వయోవృద్ధులకు సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత మరియు వయోవృద్ధులపై వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిని ( డి డబ్ల్యు ఓ ) డి.సునంద ముఖ్య అతిథిగా హాజరై వయోవృద్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు OTP, ATM/డెబిట్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని సూచించారు. అలాగే వయోవృద్ధులపై జరిగే వివిధ రకాల వేధింపులను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) శ్రీ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని వయోవృద్ధులకు డిజిటల్ అక్షరాస్యత, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు మరియు సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పోలీస్ శాఖ సైబర్ బ్రాంచ్ ప్రతినిధి శ్రీ రమేష్ చారి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ శ్రీసంగాల అయ్యపు రెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ లక్ష్మారెడ్డి, మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సిబ్బంది, ప్రణామ్ డే కేర్ సెంటర్ నిర్వాహకులు మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు...
జిల్లా సంక్షేమ అధికారి
జోగులాంబ గద్వాల్ జిల్లా