నగర నిజం తెలుగు దినపత్రిక కథనానికి స్పందన
వనపర్తి బంగారు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరం
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా ఇన్చార్జి లీగల్ మీటాలాజి అధికారి జి, రవీందర్
వనపర్తి, ఏప్రిల్ 30 (నగర నిజం) : నగర నిజం తెలుగు దినపత్రికలో వెలువడిన కథనానికి స్పందనగా వనపర్తి జిల్లాలో తూనికల కొలతల శాఖ అధికారులు బంగారు దుకాణాలపై విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లా ఇన్చార్జి లీగల్ మిటాలజీ అధికారి జి రవీందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రముఖ బంగారు షాపులను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో వినియోగిస్తున్న తూనికలు, ఎలక్ట్రానిక్ బరువు యంత్రాలు, ప్రమాణీకరణ సర్టిఫికెట్లు, ముద్రలు వంటి అంశాలను అధికారులు సవివరంగా పరిశీలించారు.
ప్రతి బంగారు ఆభరణం అమ్మకంలో వినియోగదారులకు సరైన బరువు అందుతోందా లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. తూనికల పరికరాలు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా, వాటికి చెల్లుబాటు అయ్యే ధృవీకరణ ముద్రలు ఉన్నాయా అనే అంశాలను తనిఖీ చేశారు. కొన్ని దుకాణాల్లో చిన్నపాటి లోపాలు గుర్తించిన అధికారులు వెంటనే సరిదిద్దాలని సూచనలు ఇచ్చారు.
అలాగే, బంగారు ఆభరణాల విక్రయంలో పారదర్శకత పాటించాలనే దిశగా బిల్లు వివరాలు స్పష్టంగా ఇవ్వాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులకు బరువు, ధర, శుద్ధత వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా 3 వైన్ షాపులో తనిఖీలు చేపట్టిన 1 వైన్ షాప్ కు జరిమానా విధించడం జరిగింది ఎవరైనా ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరల విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవు అని ఆయన సందర్భంగా అధికారి జి రవీందర్ మాట్లాడుతూ, వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని తెలిపారు.
వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తూనికలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమానాలు ఉంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా తరచూ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ చర్యలతో బంగారు వ్యాపారాల్లో పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారుల విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.