కవులు రచయితలకు పోరాట స్ఫూర్తి లేకుండా ప్రజలను కార్యోనుముకులను చేయలేరు
ప్రశ్నించే తత్వం, ప్రతిఘటన ధోరణి, సమస్యల పట్ల ఆందోళన, ఆవేదన, సామాజిక చింతన, పేదలు వృద్ధుల పట్ల గౌరవం అవసరం.
నాటి నుండి ముఖ్యంగా స్వాతంత్ర సమూపార్జననాటి నుండి 80 సంవత్సరాలుగా ప్రజల కష్టాలు కన్నీళ్లు తీ ర లేదు. పైగా సంపన్నుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ ఉంటే అంటే అదే స్థాయిలో పేదరికం కూడా కొండలా పె రిగి వెక్కిరిస్తుంది. సమాజంలోని ప్రజల జీవితం, సామాజిక ఆర్థిక అంశాలకు భిన్నంగా ఆటవిడుపుగా రాసుకునేది సాహిత్యం కాదు. జీవితంలో అంతర్భాగమే సాహిత్యం కానీ జీవితంలోని ఆటుపోట్లను, ఆరోహణ అవరోహణలను, ఎత్తు పల్లాలను, మూల మలుపులను,తప్పుడు తోవలను సరి చేయగలిగిన సత్తా సాహిత్యానికి ఉంది కనుకనే సాహిత్యంను గౌరవించని వాళ్లు ఎవరు ఉండరు. అనేక సందర్భాలలో అంతో ఇంతో చైతన్యం ప్రజా దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా రచయితలుగా మీరు ప్రజల పక్షాన పని చేయాలని పిలిపించినటువంటి వైనా న్ని గమనిస్తే రచయితలు కవులకు ఎంత సామాజిక బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ""సమాజంలోని భిన్న అంశాలు, అందులో భాగమైన ప్రజల యొక్క జీవిత కష్టానష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవమానాలు అవరోధాలు, సంపన్నులతో రాజకీయ నాయకులతో ప్రభుత్వాలతో ప్రజలు పీడి o చబడుతున్న ధోరణులు, సహజ సంపదను పొందకుండా అడ్డుకునే ప్రయత్నాలు, సంపద కేంద్రీకరణ, బడ్జెట్లో కోట్లు కేటాయించిన సామాన్యులకు అందని వైనం, అసమానతలు అంతరాలు, దోపిడీ పీడన ,పాలకులే ఒక వర్గం వైపు మద్దతుగా నిలబడి ప్రజలకు చేస్తున్న అన్యాయం ఈ దేశంలో అంతా కాదు. " పేదలు నిర్భాగ్యులు అభాగ్యులు నాగరికతకు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలు పేదలు వృద్ధులు వికలాంగులు నిరక్షరాస్యులు తో పాటు నాగరిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్లు కూడా ఈ అన్యాయాలకు బలవుతున్న వాళ్ళు కోటానుకోట్ల మంది ఈ దేశంలో. ప్రజల ఓట్లతో ప్రజల కష్టనష్టాలను తీర్చడానికి అని ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మాత్రం ఆటవిక ప్రాంతాలలోనూ నాగరికత ప్రాంతాలలోనూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలతో ఆచరణ లేని ఆచరణ సాధ్యం కానీ హామీలు వాగ్దానాలతో కాలం వెళ్ళదీస్తుంటే పేదరికం మరింత పెరిగి పేదలు మరీ పేదలుగా మారుతూ తమ జీవితం ప్రశ్నార్థకంగా మారిన వేళ వైద్యం, ఉపాధి, విద్య కొరవడి తమ జీవితంలో సంపాదించిన ఆదాయంలో సింహ భాగం ఖర్చవుతూ ఉంటే ఇక వాళ్లకు మిగిలింది ఆత్మహత్యలే శరణ్యమా? అదే కదా మనం ఆచరణలో చూసేది. అదేనా పాలకుల బాధ్యత.?
రాజకీయ పార్టీలు మారుతూ ప్రభుత్వాలు ప్రతిపక్షాలుగా పారుతున్నాయి తప్ప వాళ్ల లక్ష్యాలు గమ్యాలు ప్రజా ప్రయోజన చట్టాల తీరు మాత్రం పైపై పూత గానే మిగిలిపోతున్నది. అంతేకాదు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లో భాగమైన అనేక వర్గాలు విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, చేతి వృత్తుల వాళ్లు, చిరు వ్యాపారులు, వ్యవసాయ కార్మికులు, చిన్న కాంట్రాక్టర్లు నిత్యం ప్రభుత్వాలపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ సమస్యలు పరిష్కరించే బదులు అణచివేత ఆవ లంబిస్తూ అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉంటే బుద్ధి జీవులు మేధావులు ఆలోచన పరు లు సామాజిక బాధ్యత కలిగినటువంటి రచయితలు కవులు చూస్తూ కేవలం వర్ణించడానికి పాకులాడితే సరిపోదు.
