయ శాస్త్ర  నినాదం జీవన విధానం.
కానీ భారతదేశంలో ఇప్పటివరకు  నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వాళ్లు, శిక్షకు అర్హులైన వాళ్ళు కూడా  శిక్ష అనుభవించకుండా చట్టసభలలో ఊరేగుతున్నారు అంటే  న్యాయ వ్యవస్థఎంత బలహీనంగా ఉన్నదో నేరస్తులు ఎంత బలవంతులో ఈ దేశంలో అర్థమవుతుంది.  కొంతమంది అభిప్రాయం ప్రకారంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ  న్యాయానికి అనుకూలంగా పోరాటం చేసి  ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుకూలంగా ప్రజాస్వామిక దృక్పథానికి  మద్దతుగా తీర్పు ఇచ్చినటువంటి అనేకమంది న్యాయమూర్తులను కూడా  నేర సామ్రాజ్యం అంతం చేసిన సందర్భాలు అనేకం అని  తెలుస్తున్నది. అంటే  నిజమైన నేరగాళ్లు తప్పించుకోవడానికి ఇదొక ప్రామాణికంగా భావించవచ్చునేమో  ?ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా  ఖైదీలు  జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే  అందులో ఐదున్నర లక్షలు  కేవలం విచారణ ఖైదీలు గా అనేక సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని మనం  గుర్తించవలసిన అవసరం ఉన్నది .అంటే నేరం రుజువు చేయకుండానే  న్యాయస్థానాలు శిక్షను  ప్రకటించకుండానే  ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ యొక్క వైఫల్యం కారణంగా  విచారణ ఖైదీలుగా దశాబ్దాల పాటు నికృష్ట జీవితాన్ని అనుభవిస్తూ ఊచలు లెక్కబెడుతూ  అనారోగ్యం పాలవుతున్నటువంటి బుద్ధి జీవులు మేధావులు, కార్మికులు పేద వర్గాలు  రాజ్యం  కొనసాగిస్తున్న ఈ హింసను  అమానవీయ సంస్కృతిని  ఇంకెంతకాలం అనుభవించాలి? అందుకే జైల్లో కూడా పోరాటాలు అక్కడక్కడ ఉధృతం అవుతున్నాయి  తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు సరైన వైద్యం, పుస్తకాలు , సౌకర్యాలు,  ఆరోగ్యకరమైన భోజనంతోపాటు కుటుంబ సభ్యులను తీరికగా కలుసుకొని  బాధలు చెప్పుకోవడానికి వెసులుబాటును కూడా డిమాండ్ చేయడం ఇటీవల కాలంలో  ఖైదీల యొక్క  పోరాటపటమకు నిదర్శనం గా భావించాలి. ఈ రకమైనటువంటి పోరాటాలు   పాలకులను పోలీసు వ్యవస్థను  తప్పు పడుతూ ఉంటే చివరికి న్యాయవ్యవస్థ కూడా ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితులకు దారితీస్తున్నది . న్యాయస్థానం ఎక్కడ కూడా నేరస్తులు అని ప్రకటించలేదు,  విచారణ  కొనసాగిన సందర్భాలు అంతకు లేవు, కేవలం పోలీసు వ్యవస్థ  ఎఫ్ఐఆర్ నమోదు చేసి  న్యాయస్థానానికి  దాఖలు పరిచిన సందర్భంలో  విచారణ కోసం  ఆదేశించడంతో జైల్లో శిక్ష అనుభవించడం ప్రారంభిస్తే  దశాబ్దాల తర్వాత ఒకవేళ న్యాయస్థానమే నిర్దోషి అని ప్రకటించిననాడు మాత్రమే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోగా పడరాన్ని పాట్లు నరకానికి ప్రతీకగా జైలు అని అనేకమంది అనుభవాల ద్వారా తెలుస్తున్న ది. ఆ రకంగానే  చేయని నేరానికి  విచారణ కొనసాగించకుండా దశాబ్దాల పాటుజాప్యం చేస్తూ  నేరం రుజువు కాకపోయినా శిక్ష అనుభవించడం  ఏ రకంగా సమంజసమో న్యాయవ్యవస్థ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది . ఎందుకంటే భారతదేశంలో  లక్షలాదిమంది ఈ రకంగానే శిక్ష అనుభవిస్తూ నేరము రుజువు కాకుండానే న్యాయస్థానం తీర్పు ఇవ్వకుండానే అర్ధాంతరంగానే అసువులు బాసిన వాళ్లు కూడా ఎందరో! ఇదేనా భారత దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి  .ఈ రకంగానే  చేయని నేరానికి రుజువు కానీ  ఫిర్యాదుకు  విచారణ ఖైదీగా  నరకాన్ని అనుభవించినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చివరికి నిర్దోషి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన తర్వాత  విడుదలైన విషయం ఇటీవలి కాలంలో మనందరికీ తెలుసు  .ఇలాంటి సంఘటనలు అనేకం కానీ  దృష్టికి రాకపోవడంతో  నా అనే వాళ్ళు లేకపోవడంతో  మరెంత మంది ఈ రకంగా జైల్లో మగ్గూ తున్నారో  పరిశీలించవలసిన అవసరం న్యాయస్థానాల పైన ఎక్కువగా ఉన్నది .
         ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా  జైలు జీవితం-  నిర్దోషిగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటన-  విడుదలైన తర్వాత  వెలిబుచ్చిన అభిప్రాయం  :-
*************
  గత లోక్సభలో సుమారు 85%  చట్టసభల సభ్యులు నేరచరిత్ర ఉన్నవాళ్లేనని  ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తే  రాజ్యసభలోని సభ్యులలో కూడా 36 శాతం మంది నేరం  చేసి  రుజువైన తమ ఆధిపత్యం పలుకుబడితో  తప్పించుకొని చట్టసభల్లో  విలాస జీవితం గడపడాన్ని గమనిస్తే  నేరం చేసిన వాళ్ళు ఆధిపత్యం చాలా ఇస్తుంటే  ప్రజల గూర్చి ఆలోచించినటువంటి వాళ్ళు  నేరస్తులు కాకపోయినా  జైలు ఊచలు లెక్కబెట్టడాన్ని  ఏమందాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా  గత కొన్నిళ్ళుగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ  ఆదివాసీలను విద్యార్థులను ప్రజలను చైతన్యం చేసేటువంటి  ప్రవృత్తిని ఎంచుకొని  ఆదివాసీల హక్కుల కోసం ప్రజల చైతన్యం కోసం  రాజ్యాంగబద్ధమైన ఫలాలను అనుభవించడానికి ప్రజలకు ఉన్నటువంటి అవకాశాలను విప్పి చెప్పడం  బాధ్యతగా తీసుకున్న  90 శాతం అంగవైకల్యం ఉన్నటువంటి  అధ్యాపకుడు.
  ఇతరుల సహాయం లేకుండా తన పనులు ఏవి చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ  ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం రాజ్య హింసను కూడా ప్రతిఘటించే సందర్భంలో  పాలకులు  కన్ను వేసి అనేక ఆరోపణలు చేసి  దశాబ్దం క్రితం అరెస్టు చేసి  నాగపూర్ లోని అత్యంత హీనమైన స్థితిలో ఉన్న  అండా సెల్లో నిర్బంధించడం  పాలకుల యొక్క హేయమైన చర్య  .విచారణ ఖైదీలుగా ఉన్న ఈ దేశంలోని 5:30 లక్షల మందిలో ఒక ఖైదీగా ఉన్నటువంటి సాయిబాబా గారు  ఆదివాసీలను చైతన్యపరుస్తున్నాడని మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని  అభ్యుదయ భావజాలంతో రెచ్చగొట్టే  అసాధారణ తత్వాన్ని సహించలేనటువంటి పాలకులు ఉగ్రవాదిగా భావించి అరెస్టు చేయడం  అందరికీ తెలిసిందే.  ఒక వ్యక్తి నేరస్తుడని భావించినప్పుడు  చట్ట పరిధిలో న్యాయస్థానం నేరము రుజువు చేసిన తర్వాత మాత్రమే శిక్షను  ప్రకటించాలి అమలు చేయాలి కానీ దానికి భిన్నంగా   నేరం రుజువు కాకుండానే విచారణ పేరుతో ప్రభుత్వం దశాబ్దాల తరబడిగా కాలయాపన చేస్తూ హింసిస్తున్న  వరుసలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కూడా  ఉండడం , 9 సంవత్సరాల పైగా  నరకయాతన అనుభవించిన విషయాన్ని,  నిర్దోషిగా ఇటీవల విడుదలైన తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో చెప్పిన సారాంశాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే గుండె  చెరువు కాక మానదు .
