దేశంలో ఏం జరుగుతుంది...!
ఉచిత పథకాలు పప్పు, బెల్లాలా పంచి పెట్టడానికి...!
ఉచితంగా పంచుకుంటూ పోతే పైసా మిగలదు...!
భారతదేశ ప్రజలు అంటే కేవలం ఓట్లు మాత్రమే వేసే యంత్రాలా...? కేవలం ఓట్లు అమ్ముకునే చేవచచ్చిన చేతగాని వాళ్ళా?
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలు ఉచిత పథకాలు ఎలా ప్రకటిస్తాయి...?ఉచిత పందదేరాలతో ఆర్థిక అభివృద్ధికి దెబ్బ అంటూ సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై వైఖరి మార్చుకుంటాయా...?
ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఏకీభవిస్తాయా...?
✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
ప్రస్తుత దేశంలో ఉచిత పథకాలకు చాలా క్రేజ్ ఉంది. ఉచిత పథకాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు ఓట్లు వేయించుకొని అధికారం చేపడుతున్నాయి. ప్రజలను ఏ పని చేయకుండా అన్ని ఉచితంగా అందించి ఒక సోమరుల్లాగా తయారు చేయడానికి దేశంలోని అన్ని పార్టీలు పోటీలు పడుతున్నాయి. ప్రజల లోని అమాయకత్వాన్ని, పేదరికాన్ని, సగటు సామాన్యుడి గుండె ఆశలను ఆసరాగా చేసుకొని ఉచితంగా పథకాలు ఇస్తున్నామంటూ ఊదరగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టి తాము చెప్పిన హామీలలో కొన్నింటినీ మాత్రమే అమలు చేస్తూ ఒకరకంగా ప్రజలను మోసం చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా ఎలాంటి పథకాలు అవసరం లేనప్పటికీ, తప్పకుండా అవసరం ఉన్న విద్య, వైద్యాన్ని మాత్రం ప్రైవేట్ రంగంలో ప్రోత్సహిస్తూ సగటు జీవి సంసార సంపాదన అంతా విద్య, వైద్యానికి ఖర్చు అయ్యేలాగా చేసి ప్రజలను బికారులుగా చేస్తున్నాయి. విద్య, వైద్యం కోసం ఉన్న డబ్బులంతా తగలేస్తున్న ప్రజలు చివరికి జీవన యానం సాగడానికి ప్రభుత్వాలు అందించే ఉచితాలపై ఆధారపడేలా పాలకులే చేయడం విచిత్రమైనా, విడ్డూరమైనా నేడు భారత ప్రజాస్వామ్యంలో జరుగుతున్న వాస్తవం ఇదే.
తమిళనాడు ప్రభుత్వ ఉచిత విద్యుత్ ప్రకటనతో మరోసారి చర్చనీయాంశంగా మారిన ఉచిత పథకాలు
తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా 100 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామని ప్రకటించడంపై తమిళనాడు విద్యుత్ బోర్డు రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 లోని నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఉచిత విద్యుత్ ప్రకటన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విపుల్ ఎం అంజలి పంచోలి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నేడు దేశమంతటా మరోసారి చర్చకు దారితీసాయి. ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు ప్రజలను ఉచిత పథకాలతో బుజ్జగిస్తున్నారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అసలు దేశంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రకటించే ఇలాంటి ఉచిత పందేరాలతో ఆర్థిక అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. అసలు ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలు రెవిన్యూ నోటితో కొట్టుమిట్టాడుతున్నాయని, అప్పులతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని, అలాంటప్పుడు నిధులు లేనప్పటికీ ఉచిత పథకాలు ప్రకటించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ఒక దశలో తీవ్ర అగ్ర వ్యక్తం చేస్తూ ఉచిత పథకాలు అంటే అవి ఏమన్నా పప్పు, బెల్లాలా అందరికీ ఉచితంగా పంపిణీ చేయడానికి అని పేర్కొనడం గమనించదగ్గ విషయం. సంవత్సరాలుగా ప్రభుత్వాలు పాలన అందిస్తాయని, ఎన్నికలు వస్తున్నాయంటే మాత్రం ఉచిత పథకాలు ప్రకటిస్తారని, ఇలా ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతే చివరికి కేంద్రం, రాష్ట్రాల వద్ద పైసా మిగలదని స్పష్టం చేసింది. దేశ అభివృద్ధిని ఆటంకపరిచే ఇలాంటి ఉచితలపై పునః సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. నిజంగా ఉచిత పథకాల అవసర ఉందా లేదా అన్న విషయాలను పరిగణలోనికి తీసుకోకుండా నిధులను విచక్షణారహితంగా ఖర్చు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఉచితాలు కాదు ఉపాధి మార్గాలు వెతకండి... రహదారుల నిర్మాణం, విద్య వైద్యాలకు నిధులు కేటాయించండి...పని సంస్కృతిని పెంపొందించండి...!
