దోపిడీ వ్యవస్థను కూలదోచినామంటే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే కదా!
తరువాయి తొందర పెట్టడం లేదు కానీ గమ్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపుగా గమనం సాగించాలనేదే ప్రజల ఆకాంక్ష.
పెట్టుబడి దారి, గడీల పాలనను వ్యతిరేకించినా మంటేనే "ప్రజాపాలనే మా హక్కు
అని ప్రజలు నినదించినట్లు కదా!
గత పాలకులు ఇప్పటికైనా ఆత్మపరిశీ లన చేసుకుంటే మంచిది....
భూస్వామ్య పెట్టుబడిదారీ సమాజాల తర్వాత కార్మిక వర్గ దృక్పథం కలిగిన ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సమసమాజ స్థాపన జరగాలని జరుగుతుందని కమ్యూనిజం ఆశించిన విషయం మనందరికీ తెలుసు . ఆ వరుస క్రమంలో ప్రజా ఉద్యమాలు పాలకుల యొక్క వైఫల్యాలు ఓటమి కొనసాగినప్పుడే ఈ విప్లవాత్మక మార్పులకు అవకాశం లభిస్తుంది. మధ్యలో పెట్టుబడిదారీ సమాజం బలాన్ని పుంజుకున్నా,
ఉద్యమకారుల శక్తి సన్నగిల్లినా, ప్రజా ఉద్యమాలు లక్ష్యాన్ని సిద్ధాంతాన్ని ఆచరణను కోల్పోయినా తిరిగి పెట్టుబడి దారి నియంతృత్వ ప్రభుత్వాలు అధికారానికి వచ్చిన సందర్భాలను మనం గమనించవచ్చు . కనుక ఈ అనుభవంతో నైనా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా దోపిడీ వ్యవస్థను కొనసాగించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, విద్య వైద్య రంగాలతో పాటు సర్వ రంగాలను ప్రైవేటీకరణ వైపు కొనసాగించి, యువతను పక్కదారి పట్టించే నిర్వీర్యం చేసి క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యం ధూమపానం మత్తులో రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకువెళ్లిన గత పాలకులపై కటినవైఖరి అవలంభించాల్సివుంది.
మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ గా మారి విద్యా రంగానికి ఉమ్మడి రాష్ట్రంలో 17% గా ఉన్నటువంటి బడ్జెట్ 2014 తెలంగాణ ఆవిర్భావ సమయంలో 11 శాతం ఉంటే గత సంవత్సర బడ్జెట్లో 6.5 శాతానికి దిగజార్చినది తెలంగాణ సెంటిమెంటు పేరుతో బంగారు తెలంగాణ భ్రమలలో రాష్ట్రాన్ని పాలించిన బారాస ప్రభుత్వం కాదా? ప్రభుత్వ రంగంలోకి తీసుకురావలసిన బదులు ఉన్నత విద్యను 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రారంభించి పేదలకు దూరం చేసిన చరిత్ర బారాసాది కాదా ?మరో 7 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి క్యాబినెట్ ఆమోదం పొంది రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది అంటే నాటి పాలన ఎవరి కోసమో అర్థం చేసుకోవచ్చు. ఖా యిలా పడిన పరిశ్రమలను ఒక్కటి తిరిగి ప్రారంభించకపోగా ప్రైవేట్ రంగంపైనే దృష్టి సారించి ప్రపంచంలోని అనేక కంపెనీలను ఆహ్వానించి సుమారు 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించినామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని విస్మరించడం ప్రభుత్వ రంగంలోని లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయక యువతను మోసగించడం మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్లుగా యువజన విధానం అంటూ లేదు . గృహ సౌకర్యం లేని లక్షలాది ప్రజానీకానికి మేడిపండు వార్త లాగా సెలవిచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కలగానే మిగిలిపోగా, దళితులకు మూడెకరాల భూమిని అమలు చేయకపోగా , ఎవరు కోరకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ సమాధానాన్ని దశాబ్దం కాలంగా దాటవేసి తీరని ద్రోహం చేసిన విషయం నిజం కాదా ! పండించని భూములకు ఇళ్ల స్థలాలకు గుట్టలకు భూస్వామ్య వర్గాలకు రైతుబంధు పేరుతో కోట్లాది డబ్బును కట్టబెట్టి గత ఆరు సంవత్సరాల లో సుమారు 30 వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టినట్లు ప్రభుత్వ గణాంకాలు మేధావులు హెచ్చరిస్తుంటే బంగారు తెలంగాణ అని భ్రమలలో ముంచి నేడు ప్రతిపక్ష పాత్రలో ఉండి కూడా పాలకులను బెదిరించడం అంటే ఎంత అహంకారం ? అంతకుమించిన వైఫల్యం ముసుగులో కొనసాగే దౌర్జన్యం కాదా ?
