చర్ల సీహెచ్‌సీలో ఆరు నెలల్లో 100 శస్త్రచికిత్సలు

Apr 30, 2026 - 18:29
 0  0
చర్ల సీహెచ్‌సీలో ఆరు నెలల్లో 100 శస్త్రచికిత్సలు

స్థానిక గిరిజనులకు వరంగా మారిన ప్రభుత్వాసుపత్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిసర ప్రాంతాలకు వైద్య సేవల్లో కీలకమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రి గత ఆరు నెలల్లో 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి మరో మైలురాయిని సాధించింది.

గతంలో చర్ల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ట్యూబెక్టమీ వంటి శస్త్రచికిత్సల కోసం రోగులు 56 కి.మీ దూరంలోని ఏరియా ఆసుపత్రి భద్రాచలం వరకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రోగులపై ఆర్థిక భారం, శారీరక ఇబ్బందులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం సిజేరియన్ వంటి ప్రధాన శస్త్రచికిత్సలతో పాటు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.

భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సూచన మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించి ఆరు నెలల క్రితం చర్ల ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు సమకూర్చారు. అలాగే మాతృ సేవలకు అవసరమైన ప్రసూతి, పిల్లల, మత్తు వైద్య నిపుణులను నియమించారు. దీంతో స్థానికంగా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి గిరిజన ప్రాంతాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.

జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి:

ప్రస్తుతం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ చర్ల ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటీవలే ఒక రేడియాలజిస్ట్ వైద్య నిపుణురాలిని నియమించారు. అలాగే అత్యవసర సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, ముగ్గురు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

మరింత విస్తృత సేవల దిశగా కృషి – డీసీహెచ్ఎస్ డా. రవి బాబు:

డీసీహెచ్ఎస్ డా. రవి బాబు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు మద్దతుతో మరింత విస్తృత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 100 ట్యూబెక్టమీ శస్త్రచికిత్సల మైలురాయి సాధించినందుకు చర్ల ఆసుపత్రి వైద్య బృందం డా. కె. శ్రావణి, డా. కె. శివ రామకృష్ణ ప్రసాద్ మరియు ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని అభినందించారు. అవసరమైన మద్దతు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఓపీ గదుల ఏర్పాటు, పరికరాల మంజూరు చేసిన ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. చర్లలో నిర్మాణంలో ఉన్న 30 పడకల నూతన భవనం పూర్తయిన తర్వాత మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమని పేర్కొన్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు:

చర్ల ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి చిన్న అవసరానికీ భద్రాచలం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణి మహిళలకు చర్ల ఆసుపత్రి ఎంతో అనుకూలంగా మారిందని, దీంతో ఆర్థిక భారం మాత్రమే కాకుండా ప్రయాణ ఇబ్బందులు కూడా గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333