వాస్తవానికి అనేక రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో ఉన్నాయని, అప్పులతో నెట్టుకొస్తున్నాయని సుప్రీంకోర్టు వివరించింది. రాష్ట్రాల వద్ద రెవెన్యూ లోటు లేకుండా అదనంగా నిధులు ఉంటే రహదారులు నిర్మాణం చేయాలని, విద్య కేటాయించడం ద్వారా నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించవచ్చని, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కోసం నిధులను కేటాయించాలని, ప్రజలకు ఉపాధి మార్గాలు చూపెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉచితంగా ఆహారం అందించడం, సైకిల్ ఇవ్వడం, విద్యుత్ ఇవ్వడం, ఇలాంటి పథకాలు ప్రజలకు అంతగా అవసరం లేనివని, ఉపాధి మార్గాలు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అసలు ఉచిత పథకాలు అర్హులకు అందిస్తున్నారా, భూస్వాములకు కూడా, పన్నులు చెల్లించే స్తోమత ఉన్న ధనవంతులకు కూడా అందిస్తున్నారా అని ప్రశ్నించింది. ముఖ్యంగా దేశ ప్రజలలో పని సంస్కృతికి పునాది వేయాలని చెప్పింది. అర్హులకు కొంతమేర అవసరమంటే ఉచిత పథకాలు అందించవచ్చు అని, అయితే దేశంలో మంచి ఆర్థిక స్థితిలో ఉన్నవారికి కూడా ఉచిత పథకాలు అందించడం దేశ అభివృద్ధికి హానికరమని స్పష్టం చేసింది. ఉన్నవారికి, లేనివారికి అనే తేడా లేకుండా అందరికీ ఉచిత పథకాలు అందిస్తూ పోతే ఆ ఆర్థిక భారం చివరికి పన్నులు చెల్లించే వారిపై పడుతుంది కదా అని వివరించింది. ఉచిత పథకాలపై పునః సమీక్ష చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రజలను సోమరులను చేస్తున్న ప్రభుత్వాల విధానాలు... కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మారుతున్న దేశ ప్రజలు
నేడు భారతదేశంలోని ప్రజలు అంటే ఉచిత పథకాలు తీసుకొని ఓట్లు వేసే యంత్రాలుగా మారుతున్నారని వ్యంగ్యంగా ప్రపంచంలోని ఇతర దేశాలు విమర్శలు చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓట్లను కూడా అమ్ముకునే బిచ్చగాళ్లుగా, దళారులుగా, చేవ చచ్చిన చేతగాని వాళ్లుగా భారత ఓటర్లు ప్రపంచంలోనే పేరు పొందారు అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఓట్లు వేసినాక ప్రజలను, వారి బాగోగులను పట్టించుకునే తీరిక, ఓపిక ఈ దేశ రాజకీయ నాయకులకు, వారి పార్టీలకు, పాలకులకు లేవు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధానం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానం కూడా దేశంలోని ప్రజలను సోమరిపోతుల్లాగా తయారు చేయడానికి మాత్రమే ఉచిత పథకాలు ఉపయోగపడుతున్నాయని మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉచిత పథకాలు అందుతున్న ప్రజలు ఏ విధంగా పని పాటా లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారో వ్యంగ్య అర్థాలతో కూడిన అనేక ప్రసారాలను చూస్తున్నాం. ఉచిత పతకాలకు అర్హుడా,కాదా అన్న విషయాలను పాలకులు బేరీజు వేసుకోకుండా అన్ని రకాలుగా మంచి హోదాలో ఉన్న, ఆర్థిక స్థితిలో ఉన్న వారికి కూడా ఉచిత పథకాలు అందించి ఓట్లను గుండు గుత్తగా తమ తమ పార్టీలకు పడేవిధంగా రాజకీయ పార్టీలు పావులు కలిపి ఉచితాలు అందించి, అమలుకు నోచుకోని హామీలు అంటగట్టి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఎన్నికల అప్పుడు అందించే కరెన్సీ నోటు, ఆల్కహాల్ సీసాకు, పలు రకాల ప్రలోభాలకు ఓటును దారా దత్తం చేస్తూ, అధికారంలోకి వస్తే పార్టీ ఏం చేయబోతుందో, ఎంత మేర ఉచితా లను అందిస్తారు అన్న విషయాలను ఓటర్లు పరిగణలోనికి తీసుకొని ఉచిత పథకాలు ఇస్తున్న పార్టీలకే అధికారం కట్టబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మిగులుతుందని విజ్ఞానవంతులు, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన విలువైన ఓటు వజ్రాయుధం లా కాకుండా అమ్ముకునే సరుకుగా ఈ దేశ పాలకులు భావించడం సిగ్గుచేటు, దేశ ప్రజలను అవమానపరిచినట్లే. ఈ మేరకు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పరిశీలించి ఉచిత పథకాలపై వెనకడుగు వేయాలని, ఉచిత పథకాలు తప్పనిసరిస్థితిలో అందిస్తే అర్హులైన పేదలకు మాత్రమే అందించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వాలు తమ దగ్గర నిధులు బాగా ఉంటే విద్య, వైద్య రంగాలకు, రహదారుల నిర్మాణాలకు, ఉపాధి మార్గాలకు కేటాయించాలని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశం చేయడం మరొక మంచి మార్పుగా అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వాలు తమ వద్ద ఎక్కువగా నిధులుంటే ఉచిత పథకాల బదులు సుప్రీంకోర్టు చెప్పినట్లు విద్య, వైద్యం, రహదారులు, ఉపాధికోసం కేటాయించి మంచి భవిష్యత్తుతో కూడిన భారత దేశ నిర్మాణానికి పాలకులు కట్టుబడి ఉండాలని మనమూ ఆశిద్దాం.