అధికార దుర్వినియోగం, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మంత్రులంతా నెలల తరబడిగా పరిపాలనను విస్మరించి పార్టీ కోసం పని చేయడం, అంతకుమించి చేయని పనికి వేతనాన్ని పొందడం, అధికార యంత్రాంగం కూడా బారాస ప్రభుత్వానికి వత్తాసు పలికినటువంటి నిరంకుశ ప్రభుత్వానికి గత పాలన ఆనవాలు. ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరసన వేదికగా ఇందిరా చౌక్ ను ఏర్పాటు చేస్తే తెలంగాణ ఆకాంక్షలని గర్వంగా చెప్పుకున్న బారాస అధికారానికి రాగానే ధర్నా చౌక్ ను మూసివేసి పోరాట శక్తికి సంకెళ్లు వేసి ప్రజాసామిక విలువలను తుంగలో తొక్కి మాట్లాడితే ప్రశ్నిస్తే సభలు సమావేశాలు పెట్టుకుంటే అణచివేత నిర్బంధము కొనసాగించినది వాస్తవం కాథా? ఇక ఏ రంగంలో బారాస ప్రభుత్వం ప్రజల కోణంలో ప్రజల కోసం పని చేసిందని ,ప్రజల హక్కులను కాపాడిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది? అందుకే ఈ విద్రోహ, దోపిడీ వ్యవస్థను 2023 నవ0బర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కులదోసినారు, ప్రత్యామ్నాయ వ్యవస్థగా మేధావులు ప్రజా/ సంఘాల పోరుబాటకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బారాస పార్టీ శాసనసభ్యులు ఓటమిని జీర్ణించుకోలేక దుష్టపన్నాగాలకు అన్ పార్లమెంటరీ పదజాలాన్ని వాడుతూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్రకు తెరథీ సిన విషయం నిజం కాదా ?
కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి ?
స్థిరమైన ప్రజా పరిపాలన రాష్ట్రంలో కొనసాగాలన్న, ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు గుర్తింపు ఇవ్వాలన్న , విస్మరించబడిన తెలంగాణ ఆకాంక్షలను నిజం చేసుకోవాలన్న గతంలో కొనసాగిన దోపిడీ పాలనకు భిన్నమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఆవిష్కృతం కావాలి. దోపిడీ ప్రభుత్వం పెంచుకున్న వేతనాలను వెంటనే ప్రస్తుత ప్రభుత్వం సగానికి పైగా తగ్గించాలి. రైతుబంధు పేరుతో వందలాది ఎకరాలకు కట్టబెట్టిన గత సొమ్మును వసూలు చేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే పరిమితం చేస్తే కోట్లాది రూపాయలను పొదుపు చేయవచ్చు ఇతర రంగాలపై ఖర్చు చేయవచ్చు .ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో విద్యారంగానికి 7.8% కేటాయించినట్లు తెలుస్తున్నది రాబోయే బడ్జెట్లో 15 శాతానికి పైగా ఈ నిధులను పెంచి రాబోయే5,10 ఏళ్ల పాటు ఇదే విధానాన్ని కొనసాగించాలి. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలను క్రమంగా పరిమితం చేస్తూ అల్పాదాయ వర్గాలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా లోటును భర్తీ చేసుకోవచ్చు, నిజమైనటువంటి పేదలకు న్యాయాన్ని చేకూర్చవచ్చు .పేదల యొక్క కనీస అవసరాలను తీర్చడం ద్వారా మానవాభివృద్ధిని సాధించాలి, దారిద్ర రేఖ దిగువన గల లక్షలాది కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ ఇతర అవకాశాలను కల్పించడం ద్వారా పేదరికాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం జరగాలి. విద్యా వైద్యం రెండు రంగాలను ప్రభుత్వం సవాలుగా తీసుకొని పదేళ్ల ప్రణాళికలో పూర్తి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని పేదలకు నాణ్యమైన ఉచిత విద్యా వైద్యం అందించగలగాలి .