చివరి కంటా కర్తవ్యాన్ని నిర్వహించాలి అన్నార్థులు శరణార్థులకు అండగా ఉండాలి :-
"ఆలోచన అవగాహన ముందుచూపు సామాజిక చింతన సమస్యలను అంచనా వేసే ధోరణి పరిష్కార మార్గాలను వెతికే అన్వేషణ పాలకులను పెట్టుబడిదారులను సున్నితంగా హెచ్చరించే ధోరణి కలవాళ్ళు కనుకనే సమాజంలో మేధావులు రచయితలు కవులు కళాకారులకు ప్రత్యేక స్థానం ఉంది. " గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు ఈ సమాజం మనకు అందించిన మేధస్సు విశ్లేషణ ధోరణి పోరాట ప్రతిమ సామాజిక చింతనను ప్రజల కోసం, నోరులేని మూగ జీవుల కోసం, అనాధలు అభాగ్యుల కోసం తప్పకుండా అందించవలసిన బాధ్యత మనపై ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి, వాళ్ల కష్టం నష్టాలు బాగోగు లు విశ్లేషించి, దానికి కారకులను పసిగ ట్టి ప్రజలకు పోరాటం చేసే శ్రమజీవులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ధైర్యాన్ని నూరిపోయాల్సిందే. ప్రముఖ విప్లవకారుడు గద్దర్ అన్యాయాలకు గురవుతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఒక దశలో అన్న మాటలు ఈ సందర్భంగా ప్రస్తావించవలసిందే .""అన్నా అన్నా అంటూ ఆదుకోమని అరిచినంత మాత్రాన మీ సమస్యలు మేం పరిష్కరించడం సాధ్యం కాదు. సమస్యలు కష్టాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే పోరాట ప్రతిభ ఉద్భవించాలి. ఆరాటం ఉంటే తప్ప పోరాటం సాధ్యం కాదు ఆ పోరాటంలో తాడోపేడో తేల్చుకోవడం తాడిత పిడుతుల బాధ్యత హక్కు కూడా" అంటూ కార్యో్న్ ముఖులను చేసిన సంఘటన మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదే పాత్రను కవులు కళాకారులు పోషించవలసిన పరిస్థితి ఈనాడు ఎక్కువగా ఉంది. పిడి తులను ప్రధాన జనజీవన స్రవంతి, పోరాట పందా లో కి తీసుకు వెళ్లవలసిన బాధ్యత ఉద్యమకారులు చైతన్యవంతులైనటువంటి ప్రజలు రచయితలపై ఎక్కువగా ఉంది. ప్రజలను పెద్ద మొత్తంలో కదిలించడం, విషయావగాహన చేయించడం, కార్య క్షేత్రంలో పోరాటం లో నిలబెట్టడం మన బాధ్యత... తేల్చుకునేది ఉద్యమకారులైన ప్రజలే. కానీ వారికి పాలకులు చేస్తున్నటువంటి అక్రమాలు, నడుస్తున్న చరిత్ర, సంపద ఎటు వెళుతున్నది,? పోరాటం చేయాల్సిన అవసరం ఏమిటి? పేదరికం ఎందుకు పెరుగుతుంది? రాజ్యాంగంలో ఏం రాయబడి ఉంది? రాజ్యాంగంలోని నిబంధనలు ఎందుకు అమలు కావడం లేదు? దీనికి మూలం ఎక్కడుంది? అని అవగాహన చేయించే ముందు రచయితలు కవులు అధ్యయనం చేసి పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమాధానాన్ని రాబట్టి అవగాహన చేసుకోవడం అవసరం. సాంస్కృతిక సాహిత్య రంగాలలోని కళాకారులకు పోరాటశక్తి, ఆత్మస్థైర్యము, ప్రతిఘటన ధోరణి, ప్రశ్నించే తత్వం చాలా అవసరం. తాను తెగ కుండా కత్తి తెగది అన్నట్లు తా ను ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి అందిస్తేనే కదా ప్రజలు చైతన్యవంతులు అయ్యేది. అందుకు రచయితలు కవులు తమ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడం, ప్రజల భాషలో రాయడం, వర్ణనలకు కాదు ప్రాధాన్యత వారి మనసులను చూరగోనె విధంగా పాటలు నాటకాలు వీధి నాటకాలు సంభాషణల ద్వారా ప్రజా చైతన్యం చేయాలి కానీ పెద్ద పెద్ద సంపుటాలు కటిన పదాలతో రాస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అది సాహిత్య కారులకే అర్థం కాని పరిస్థితి తప్ప. పేదలు, పేదరికం, వృద్ధులు, అనాధలు, అనగారిన వర్గాల పట్ల కవులు రచయితలకు సానుభూతి గౌరవము దయ వారి సమస్యల పట్ల ఆక్రొశం ఉంటే తప్ప నిజమైన సాహిత్యం ఉద్భవించదు. పాలకులు ప్రణాళిక వేత్తలు కూడా చేయలేనటువంటి పనిని సాహిత్యం చేస్తుంది అని విశ్వాసం నాకుంది. ప్రపంచ చరిత్రను వెతికితే అలాంటి అనుభవాలు ఉన్నాయి. అయితే ఉద్యమకారులు రచయితలు కవులు తమ బాధ్యతను అంకిత భావంతో పోషించి పోరాట స్ఫూర్తితో మునుముందుకే కదలా లి. ఆ వైపుగా సాహిత్య లోకం మరింత ఘాటుగా నిర్ణయం తీసుకుంటుందని దాశరథి కృష్ణమాచార్య మాదిరిగా ఉద్యమం సాహిత్యాన్ని సమాంతరంగా నడిపిన తీరును స్ఫూర్తిగా తీసుకుంటారని సాహితీ లోకానికి విజ్ఞప్తి.
--- వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )