గిరిజన తండాల్లో ఘనంగా సీత్లా పండుగ వేడుకలు
గిరిజన తండాల్లో సంప్రదాయంగా సీత్లా పండుగ సంబురాలు
గిరిజన ఆడబిడ్డలు, పశువులు, పంటల రక్షణకై మంగళవారం చల్లని నైవేద్యాలతో శీతలా మాతకు పూజలు.
తిరుమలగిరి 08 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండల కేంద్రం మర్రికుంట తండా గ్రామపంచాయతీలో బంజారా గిరిజన వాసులు తమ సాంప్రదాయ పండుగ ‘సీత్లా పండుగ’ను మంగళవారం రోజున తండాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేసవి తాపం, అంటువ్యాధుల నుండి బిడ్డలు, పశువులు, పైరు పంటలను కాపాడాలని కోరుతూ ప్రతి ఏటా మంగళవారం రోజునే ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజామునే మహిళలు ఇళ్లు, పశువుల కొట్టాలను శుభ్రం చేసి సున్నం కొట్టారు. ఆచారం ప్రకారం ఈరోజు పొయ్యి వెలిగించలేదు. సోమవారం రాత్రే వండిన చల్లని అన్నం, గుగ్గిళ్లు, పెరుగు, వేపాకులను శీతలా మాతకు నైవేద్యంగా సమర్పించారు. ‘సీత్లా’ అంటే చల్లనిది అని అర్థం. వేడి వల్ల వచ్చే రోగాలను చల్లబరచమని తల్లిని వేడుకున్నారు.తండా చివర ఉన్న వేప చెట్టు కింద 7 రాళ్లను అమ్మవారి ప్రతిరూపాలుగా నిలిపి పసుపు, కుంకుమలతో పూజించారు. ఇంటి గుమ్మాలకు వేప మండలు కట్టి, పిల్లలకు, పశువులకు పసుపు కలిపిన నీళ్లు చల్లారు. ఆడపిల్లలకు ఒడిబియ్యం పోసి సంతాన సౌభాగ్యం కలగాలని దీవించారు.
పశువులు, పంటలే ప్రాణం:
బంజారాల జీవనాధారం పశుపోషణ, వ్యవసాయం కావడంతో పూజలో వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. పశువులకు వేపాకు నీళ్లు తాగించి, చర్మవ్యాధులు రాకుండా, పాడి వృద్ధి చెందాలని మొక్కుకున్నారు. నైవేద్యంగా పెట్టిన 9 రకాల ధాన్యాలను సాయంత్రం పొలాల్లో చల్లారు. దీనివల్ల పంటకు చీడపీడలు సోకవని, సకాలంలో వర్షాలు కురిసి భూమి చల్లబడుతుందని గిరిజన రైతులు విశ్వసిస్తారు.
సాంస్కృతిక వైభవం:
ఈ సందర్భంగా తండా మహిళలు సంప్రదాయ అద్దాల దుస్తులు, భారీ వెండి ఆభరణాలతో అలంకరించుకొని డప్పు వాయిద్యాల నడుమ సీత్లా పాటలు పాడుతూ నృత్యం చేశారు. తండా పెద్దలు మాట్లాడుతూ, “ఇది కేవలం పండుగ కాదు, మా పూర్వీకుల నుండి వస్తున్న వైద్య విజ్ఞానం. వేసవిలో చల్లని ఆహారం, వేపాకు వాడకం రోగాలను దూరం చేస్తుంది” అని తెలిపారు. ఈ పండుగ సందడిలో గిరిజన తండ ఆడబిడ్డలు, గ్రామ తండ పెద్దలు, గ్రామ నాయకులు తండావాసులు అందరూ ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ పండగ రాష్ట్రవ్యాప్తంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో తదితర గిరిజన ప్రాంతాల తండాలన్నీ సీత్లా సంబురాలతో సందడిగా మారాయి.