పెట్టుబడిదారీ గడీల పాలనను వ్యతిరేకించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన జరగాలి . సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు దామాషా ప్రకారంగా అధికార యంత్రాంగంలోనూ చట్టసభల్లోనూ అవకాశాలు కల్పించి వినూత్న పాలనకు శ్రీకారం చుట్టాలి . రాష్ట్రంలోని ప్రజల పరిస్థితుల పైన సమగ్రమైన సర్వే జరిపించి పేదరిక0, వెనుకబాడుతనం నిర్మూలన కోసం తగిన ప్రణాళికలు రూపొందించాలి .భూస్వామ్య వ్యవస్థను కూలదోసి భూమిలేని వారికి మిగులు భూములను పంపిణీ చేయాలి. పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్వీర్యపరిచే క్రమంలో కార్మిక కర్షక వర్గ దృక్పథాన్ని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలి. ఉచితాల వైపు నుండి ప్రజలను శాసించే స్థాయికి తీసుకురావాలి. ప్రాజెక్టులు భవనాలు నిర్మాణాలు రోడ్లు ఇతర అన్ని రకాల పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణంగా పనులు జరగాలి. వాటికి పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థలదే నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యత లోపిస్తే నిర్బంధంగా సంస్థచే పనులను చేయించి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. బారాస హయా ములో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి, నిర్మాణ లోపం పైన సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలి. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపైన న్యాయ విచారణ జరిపించి నష్టపరిహారాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి . అదే సందర్భంలో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అవినీతికి పాల్పడకుండా చర్యలు చేపడుతూనే అతిక్రమిస్తే కఠిన చర్యలకు పూనుకోవాలి . ప్రభుత్వం స్వయంగా పారిపాలనకు సంబంధించి పొదుపు చర్యలను చేపట్టి నామినేటెడ్ పోస్టులతో పాటు ఇతర పదవులకు పేద అట్టడుగు వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. తద్వారా అట్టడుగు వర్గాల్లో ఆత్మగౌరవాన్ని సాధించాలి అంతిమంగా సమ సమాజాన్ని స్థాపించడానికి సవాల్గా ప్రభుత్వం సంపదను సృష్టించడం ద్వారా ప్రజా సంపదను ప్రజలందరికీ పంపిణీ చేసి సగర్వంగా నిలబడగలిగే నూతన ఆర్థిక వ్యవస్థ అంకురార్పణకు కృషి జరగాలి . ఇదంతా స్థిరమైన, ప్రజల పట్ల బాధ్యత కలిగిన , అనుమానాలు అంతర్గత కలహాలకు తావులేని ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం . ఆ నమూనాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే దోపిడీ వ్యవస్థ స్థానంలో సమ సమాజాన్ని చవి చూడగలం. ఈ మార్పులన్నీ ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు కానీ గమ్యాన్ని లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆదర్శ మార్గంలో గమనాన్ని సమర్థవంతంగా కొనసాగించాలని ప్రభుత్వానికి బుద్ధి జీవులు మేధావులు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు సూచనలు హెచ్చరికలు సలహాలు చేస్తున్నారు. సలహాలను హెచ్చరికలను పెద్ద మనసుతో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ద్వారా ప్రజా ప్రయోజనాలను తీర్చగలిగే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధ పరిపాలన రూపంలో తెలంగాణ రాష్ట్రంలో సాకారం చేయాలన్నదే ప్రజల అభిమతం. ప్రజలను వంచించిన బారా సా పార్టీని ప్రతిపక్ష స్థానానికే పరిమితం చేసి ప్రజాస్వామ్యాన్ని, మానవ పౌర హక్కులను కాపాడి, అణచివేత, కేసులు లేనటువంటి ఆదర్శ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఆ వైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత చొరవ చూపుతోందని ఆశిద్దాం.
--- వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)