     విడుదలైన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఇలాంటి వైద్య సౌకర్యాన్ని కల్పించకపోవడం, సరైన మందులను అందుబాటులో ఉంచకపోవడం,  90 శాతం అంగవైకల్యంతో తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ఇతరుల సహకారాన్ని నిరాకరించడం వంటి  చర్యలకు జైలు అధికారులు పాల్పడిన సందర్భంలో  అనుభవించిన బాధను  కన్నీటితో కడిగిన తీరు  వర్ణనాతీతం.  నేరం లేకున్నా శిక్షించిన తన జీవితానికి  విముక్తి కలిగించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రజాసంఘాలు హక్కుల సంఘాలు మానవ హక్కుల  వేదికల ఎంత కృషి చేసినాయో అంతే స్థాయిలో తన భార్య వసంత కూడా కృషి చేసినట్టు దేశవ్యాప్తంగా పర్యటించి అనేక రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాల వారిని కలిసి  పోరాటం చేసినట్టు  తన ఇంటర్వ్యూలో చెప్పడం తన ఆత్మస్థైర్యాన్ని  ప్రదర్శించడమే అవుతుంది.  తన భార్య వసంత  చూడడానికి వచ్చినప్పుడు సమయం ఇవ్వకపోవడం కేవలం 15 నిమిషాల సమయంలో మాట్లాడడానికి మాటలు రానటువంటి ఉద్విగ్నబ రిత క్షణంలో  జైలు అధికారులకు  పోలీసులకు తెలిసిన భాషలోనే మాట్లాడుకోవాలని నిర్బంధించడం,  మాట్లాడుకునే మాటలను వినడం రికార్డు చేయడం వంటి అనేక  దుష్ట చర్యలకు ఆలవాలమైన  చెరసాల జీవితాన్ని తలచుకొని  శిక్ష పడకపోయినా నేరస్తున్నీ కాకపోయినా శిక్ష అనుభవించడం అనేది ఆ మానవీయ సంఘటనని ఏడ్చి కన్నీళ్లు పెట్టిన తీరు అందరిని కరి గించక మానదు . అయినప్పటికీ తన భార్య తన వెంట తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ భర్తకు ఇచ్చేదాకా  వెళ్లే ప్రసక్తి  లేదని,  మాట్లాడుకున్న తర్వాత మాత్రమే వెళ్తానని కచ్చితంగా జైలు అధికారులకు చెప్పి ఆత్మ  ఆత్మ గౌరవాన్ని   ప్రదర్శించిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేయడం  దుఃఖంలో కూడా పోరాటాన్ని,  వాస్తవాన్ని, నిజ జీవితాన్ని  అంగీకరించడమే అవుతుంది కదా ! అరకొ ర విచారణ జరిగిన సందర్భాల్లో మహారాష్ట్ర హైకోర్టు  క్షున్నమైన విచారణ చేయకుండా  ఆరోపణల ఆధారంగా నేరస్తుడని  ప్రకటించడంతో  ఆయన విడుదలకు  చాలా జాప్యం జరిగింది.  ఇటీవల పూర్తి విచారణ జరిపిన అనంతరం భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో సాయిబాబా గారు నిర్దోషి, ఆయనకు ఎలాంటి సంబంధాలు మావోయిస్టులతో లేవని,  ఉగ్రవాది కాదని  రెచ్చగొట్టే ప్రకటనలు ఏమీ చేయలేదని తేల్చి చెప్పడంతో  జైలు నుండి విముక్తి జరిగినప్పటికీ  ఆయన శరీరానికి మనసుకు  తగిలిన గాయం  మానేదెలా?  ఒక ప్రొఫెసర్ గా, విద్యావంతునిగా, మేధావిగా ఉన్నటువంటి  ఇలాంటి అసామాన్యులకే ఇంత శిక్ష అనుభవించవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు  ఇక ఆదివాసీలు, పేదలు , అక్షరాస్యత నాగరికతకు దూరంగా నివసిస్తున్నటువంటి లక్షలాదిమంది  పరిస్థితి ఏమిటి అని ఆలోచించినప్పుడు  అంధకారమే కనిపిస్తుంది  .  