దంత విద్యపై తెలంగాణ ప్రభుత్వం కొంతైనా ఆలోచించకపోతే ప్రయోజనం ఏముంది.?
ఒక్క ప్రభుత్వ కళాశాల అవసరాలు తీరుస్తుందా.? సాధారణ విద్య లాగా దంత విద్యను కూడా పేద వర్గాలకు దూరం చేయడమే ప్రభుత్వ విధానమా
--- వడ్డేపల్లి మల్లేషము
ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యం అందుకు సంబంధించిన అవకాశాలను విస్తృతం చేయగలిగే సామాజిక స్ఫూర్తి ఉన్న ప్రభుత్వాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆ బాధ్యతను ప్రైవేటు వర్గాల మీద నెట్టి తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల ప్రచారాలను, సభలు సమావేశాలను, వాగ్దానాలను ఎత్తుగడలుగా ఎంచుకున్న ప్రభుత్వాల తీరు మనందరికీ తెలియనిది కాదు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే పాఠశాల స్థాయి విద్యార్థులు 60 లక్షలు ఉంటే అందులో 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలోనే చదువుతున్నారంటే ప్రభుత్వం ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ రంగాన్ని పెంచి పోషిస్తున్నామని నెపముతో కోట్లాది రూపాయలను ఇంటిగ్రేటెడ్ ఇతర స్కూల్స్ పేరుతో నిర్మాణం చేపట్టి ప్రస్తుత ఉన్నటువంటి భవనాలను విద్యార్థుల విద్యను నిర్వీర్యం చేయడం తప్ప ప్రభుత్వం చేస్తున్న ప్రయోజనకరమైన పనులు విద్యారంగంలో ఏమీ లేవు.ఈ విషయంపై ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు హెచ్చరించినప్పటికీ ప్రస్తుత విద్యా విధానాన్ని సంస్కరించడంతోపాటు ఉన్న పాఠశాలలను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది బలోపేతం చేయాలని కోరుతుంటే ఆ విషయాన్ని పక్కనపెట్టి కొత్త భవనాలకు శ్రీకారం చుట్టడం అంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే ప్రభుత్వ పెద్దలకు వాటాలు పంచడమేనని సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కళాశాలలకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కోట్లలో బకాయి ఉండడం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్లు చేతికి అందక విస్తు పోతున్నారు. ప్రభుత్వం తన విద్యార్థులకు సంబంధించి పూర్తిస్థాయిలో కళాశాలల ను తానే ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యను అందిస్తే బాగుండేది కానీ దానికి భిన్నంగా ప్రైవేటు కళాశాలలను విశ్వవిద్యాలయాలను పెంచి పోషిస్తూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేరున ప్రజాధనాన్ని ప్రైవేటు వర్గాలకు అప్పజెప్పడం అంటే తన బాధ్యతను విస్మరించడం కాదా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఏనాడో నిర్మించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధంలో ఉన్న ఏకైక దంత వైద్యశాల తప్ప ఇప్పటికీ మరొక్క దంత వైద్యశాల ప్రభుత్వ రంగంలో లేకపోవడం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటిదే కదా .విద్యా ప్రభుత్వ రంగంలో కొనసాగాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారు, పాలకులకు సూచన కూడా చేశారు. కానీ అదే సందర్భంలో తన అనుమానాన్ని కూడా వ్యక్తం చేయడం పాలకుల యొక్క అవకాశవాద ధోరణికి ప్రతిబింబంగా కనబడుతున్నది. '" ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో నాణ్యతగా కొనసాగించడానికి ఇష్టపడవు ఎందుకంటే విద్య ద్వారా చైతన్యం వైద్యం ద్వారా ఆరోగ్యం ప్రజలకు సొంతమైతే ప్రజలు పాలకులకు తలవంచి బతకరు, సేవకులుగా మిగలరు, ప్రశ్నించి ప్రతిఘటిస్తారు, పాలకులను అడుగడుగునా తమ హక్కుల కోసం నిలదీస్తారు. ఈ ప్రతిఘటనను పాలకులు అంగీకరించరు కదా!"" అంటూ చేసిన వ్యాఖ్య పాలకుల స్వభావాన్ని బట్ట బయలు చేస్తున్నది. 60 ఏళ్ల కింద డిఎస్ కొఠారి చేసిన కామన్ స్కూల్, ప్రభుత్వ రంగంలో విద్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు వరుసగా 10%, 30% కేటాయించాలని చేసిన సిఫారసులు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క శాతం కూడా అమలు చేయడానికి ఇష్టపడ లేదంటే ప్రైవేటు వర్గాన్ని పెంచి పోషించడమే తమ ఉద్దేశం కాక మరేమిటి? అందుకు తెలంగాణ రాష్ట్రంలో దంత విద్య ఉదాహరణగా కొట్ట వచ్చినట్లు తన నిస్సహాయతను చాటుకుంటున్నది.
పేదలు చదువు" కొంటే" పాలకులు ఎందుకు?
ఏ రాష్ట్రంలోనైనా ప్రజల అవసరాలను తీర్చే స్థాయిలో పాఠశాలలు కళాశాలలు విశ్వ విద్యాలయాలను గణనీయంగా స్థాపించి ప్రభుత్వ రంగంలో విద్యావసరాలు తీర్చడం కనీస ధర్మం. కానీ పాలకులు క్రమంగా బాధ్యతను విస్మరిస్తున్నారు అదే స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగై ప్రైవేటు రంగంలోకి చేరిపోవడాన్ని మనం దేశవ్యాప్తంగా గమనించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాల రివాజు లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ హయాంతో పాటు నేటి వరకు ఐదు విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నవి అంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు మంజూరు చేయక పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తూ ఉంటే క్రమంగా ప్రజలు కూడా ప్రైవేట్ రంగం బాట పట్టాలని, లక్షలు కోట్ల ఫీజులు చెల్లించి ప్రైవేట్ రంగానికి దోచి పెట్టాలనే ఉద్దేశం పాలకుల ఉంటే ఎట్లా? పేదలు అణగారిన వర్గాలు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ రంగంలోవిద్యను కొనసాగించి వాళ్ళ కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచడానికి ఉద్దేశించే కదా నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక దంత వైద్య కళాశాల తప్ప వాటి సంఖ్యలో ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాకపోవడం కనీసం సీట్ల సంఖ్య పెంచకపోవడం మరొక యూనిట్ ను కూడా ప్రారంభించకపోవడం అంటే ప్రజా అవసరాలను తాకట్టు పెట్టడమే అవుతుంది. దంత విద్య పైన ఆసక్తి ఉన్నవారికి లక్షలు కోట్లు చెల్లించి ప్రైవేట్ రంగంలో విద్యను అభ్యసించక తప్పడం లేదు. ఆసక్తి ఉన్న డబ్బు లేని నిరుపేదలు విద్యకు దూరం కావడమే అవుతుంది. విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించలేని పాలనా వ్యవస్థ తమ నిస్సహాయతను వ్యక్తం చేసి మాతో సాధ్యం కాదు అంటే న్యాయవ్యవస్థ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పాలకులను హెచ్చరిస్తే అయినా గుణపాఠం వస్తే బాగుండేది. సాధారణ మెడికల్ కళాశాల సంఖ్య గణనీయంగా పెరుగుతు ప్రస్తుతం 36 కు చేరుకున్నప్పటికీ అక్కడ కూడా విద్యావకాశాలు అంతంత మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సౌకర్యాలు ఫ్యాకల్టీ లేక పేద పిల్లలు సైతం ప్రైవేటు కళాశాలలో చేరడాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. అరకొ ర సౌకర్యాలతోని అయినా ఈ రాష్ట్రంలో 36 కు చేరుకున్న మెడికల్ కాలేజీ లతో పోల్చుకున్నప్పుడు దంత కళాశాల ను పెంచకపోవడంతో ఎంతోమంది అప్పులు చేసి ప్రైవేటు కళాశాలలో చేరి తమ కొనుగోలు శక్తిని గణనీయంగా కోల్పోయి పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. గతంలో వరంగల్ నల్లగొండ జిల్లాలలో రెండు దంత వైద్య కళాశాలలకుఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రాష్ట్రo ఏర్పడి 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆ ప్రస్తావనే లేదు అంటే ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అంతా ఇంతా కాదు.
దంత సమస్యలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలలు కళాశాల పైన ఆధారపడి ఉంటే ఆ స్థాయిలో వైద్యశాలలు కళాశాలలు లేకపోవడంతో ట్రీట్మెంట్ కోసం లక్ష లా ధిరూపాలు ఖర్చు చేయవలసి రావడం కూడా ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగాను హైదరాబాదు పరిసరాల్లోనూ పెద్ద మొత్తంలో ప్రైవేటు కళాశాలలు ఆవిర్భవిస్తుంటే వాటిలో చదువుకోవడం గుది బండ గా మారి పేదల ఆసక్తిని నీరుగారుస్తున్నది. కేవలం 50 సీట్లు ఉన్నటువంటి ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఒకే ఒక్క యూనిట్ అవసరాలను ఏ మూలకు తీర్చకపోగా ఆ కళాశాలలో కూడా ఫ్యాకల్టీ ప్రాథమిక అవకాశాలు సౌకర్యాలు లేక వెలవె ల పోతున్నట్లుగా తెలుస్తున్నది.
బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే వెంటనే మరో రెండు మూడు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలతో పాటు బోధనాసుపత్రులను అనుబంధంగా ఏర్పాటు చేసి అదే స్థాయిలో పీజీ సీట్లను పెంచడం ద్వారా కొంతవరకైనా పేదలకు మరింత దంత విద్యను అందుబాటులోకి తేవాలి. ఆసుపత్రుల నిర్మాణం వల్ల కూడా వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 7000 మంది జనాభాకు ఒక్క దంత వైద్యులు ఉండాల్సి ఉన్నా ఆ నిష్పత్తి కనుచూపుమేరలో కూడా లేదు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా రంగం పట్ల పాలకుల ఆసక్తి బాధ్యత పెరగనంత కాలం సాధారణ పాఠశాల విద్య, కళాశాల విశ్వవిద్యాలయ విద్యతోపాటు, ఆయుర్వేద హోమియోపతి యునాని అల్లోపతి అన్ని రకాల వైద్య కళాశాలల లో విద్యాసంస్థలకు ప్రభుత్వ రంగంలో ఇదే దుర్గతి పడుతుంది. అనివార్యంగా ప్రైవేట్ రంగంలోకి నెట్టివేయబడడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి దర్పణం పడుతుంది. "ప్రభుత్వ రంగంలో పాఠశాల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకువిద్య బలోపేతానికి ప్రజల, విద్యార్థుల, ప్రజాస్వామ్యవాదుల బలమైన పోరాటం ఉద్యమ రూపం దాల్చకుండా పాలకులు స్పందించే అవకాశం చాలా తక్కువ. ఇటీవల కొన్ని సంఘటనలతోనైనా ప్రజా ఉద్యమాలు ఉచిత విద్య వైద్యం కోసం ముమ్మరంగా రావాల్సిన అవసరం ఉంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)