జైలుకు  వేల సంఖ్యలో ఆదివాసీలు  పేదరికంలో మగ్గుతూ  ఇలాంటి చైతన్యం లేని వాళ్ళు కూడా  రావలసి వస్తుందని వాళ్లను   చిన్నా చితక ఆరోపణల పైన  అరెస్టు చేసి ఏళ్ల తరబడి శిక్షిస్తున్నారని, వారికి కనీసం న్యాయస్థానం ఉంటుందని,  న్యాయవాదిని పెట్టుకోవాలని,  త మ వైఖరిని వినిపించాలంటే వకీలు అవసరమనే పరిజ్ఞానం కూడా వాళ్లకు తెలవదని అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏళ్ల తరబడిగా జైల్లోనే మగ్గుతున్నారని తను ప్రత్యక్షంగా చూసిన విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించడంతో  దేశంలో  న్యాయం ఎంత అభాసు పాలవుతుందో అర్థం చేసుకోవచ్చు . అయినా విడుదలైన తర్వాత కూడా తాను మౌనంగా ఉండదల్చుకోలేదని, తాను అనుభవించిన శిక్షకు  ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ తగిన సమాధానం చెప్పాలని, తాను బ్రతికినంత కాలం  సామాజిక  మార్పుకు సమ సమాజ నిర్మాణానికి  అసమానతులను అంతం చేసే క్రమంలో  పోరాడుతున్నటువంటి వారిని  లేకుండా చేసే రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడుతానని , రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పడం గమనార్హం ! ఎప్పుడైతే ఆరోపణలతో  అరెస్టు చేయబడ్డాడో అప్పుడే తన   ఉద్యోగం నుండి యూనివర్సిటీ  తొలగించినట్లు  తెలుస్తుంటే ఆదాయం లేక  దుర్భర జీవితాన్ని గడిపిన సుమారు 9 ఏండ్ల  మాయని గుర్తులను  ప్రస్తావిస్తూనే  వ్యవస్థలోని అనేక వర్గాలు పడుతున్న బాధలను ఆకలింపు చేసుకొని ప్రస్తావిస్తూ  అందుకు బాధ్యత రాజ్యం వహించాలని,  ప్రజల పోరాటాలు కొనసాగాలని,  బుద్ధి జీవులు మేధావులుగా మన బాధ్యతను నిర్వహించాలని చేసిన సూచన  ఆయన సామాజిక అవగాహనకు  సామాజిక బాధ్యతకు నిదర్శనం. అలాంటి  ప్రవృత్తిని బుద్ధి జీవులు మేధావులు ప్రజాస్వామ్య వాదులు అలవర్చుకున్నప్పుడు మాత్రమే  ప్రశ్నించడం సాధ్యమవుతుంది, ప్రశ్నించినప్పుడు పాలకులు తలవంచక తప్పదు,  అధికారాన్ని అడ్డుపెట్టుకుని  హింసించే సందర్భం లేకపోలేదు .  అంగవైకల్యంతో అనుభవించిన శిక్షను జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తానని ప్రకటించినటువంటి సాయిబాబాను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది . విచారణ ఖైదీలుగా ఉన్న వారిని  వేగంగా విచారించి తాడోపేడో తేల్చాలని,   చట్టసభల్లో నేర చరిత్ర  జైలు శిక్ష పడిన వాళ్లు కూడా తమ పలుకుబడితో తప్పించుకొని  అధికారం అనుభవిస్తున్న వాళ్లకు,    కోట్లాది ప్రజాధనాన్ని కొల్లగొట్టి  ప్రభుత్వం మద్దతుతో ఊరేగుతున్న వాళ్లకు  శిక్ష పడాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం వుంది.  ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ సాయిబాబా గారి యొక్క  జీవన విధానము, పోరాటము, జైలు శిక్ష , నిర్దోషిగా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటన,  విడుదలైన తర్వాత తన అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణను అధ్యయనం చేయడం ద్వారా  మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించుకోవడం కోసం కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ   రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)   యి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333